RTC Strike: మెట్రోకు క్రాస్ సబ్సిడీ, ఆర్టీసీ ఏం చేసింది?

By telugu team  |  First Published Nov 1, 2019, 4:36 PM IST

ఎల్ అండ్ టీ ఆధ్వర్యంలో నడుస్తున్న మెట్రోకు క్రాస్ సబ్సిడీ కింద ప్రభుత్వం ఊరట కల్పించింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన అర్టీసీకీ అది వర్తించదా? కేసీఆర్ తిరకాసు ఏమిటి?


ఆర్టీసీ సమ్మెపై ఇందాక కొద్దిసేపటికింద హై కోర్ట్ లో వాదనలు మొదలయ్యాయి. ఆర్టీసీ ఆర్ధిక స్థితిగతులపై హైకోర్టులో ఆర్టీసీ యాజమాన్యం అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ అఫిడవిట్ ను పరిశీలించిన హై కోర్ట్ ఇవన్నీ తప్పుడు లెక్కాలంటూ కొట్టి పారేసింది. అసలు ప్రభుత్వం ఎం చెప్పింది? కోర్టు ఎందుకు తప్పుడు లెక్కలేని తేల్చింది అనేది ఒకసారి చూద్దాం. 

Also read: ఏం లెక్కలివి: ఆర్టీసీ యాజమాన్యానికి హైకోర్టు మొట్టికాయలు

Latest Videos

undefined

ఆర్టీసీ సమ్మె కాలంలో అనగా అక్టోబర్ 5 నుంచి 30వ తారీఖుల్లో 78 కోట్ల రూపాయలను ఆర్జించినట్టు, 160 కోట్ల రూపాయల వ్యయం అయినట్టు తెలిపింది. దీన్ని చూపెడుతూ ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోయిందని చెప్పే ప్రయత్నం చేసింది. ఇక్కడ వాస్తవానికి మనం అర్థం చేసుకోవాలిసిన విషయం ఏమిటంటే ఆర్టీసీ యాజమాన్యం తాత్కాలిక డ్రైవర్ కి 1500 రూపాయలు, తాత్కాలిక కండక్టర్ కి 1000 రూపాయలు ఇస్తుంది. ఏ సగటు ఆర్టీసీ కార్మికుడి దినసరి వేతనం కూడా ఈ స్థాయిలో లేదు. 

మరో అంశం ఏమిటంటే టిక్కెట్లు ఇవ్వడం లేదు. తద్వారా ఎంతమంది ప్రయాణిస్తున్నారనే లెక్క ఎలా తెలుస్తుంది? తాత్కాలిక కండక్టర్లు డబ్బులు నొక్కేస్తున్నారని, అధిక చార్జీలు వసూలు చేస్తున్నారనేది బహిరంగ రహస్యం. అయినా వారిని ఎలా పట్టుకుంటారు టిక్కెట్లే జారీ చేయనప్పుడు. ఇలాంటి పనులు చేస్తే వచ్చేది నష్టం కాక లాభమా?

Also read: RTC Strike: ప్రభుత్వం కాకి లెక్కలు, ఆర్టీసీ ఆర్థిక స్థితిపై వాస్తవాలు ఇవీ..

మరో విషయం ఏమిటంటే నిర్వహణ వ్యయం, డీజిల్ భారం అధికంగా ఉండడం వల్ల ఆర్టీసీ మనలేకపోతుందని ప్రభుత్వం తన అఫిడవిట్ లో పేర్కొంది. ఇక్కడే సగటు ప్రజలకు అర్థం కావాల్సిన ఒక అంశం ఏమిటంటే, తన సామాజిక బాధ్యతలో భాగంగా ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను నష్టాలొచ్చే రూట్లలో తిప్పమంటుంది. దాదాపుగా 72 శాతంబుస్సులు నష్టాలొచ్చే రూట్లలోనే తిరుగుతున్నాయి. దానికి కారణం అక్కడ వేరే రవాణా మార్గం లేకపోవడం వల్ల అక్కడ ఆర్టీసీ బస్సులను తిప్పమని చెబుతుంది. 

ఒక సగటు విద్యార్ధి పక్కనున్న పెద్ద ఊరికి వెళ్లి చదువుకోవాలన్నా, ఒక సన్నకారు రైతు తాను పండించిన కూరగాయలను పట్టణంలో అమ్ముకోవాలన్నా ఈ ఆర్టీసీ ప్రగతి రథ చక్రాలే వారికి దిక్కు.  సాధారణ ప్రజానీకానికి రవాణా వ్యవస్థను అందుబాటులో ఉంచాలంటే ప్రభుత్వం తరుఫున ఆర్టీసీ బస్సులు నడపాల్సిందే. 

ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వాన్ని అడుగుతుంది కూడా ఇదే. కనీసం ఈ నష్టాలొచ్చే రూట్లలోనన్నా పన్నులను ఎత్తివేయండని అడుగుతున్నారు. ఆర్టీసీ సంవత్సరానికి 750 కోట్ల రూపాయల పన్నులు కడుతుంది. నష్టాలొచ్చే రూట్లలోనున్న ఈ పన్నులు ఎత్తివేయమనే కదా వారడుగుతున్నారు. 

Also read: RTC Strike: కేసీఆర్ సెల్ఫ్ డిస్మిస్ లోని డొల్లతనం ఇదే...

మరో అంశం డీజిల్ భారం. బస్సులను నష్టాలొచ్చే రూట్లలో వేగం మెయింటైన్ చేయలేని రూట్లలో బస్సులను నడిపితే డీజిల్ భారమే అవుతుంది. డీజిల్ భారమవుతుందనే కదా ఆర్టీసీ కార్మికులు, సంవత్సరానికి డీజిల్ పై చెల్లించే 300 కోట్ల రూపాయల పన్నులను రద్దు చేయమని అడుగుతుంది. 

మరో అంశం జిహెచ్ఎంసీ చెల్లించాల్సిన రాయితీని చెల్లించకపోవడం. ఆర్టీసీకి  సిటీ బస్సులు నడపడం వల్లనే సంవత్సరానికి 400 కోట్ల రూపాయల నష్టం వస్తుంది. ఒక సంవత్సరానికి 400 కోట్లు అంటే ఇప్పటి వరకు తెలంగాణ వచ్చి 5 యేండ్లు దాటింది. అంటే 2000 కోట్లపైమాటే. కేవలం 330 కోట్లిచ్చి, మావల్ల కాదంటే మిగిలిన డబ్బులు ఎవరివాలి? ఆర్టీసీ నష్టాల్లో పడకూడదు, ప్రభుత్వం డబ్బులు చెల్లించదు, సంస్థలు చెల్లించవని ప్రభుత్వమే చెబుతుంది. ఇదెక్కడి న్యాయం?

ప్రపంచంలో ఎక్కడా కూడా ప్రజా రవాణా వ్యవస్థ సొంతంగా లాభాల్లో నడవదు. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా 60 శాతం మాత్రమే అవి లాభాలను ఆర్జిస్తుంటాయి. మన హైదరాబాద్ మెట్రో నే ఉదాహరణకు తీసుకోండి. మెట్రో కేవలం ప్రయాణీకుల రవాణా వల్లనే లాభాలను పొందలేదు కనుక, ఆ నష్టాలను పూరించేందుకు హైదరాబాద్ లోని ముఖ్యమైన ప్రాంతాల్లో మెట్రోకీ భూములను తెలంగాణ సర్కార్ అప్పగించింది.

Also read: RTC Strike: అర్టీసీకి కేసీఆర్ మంగళం, మధ్యప్రదేశ్ మోడల్

మనం ఇప్పుడు మెట్రో స్టేషన్ల పక్కన చూస్తున్న నెక్స్ట్ గాలేరియా మాల్ ఇలాంటివన్నీ ఈ కోవలో ఇచ్చినవే. ఇలా క్రాస్ సబ్సిడైజేషన్ చేయడం వల్ల మెట్రో నడుస్తుంది తప్ప, కేవలం ప్రయాణీకుల రవాణాతోనే లాభం రాదు కదా!  

ఆర్టీసీకి కూడా చాల విలువైన ఆస్తులున్నాయి. వాటిని కూడా అభివృద్ధి చెయ్యమని కదా ఆర్టీసీ అడుగుతుంది. మెట్రోపైన ఉన్న ప్రేమ ఆర్టీసీపైన లేదా! కేసీఆర్ గారు ఒక మాట అంటున్నారు, పోటీ ఉంటె మెరుగైన సేవలందుతాయని, చవకగా సేవలు అందుతాయని వాదిస్తున్నారు. మరి మెట్రో కూడా కేవలం ఎల్ అండ్ టి కి మాత్రమే ఎందుకు?

ఉన్న రోడ్డుపై అన్ని రకాల వాహనాలు తిరుగుతున్నప్పుడు, ఉన్న మెట్రో మార్గంపైన అనేక కంపెనీలకు అవకాశం ఇవ్వండి. అప్పుడు ప్రజలు తమకు నచ్చిన దాన్ని ఎంచుకుంటారు! ప్రభుత్వం ఆ పని చేయలేదు, కారణం వారితో ఉన్న ఒప్పందం వల్ల. ఆర్టీసీ విషయంలోనేమో ఇలాంటివేమీ పట్టించుకోకుండా, కోర్టు మెట్లు కార్మికులు ఎక్కుతే కోర్టు ఎమన్నా కొడతదా అని గౌరవ ముఖ్యమంత్రి గారు వ్యాఖ్యానించడం రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం. 

click me!