జగన్ కు చుక్కెదురు: ఉండవల్లి వ్యాఖ్యల నిగ్గు అదేనా...

By telugu team  |  First Published Nov 1, 2019, 12:44 PM IST

కోర్టుకు హాజరుకు మినహాయింపు ఇవ్వాలనే విజ్ఞప్తిని సిబిఐ కోర్టు తిరస్కరించడం వల్ల ఏపీ సీఎం వైఎస్ జగన్ రాజకీయంగా చిక్కులు ఎదుర్కోబుతున్నారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.


ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవ్వడం నుంచి మినహాయింపునివ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దానికి సంబంధించి సిబిఐ కోర్టు ఈ రోజు తన తుది తీర్పును వెల్లడించింది. ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావలిసిందేనంటూ తీర్పు వెలువరించింది.

రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడం, పరిపాలనా బాధ్యతల వల్ల తీరిక దొరకనందున మినహాయింపునివ్వాలని జగన్ కోరారు.  మినహాయింపు ఇవ్వొద్దంటూ సిబిఐ దాఖలు చేసిన కౌంటర్ ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.

Latest Videos

undefined

Also read: సీబీఐ కోర్టులో చుక్కెదురు: హైకోర్టులో జగన్ పిటిషన్ దాఖలు

దీనిని సిబిఐ తీవ్రంగా వ్యతిరేకించింది. జగన్ జైలులో ఉన్నప్పుడే సాక్షులను ప్రభావితం చేసారని, అందువల్ల ఇప్పుడు మరలా అలాంటి చర్యలకు పాల్పడే ఆస్కారముందని సిబిఐ వాదించింది. గతంలో కూడా ఇలా ప్రభావితం చేసేందుకు ప్రయత్నించినందుకే అరెస్ట్ చేశామని సిబిఐ కోర్టుకు సమర్పించిన కౌంటర్లో పేర్కొంది. విజయవాడ హైదరాబాద్ ల మధ్య కనెక్టివిటీ బాగానే ఉందని త్వరగానే వచ్చి వెళ్లొచ్చని సిబిఐ పేర్కొంది. 

ఎంపీగా ఉన్న సమయంలో సాక్ష్యులను అంతలా ప్రభావితం చేయగలిగినప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు, ప్రభుత్వ అధికారాన్ని వాడుకొని మరింతగా ప్రభావితం చేసే ఆస్కారముందని సిబిఐ పేర్కొంది. ఈ కేసులోని అనేక మంది సాక్షులు ప్రభుత్వాధికారులు. ఈ కేసుతోని సంబంధమున్నశ్రీలక్ష్మి లాంటి కొందరు అధికారులను డెప్యూటేషన్లపైన తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు (కానీ కేంద్రం దానికి అనుమతివ్వడం లేదు). దానితో సిబిఐ వాదనకు మరింత బలం చేకూరింది. 

ఇక్కడే అర్థంకాని ఒక విషయం దాగుంది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి గారు సాక్షులను ప్రభావితం చేసే ఆస్కారం ఉంది కాబట్టి వారంలో ఒక రోజు కోర్టుకు హాజవ్వాలని అడుగుతున్నారు సిబిఐ అధికారులు. ఇక్కడే సాధారణ మనిషికి కూడా తలెత్తే ఒక ప్రశ్న. వారంలో మిగిలిన ఆరు రోజులు జగన్ మోహన్ రెడ్డి గారు సాక్షులను ప్రభావితం చెయ్యరా? కేవలం శుక్రవారం నాడు మాత్రమే ముహూర్తం చూసుకొని ప్రభావితం చేస్తారా? ఆ ముహూర్తం సిబిఐ అధికారులకు తెలిసిపోయిందా?

Also read: సీబీఐ కోర్టులో చుక్కెదురు: హైకోర్టులో జగన్ పిటిషన్ దాఖలు

ఒకవేళ నిజంగానే జగన్ మోహన్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తారు అనుకుంటే, బెయిల్ రద్దు చేయమని కోర్టును సిబిఐ కోరాల్సింది. కానీ ఇలా ప్రతి శుక్రవారం హాజరుకమ్మని కాదు. దీనిలో ఏం మెసేజ్ దాగుంది? జగన్ కు ఎటువంటి సహకారం అందించడం లేదు అని కేంద్ర ప్రభుత్వం చెప్పడమా? లేక పిపిఏలపైన జగన్ దూకుడు వైఖరికి కళ్లెం వేసేందుకే ఇదంతానా?

ఏది ఏమైనా, కేంద్రంతోని సఖ్యతతో మెలుగుతున్న తమ అధినేతకు మోడీ ఇలా షాక్ ఇవ్వడం వైసీపీ శ్రేణులను నిర్ఘాంతపరిచింది. కేంద్రంతో ఉన్న సంబంధాలవల్ల సిబిఐ ఈ కేసు పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తుందనుకున్నారంతా.  కానీ అందరిని షాక్ కి గురిచేస్తూ సిబిఐ ఇంత ఘాటుగా కౌంటర్ దాఖలు చేసింది. జగన్ పైన కేసు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా సిబిఐ ఎన్నడూ ఇంత ఘాటు వాదనలు వినిపించలేదు. ఇదే విషయాన్నీ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక తాజా ఇంటర్వ్యూలో ప్రస్తావించారు కూడా.  

ప్రతి శుక్రవారం కోర్ట్ హాజరునుంచి మినహాయింపును పొందడం పెద్ద కష్టం కాదు అని భావించారంతా. కానీ జగన్ మోహన్ రెడ్డికి కోర్టులో చుక్కెదురయింది. ఇప్పుడు ఈ విషయంపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. ఉన్నత న్యాయస్థానానికి అప్పీల్ కు వెళ్లే ఆస్కారమే ఎక్కువ. 

Also read: జగన్ ఇక జైలుకే, సీబీఐ కోర్టు తీర్పుపై మాజీమంత్రి యనమల సంచలన వ్యాఖ్యలు

ఏది ఏమైనా, జగన్ మోహన్ రెడ్డి అభ్యర్థనను కోర్ట్ తోసిపుచ్చడంతో విపక్షాలకు మరో నూతన అస్త్రం దొరికినట్టయ్యింది. రాజకీయంగా జగన్ కు ఇది ఒకింత తలనొప్పులు తెచ్చిపెట్టేదిగా పరిణమిస్తుంది. ఇసుక దీక్షల పేరుతో రాజకీయం చేస్తున్న ప్రతిపక్షాలు ఈ శుక్రవారం శుక్రవారం కోర్టుకు హాజరవ్వడాన్ని మరింత బలంగా వాడుకుంటారు. ఇప్పటికే యనమల వంటి వారు జగన్ జైలుకెళ్లడం ఖాయం అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ విషయమై చర్చ మరింత తీవ్రమై ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వాతావరణం హీటెక్కడం మాత్రం ఖాయం. 

click me!