కూతురు అమృత కులాంతర వివాహం చేసుకోవడం వల్ల పరువు పోయిందనే కసితో మారుతీ రావు ఆమె భర్త ప్రణయ్ ను కిరాతకంగా హత్య చేయించాడు. చివరకు అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది మనకు నేర్పే పాఠం ఏమిటనేది ఆలోచించక తప్పదు.
హైదరాబాద్: కులాంతర వివాహం చేసుకున్న అమృత వర్షిణి తండ్రి మారుతీ రావు హైదరాబాదులోని ఆర్యవైశ్య భవన్ లో ఆత్మహత్య చేసుకున్నారు. పరువు కోసం పాకులాడిన మారుతీ రావు చివరకు విగతజీవుడై తేలారు. ఆయన ఆత్మహత్య పలు ప్రశ్నలను ముందుకు తెస్తోంది. కులం ముఖ్యమా, పరువు ముఖ్యమా అనేది ప్రధానమైన చర్చగా ముందుకు వస్తోంది.
గతంలోనే కాదు, ఇటీవలి కాలంలో పరువు హత్యలు జరుగుతూనే ఉన్నాయి. కానీ, కూతురు అమృత వర్షిణిపై తనకున్న వల్లమాలిన ప్రేమతో అల్లుడ్ని హత్య చేసిన తర్వాత కూడా ఆమె కోసం పాకులాడాడు. ప్రణయ్ ని హత్య చేసిన తర్వాత తన కూతురు అమృత వర్షిణిని తన వద్దకు రప్పించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు.
undefined
Also Read: మారుతీరావు ఆత్మహత్య: వీలునామా చుట్టూనే కథ, ఆదివారం కలవాల్సిన లాయర్ ఎవరు..?
అగ్రకులానికి చెందిన అమృత వర్షిణి దళితుడైన ప్రణయ్ ని వివాహం చేసుకుంది. ఇది ఇష్టం లేని అమృత తండ్రి మారుతీ రావు ప్రణయ్ ను వెంటాడి వేటాడి చంపించాడనే చెప్పాలి. కిరాయి హంతకులను మాట్లాడుకుని అతన్ని హత్య చేయించాడు. అప్పటికే అమృత వర్షిణి ప్రణయ్ ద్వారా గర్భం దాల్చింది. ఒక్క రకంగా ప్రణయ్, అమృత వివాహం తర్వాత ఆనందంగానే ఉన్నారు. సాంస్కృతికపరమైన విభేదాలు, అసమానతలు వారిని చుట్టుముట్టినట్లు కనిపించలేదు.
ప్రణయ్ తో తాను సంతోషంగానే ఉందని చెప్పడానికి ప్రణయ్ హత్య తర్వాత ఆమె ఎంచుకున్న జీవనవిధానం తెలియజేస్తోంది. ప్రణయ్ కుటుంబం విషయానికి వస్తే కులం మాత్రమే తక్కువ కానీ, డబ్బు తక్కువ కాదని చెప్పవచ్చు. ప్రణయ్ కుటుంబం కూడా సంపన్నంగానే ఉందని చెప్పడానికి ప్రణయ్, అమృత వీడియోలే సాక్ష్యం ఇస్తాయి. అంతేకాకుండా మారుతీరావు ఆశపెట్టిన ధనానికి ప్రణయ్ లొంగలేదు, భర్త చనిపోయిన తర్వాత తన తండ్రి ఆస్తి చూసి అమృత వెనక్కి వెళ్లలేదు.
కులం తక్కువ వాడిని పెళ్లి చేసుకుందనే కోపం పెంచుకుని మారుతీ రావు ప్రణయ్ ను హత్య చేయించాడు. ఆ తర్వాత కూతురు తన వద్దకు వస్తుందని ఆయన భావించాడేమో తెలియదు కానీ ఆమె తన అత్తవారింట ఉండడానికే మొగ్గు చూపింది. తండ్రి పట్ల ఏ మాత్రం దయాదాక్షిణ్యాలు చూపించినట్లు కూడా కనిపించలేదు. ఆమె కఠినంగానే వ్యవహరించింది. తన తండ్రికి ప్రణయ్ హత్య కేసులో శిక్ష పడాలనే ఆమె కోరుకుంది. క్షమించడానికి కూడా ఆమె అంగీకరించలేదు.
Also Read: మారుతీరావు ఆత్మహత్యలో విస్తుపోయే విషయాలు వెల్లడి
బహుశా, ఇదే ఇతర పరువు హత్యలకు ప్రణయ్ పరువు హత్యకు మధ్య గల తేడాగా చెప్పవచ్చు. కేసుల్లో చిక్కుకుని శిక్ష పడే పరిస్థితి ఉండడంతో, కుటుంబంలో వారసులు మరొకరు లేకపోవడంతో, కూతురు దరికి రావడానికి ఏ మాత్రం సుముఖంగా లేకపోవడంతో మారుతీరావు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైనట్లు చెప్పవచ్చు. జీవితంలో ఏమీ మిగలలేదనే అభిప్రాయానికి వచ్చి, కేసుల ఎదుర్కునే కష్టాలను తలుచుకుని ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడు. కానీ, ఇది కచ్చితంగా కులం చేసిన హత్యనే.
దయాదాక్షిణ్యాల విషయానికి వస్తే, మారుతీ రావు మీద అమృతది తప్పు అవుతుందా, భార్యకు భర్తను, దంపతులకు కుమారుడిని దూరం చేయడానికి ప్రణయ్ ను హత్య చేసే సమయంలో మారుతీరావు వారి మీద దయ చూపకపోవడం తప్పు అవుతుందా అనేది ప్రశ్నించుకోవాల్సి ఉంటుంది. దయాదాక్షిణ్యాల విషయానికి వస్తే మారుతీ రావు వల్ల నష్టపోయిన కుటుంబ సభ్యులు ఓ వైపు ఉన్నారు, తన పని వల్ల చిక్కుల్లో పడి ఆత్మహత్య చేసుకున్న మారుతీ రావు కుటుంబ సభ్యులు మరోవైపు ఉన్నారు. ప్రణయ్ ను హత్య చేయడాన్ని సమర్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులపై దయాదాక్షిణ్యాల సంగతి అటుంచి, వారికి శిక్ష పడాల్సిందేనని అన్న వర్గం ఒక్కటి ఉంది. మారుతీ రావు ఆత్మహత్యను పాపం పండినట్లుగా అభివర్ణించే వర్గం కూడా ఉంది.
చాలా మంది మారుతీ రావుకు అండగా నిలుస్తూ ఉండవచ్చు. అంతే మంది అమృత వైపు నిలబడుతూ ఉండవచ్చు. ఈ రెండింటిలో ఆధిపత్యం, పైచేయి ఎవరిదనేది ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. సామాజిక అసమానతల సమాజంలోనే జీవిద్దామనే అగ్రకులాల సమాజానికి ఇదొక చెంపపెట్టు.