తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో విరచితమైన భూమిక నిర్వహించిన చాకలి ఐలమ్మ 37వ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా పాలకుర్తి నుండి చిదురాల ఎల్లయ్య రాసిన వ్యాసం ఇక్కడ చదవండి :
భారతదేశానికి పర పీడన పాలన నుంచి విముక్తి కోసం స్వాతంత్ర్య పోరు సాగుతున్న రోజులు ఓవైపు... నిజం నవాబు పాలనలో బాధలు భరించలేక నిజాం రజాకార్లను తుదముట్టించేందుకు మహోజ్వల వీర తేలంగాణ విప్లవ సాయిధ పోరాటం మరోవైపు ... భారతమాత విముక్తి కోసం యావత్ దేశం , తేలంగాణ విముక్తి కోసం తెలంగాణ ప్రజలు చేసిన పోరాటం ఒకే కోవకు చెందినవి. భారతమాత విముక్తి పోరాటంలో ఎందరో త్యాగధనులు, పురుషులు, స్త్రీలు, పసిపిల్లలు అమరత్వం పొందితే... నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి పొందేందుకు వీరోచిత పోరాటం చేసిన పసి పిల్లల నుంచి వృద్ధుల వరకు స్త్రీ పురుష భేదం లేకుండా నేలకొరిగిన అమరులున్నారు.
undefined
ఆనాడు జరిగిన తెలంగాణ విముక్తి ఉద్యమంలో మెరిసిన అగ్ని కణమే వీరనారి చాకలి ఐలమ్మ. నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి పొందేందుకు సాగుతున్న పోరు ఐలమ్మ రాకతో భూమి కోసం, భుక్తి కోసం రైతాంగ సాయుధ పోరాటంగా రూపుదాల్చింది. తెలంగాణ సాయుధ పోరాటానికి దిశానిర్దేశం కల్పించి సాయుధ పోరాటాన్ని చరిత్రలో చిరస్థాయిగా నిలిపిన వీరవనిత ఐలమ్మ. వ్యవసాయక విప్లవం రగిలించిన అగ్నికణం చాకలి ఐలమ్మ .... స్త్రీ జాతికి ఆదర్శనీయం.. ఆమె జీవితం మహిళా లోకానికి మార్గదర్శకం. ఆమె పోరాట స్ఫూర్తి, దేశ్ ముఖ్ ను ఎదిరించిన వైనం మహిళా శక్తికి స్పూర్తిదాయకం.
చిట్యాల ఐలమ్మ ఉమ్మడి వరంగల్ జిల్లా రాయపర్తి మండలం పాలకుర్తి నియోజకవర్గంలోని కిష్టాపురం గ్రామంలో సాధారణ రజక కుంటుంబంలో జన్మించింది. అతిపిన్న వయస్సులోనే పాలకుర్తి గ్రామానికి చెందిన చిట్యాల నర్సింహతో వివాహం జరిగింది. వీరికి ఐదుగురు సంతానం. కులవృత్తి చేసుకుంటూ జీవిస్తున్న తరుణంలో పాలకుర్తిలో ఆంధ్రమహాసభ ఏర్పడింది. 1944లో భువనగిరిలో రావి నారాయణ రెడ్డి స్థాపించిన ఆంధ్ర మహాసభ దేవరుప్పుల మండలం కడివెండిలో అదే ఏటా ఏర్పడింది. నల్ల నరసింహులు, ఆరుట్ల రామచంద్రారెడ్డి తదితర నాయకులు పాలకుర్తి కేంద్రంగా 1945లో ఆంధ్ర మహాసభను ఏర్పరిచారు. ఐల్లమ్మతోపాటు అనోతోజు బ్రహ్మయ్య , జీడి సోమనర్సయ్య , మామిండ్ల మల్లయ్య, మామిండ్ల కోంరయ్య , చుక్క సోమయ్య , మామిండ్ల ఐల్లయ్యల ఇంకా మరికొంత మంది యువకులు ఆంధ్ర మహాసభలో చేరారు. ఐలమ్మ ఇల్లే సంఘానికి కేంద్రంగా మారింది. సంఘ నాయకులకు రక్షణ కల్పించడం, భోజన వసతి కల్పించడం ఐలమ్మ పని.
రజాకార్ ఉపసేనాని విస్నూర్ దేశ్ ముఖ్ రాపాక రామచంద్రారెడ్డి ఆయన కుమారుడు జగన్ మోహన్ రెడ్డి ( బాబు దొర )లు 60 గ్రామాలలో ఆడిందే ఆట పాడిందే పాట. ప్రజల మాన ప్రాణాలు దోచుకోవడం, ఎదురు తిరిగిన వారిని హతమార్చడం, తల్లి పాలను పసిపిల్లలకు ఇవ్వకుండా పిండి పారబోయించడం, మహిళలను వివస్త్రలుగా చేసి చుట్టూ కాముడు ఆటలు, పాటలు పాడించడం వంటి హేయమైన పనులు చేసేవారు. రైతుల పంట పొలాలను పశుసంపదను లాక్కోవడం, వెట్టిచాకిరీ చేయించుకోవడం వంటి ఎన్నో అకృత్యాలకు ఒడిగట్టారు. రామచంద్రారెడ్డి కుమారుడు బాబుదొర గ్రామ గ్రామాన ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని గృహ దహనాలు, లూటీలు చేయడం పనిగా పెట్టుకునే వాడు. తనకు రక్షణగా ఖాసిం రజ్వి నాయకత్వాన ఉన్న రజాకార సేనలను పోషిస్తూ విస్నూరులో పోలీసు ఠాణాను నెలకొల్పుకున్నాడు. ఈ క్రమంలో దేశ్ ముఖ్ రామచంద్రారెడ్డి బాధలు భరించిన ప్రజలకు ఆంధ్రమహాసభ ఎడారిలో ఒయాసిస్సూలా కన్పించింది. ఆంధ్ర మహాసభను ప్రజలు ఆదరించడం మొదలుపెట్టారు. విస్నూరు దేశ్ ముఖ్ ఆంధ్ర మహాసభను అంతం చేయాలని పంతం పట్టారు.
ఈ క్రమంలో 1945 ఫిబ్రవరిలో పాలకుర్తి జాతర వచ్చింది. ఈ జాతర సందర్భంగా సంఘం ప్రచారం చేపట్టాలని ఆంధ్రమహాసభ పాలకుర్తి దళం ఆర్గనైజర్ చకిలం యాదగిరిరావు అనుకున్నారు. బహిరంగ సభ ఏర్పాటుకు సంఘం కార్యకర్తలతో చర్చించి కేంద్ర కమిటీకి తెలపడంతో బహిరంగ సభకు ఆరుట్ల రామచంద్రారెడ్డి నిజాం ప్రభుత్వం నుంచి అనుమతి పొందారు. బహిరంగ సభను పాలకుర్తిలో ఏర్పాటు చేశారు. బహిరంగ సభ జయప్రదం అయితే తన పరువు పోతుందని భయపడిన దేశ్ ముఖ్ రామచంద్రారెడ్డి సభను భగ్నం చేసి ఆరుట్ల రామచంద్రారెడ్డని చంపాలని 60 మంది గూండాలను పాలకుర్తికి పంపాడు. రామచంద్రారెడ్డిని చంపేందుకు ఆ గూండాలు స్వైర విహారం చేశారు. దీంతో బహిరంగ సభకు పోలీసు రక్షణ అడిగితే దేశ్ ముఖ్ తో కుమ్ముక్కైన పోలీస్ అధికారి బందోబస్తుకు నిరాకరించారు. దీంతో ఆరుట్ రామచంద్రారెడ్డి బహిరంగ సభ రద్దు చేసుకున్నారు.
సభ రద్దును సంఘం కార్యకర్తలకు తెలిపేందుకు ఆరుట్ల వాలంటీర్ల రక్షణలో ఓ ఇంటిలో ఉండగా రాత్రి 9 గంటల సమయంలో ఓనమాల వెంకని నాయకత్వంలో గూండాలు ఆరుట్ల పై దాడికి ప్రయత్నించారు. దీన్ని పసిగట్టిన సంఘం కార్యకర్తలు గూండాలప్తె ఎదురుదాడికి దిగగా వనమా వెంకని తలపగిలి గూండాలు పలాయనం చిత్తగ్గించారు. ఈ దాడిప్తెన సంఘం కార్యకర్తలైన ఐలమ్మ భర్త నర్సింహ్మ, కొడుకులు సోమయ్య ,లచ్చయ్య, ముత్తిలిగం, ఆరుట్ల రామచంద్రారెడ్డి, డి.సుబ్బారావు, గంగుల సాయిరెడ్డి, మనోహర్ రాపు, కడవెండి ఎర్రమరెడ్డి, కోదండ రాంరెడ్డి , నల్ల నర్సింహులు, అనోతోజు బ్రహ్మయ్యతో పాటు 12మంది పై విస్నూరు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇందులో 10మందిని పోలీసులు అరెస్టు చేసి విస్నూరు పోలిసుస్టేషన్ కు తరలించారు. సుబ్బారావు, ఆరుట్ల రామచంద్రారెడ్డి పాలకుర్తి ప్రాంతంలోని కొండాపురంలో గల గిరిజన ఇండ్లల్లో తలదాచుకున్నారు.
సంఘానికి అండదండలు అందించిన ఐల్లమ్మ కుంటుంబాన్ని పాలకుర్తిలో లేకుండా చేసేందుకు దేశ్ ముఖ్ ప్యూహం పన్నిండు. పాలకుర్తి పట్వారి శేషగిరిరాపును దేశ్ ముఖ్ ఏజెంటుగా ఏర్పాటు చేసుకొని ఐల్లమ్మ కుటుంబంపైకి ఉసి గొల్పిండు. దేశ్ ముఖ్ అండతో విర్రవీగిన శేషగిరిరాపు ఐల్లమ్మ కుంటుంబాన్ని పొలం దున్నేందుకు నాగళ్ళను పంపమనగా అందుకు ఆమె తిరస్కరించింది . దీంతో రెచ్చిపోయిన శేషగిరిరావు పాలకుర్తిలో సంఘం లేకుండా చేస్తానని సంఘం కార్యకర్తల ఇండ్లు దున్ని విత్తనాలు వేస్తానని గ్రామాన్ని తగలబెడ్తానని ప్రతిజ్ఞ చేసిండు. దీంతో ఆగ్రహోదగ్రుల్తెన సంఘం కార్యకర్తలు దేశ్ ముఖ్ ఏజెంట్ ఇళ్ళను గునపాలతో పొడిచి నేల మట్టం చేశారు. ఇళ్ళు దున్ని మొక్కజొన్న విత్తనాలు వేసి నాలుగు నెలల తర్వాత మొక్క జొన్న కంకులను గ్రామస్తులందరూ మూకుమ్మడిగా మంటల్లో కాల్చుకుతిని దేశ్ ముఖ్ కు తగిన గుణపాఠం నేర్పారు. దీంతో ఐలమ్మ కుటుంబంపై మరింత పగ పెంచుకున్న దేశ్ ముఖ్ అదను కోసం వేచి చూస్తున్నాడు.
ఐలమ్మ కుటుంబం కులవృత్తి తోపాటు మల్లంపల్లి గ్రామానికి చెందిన కొండలరావుకు పాలకుర్తిలో ఉన్న వ్యవసాయ భూములను కౌలుకు తీసుకొని పంట పండించేది. పంట కోతకు వచ్చిన సమయంలో దేశ్ ముఖ్ ఏజెంట్ శేషగిరిరావును రంగంలోకి దింపాడు . పంట పొలాన్ని స్వాధీనం చేసుకునేందుకు మల్లంపల్లి కొండల్ రావును దేశ్ ముఖ్ దగ్గరకు పిలిపించి ఐలమ్మ వ్యవసాయ భూములను అక్రమంగా కౌలుకు తీసుకున్నట్లు ఆయన చేత బలవంతంగా ఒప్పించారు. వ్యవసాయ భూములు మావే అంటూ విస్నూర్ దేశ్ ముఖ్ రజాకార్ గూండాలను పొలం కోసుకురమ్మంటూ పురమాయించాడు. దీన్ని గ్రహించిన ఐలమ్మ ఆంధ్రమహాసభ కేంద్ర కమిటీకి తెలిపింది. దీంతో చకిలం యాదగిరిరావు, దేవులపల్లి వెంకటేశ్వరరావుతో చర్చించి పంట కాపాడేందుకు భీమిరెడ్డి నరసింహారెడ్డి, నల్ల ప్రతాప్ రెడ్డి , ఆరుట్ల రామచంద్రా రెడ్డిలను సూర్యాపేట నుంచి పాలకుర్తి పంపారు.
భీమిరెడ్డి నరసింహారెడ్డి మరో 15 మందిని వెంటబెట్టుకుని పొలం వద్ద మాటు వేసారు. ఇంతలో దేశ్ ముఖ్ గూండాలు పంట కోసుకునేందుకు వచ్చారు. దీంతో సంఘం నాయకులు ఓ చేతిలో కొడవళ్లు, మరో చేతిలో కర్రలతో రజాకార్ గుండాలను ఎదిరించి పోరాడారు. ఓ వైపు పోరాడుతూనే పంటను కోసి కట్టలు కట్టి ఐలమ్మ ఇంటికి చేర్చారు. దీంతో దేశ్ ముఖ్ ఆగ్రహోదుగ్రుడ్తె కేసులు పెట్టాడు ... పోలీసులు సంఘం నాయకులను, ఐలమ్మ కుటుంబీకులను అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేశారు. అయినా ఐలమ్మ చలించకుండా మొక్కవోని ధైర్యంతో సంఘం వెంట ఉండి పోయింది. ఆమె భర్తను, కొడుకులను దేశ్ ముఖ్, రజాకార్లు , పోలీసులు అడుగడుగునా హింసించినా ఏనాడు వెనకడుగు వేయలేదు. దేశ్ ముఖ్ ఆగడాలకు నీ బాంచన్ దొరా ...కాల్మొకుత అని అన్న రోజుల్లోను ఐలమ్మ ఏనాడు ప్రాధేయపడిన పాపాన పోలేదు. కమ్యూనిస్టు యోధులు పుచ్చలపల్లి సుందరయ్య, నల్ల నరసింహులు తెలంగాణ సాయుధ పోరాట అనుభవాలను, ఐలమ్మ పోరాటాన్ని వారి పుస్తకాలలో ప్రముఖంగా పేర్కొన్నారు .
ఐల్లమ్మ మరణం :
ఐలమ్మ వృద్ధాప్యంతో 90 ఏళ్ల వయసులో సెప్టెంబర్ 10న కన్నుమూసింది. ఆమె మరణం అనంతరం పాలకుర్తిలో స్మారక భవనం, స్మారక స్థూపం, నిర్మించబడ్డాయి. 2015 సెప్టెంబర్ 10న పాలకుర్తిలో మార్కిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకారత్, సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, ఐలమ్మ ఉద్యమ సహచరి మల్లు స్వరాజ్యంలు పాల్గొని ఐలమ్మ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.