బిగ్ క్వశ్చన్
చంద్రబాబు మహానాడు చివరి రోజు చేసిన ప్రసంగం ఆంధ్రా ప్రజలను కొంత ఆశ్చర్య పరిచిందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రాకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కానీ కేంద్రంపై తిరుగుబాటు బావుటా ఎగరేస్తామని, కేంద్రానికి ఎందుకు పన్నులు కట్టాలంటూ మరోమారు కేంద్రంపై ధ్వజమెత్తి తన కోపాన్ని వెళ్లగక్కారు. ఇదంతా ఎలా ఉన్న అమరావతిపై చంద్రబాబు ప్రసంగిస్తూ... తాను అడిగితే రాజధాని కోసం రైతులు తర్వాతగతిన స్పందించి 33000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారని, అమరావతి అద్భుత రాజధాని అవుతుందని ఎప్పటిలాగా గొప్పగా చెప్పుకున్నారు. కానీ ఇక్కడ ఒకటి ఆశ్చర్యపరిచే అంశం ఏంటంటే అక్కడ రైతులు నిజంగానే భూములు స్వచ్చందంగానే ఇచ్చారా? ఒకవేళ ఇస్తే సరైన నష్టపరిహారం ఇచ్చారా అన్నది ఇంకా అర్ధం కాకా మిగిలిపోయిన మిలియన్ డాలర్ల ప్రశ్న!!
ఒక వేళ రైతులు నిజంగానే స్వచ్చందంగా ఇస్తే రైతులు ఆక్రందనలు, రోదనలు ఇంకా అమరావతి పరిసర ప్రాంతాల్లో ఎందుకు వినబడుతున్నాయి...? కొన్ని వందల కుటుంబాలు తమకు సరైన నష్టపరిహారం అందలేదని ఎందుకు రోడ్ల మీదకి వస్తున్నాయి..? రైతులు తమంతట తామే భూములు ఇచ్చింది నిజమే అయితే రైతుల కుటుంబాలు ప్రభుత్వాన్ని అంతలా ఎందుకు దుమ్మెత్తి పోస్తున్నాయి...?
undefined
అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతుల కష్టాలు అన్ని ఇన్నీ కావు. రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు, చేస్తున్న పనులకు ఎక్కడా పొంతనలేకుండా పోయింది. అమరావతిలో రాజధాని ప్రకటించగానే దేశంలోనే ఎక్కడా లేని విధంగా రైతులు దాదాపు 33వేల ఎకరాలకుపైగా ప్రభుత్వం రైతుల దగ్గర నుండి తీసుకుంది. కానీ ప్రభుత్వం మాత్రం రైతులే స్వచ్చందంగా ఇచ్చారని గొప్పలకి పోయింది. రైతుల నుంచి భూములు తీసుకున్న సర్కార్ వారికి ఎన్నో హామీలు ఇచ్చింది. రైతులకు కమర్షియల్ ప్లాట్స్ ఇస్తామని కూడా చెప్పింది. ప్రస్తుతం రాజధాని ప్రాంత రైతులకు ప్లాట్ల కేటాయింపు జరుగుతోంది. ప్లాట్ కేటాయించిన రైతులంతా రిజిస్ట్రేషన్ బాట పట్టారు.
వారికి నిరాశే...
ఏ గ్రామంలో రైతులు భూములు ఇచ్చారో వారికి అదే గ్రామంలో ప్లాట్లను ప్రభుత్వం కేటాయిస్తానని చెప్పింది. కానీ కొందరు రైతులకు ఎందుకు పనికిరాని అసైన్‌మెంట్ ల్యాండ్‌లు, ఇనాం భూములు, ఫారెస్ట్, దేవాలయ భూముల్లో రైతులకు ప్లాట్లు ఇచ్చింది. ఇది తెలియక రైతులు తమ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు వెళ్లగా అక్కడ వారికి నిరాశే ఎదురవుతోంది. రైతులకు ఇచ్చిన సర్వేనంబర్‌లు చెక్ చేసిన అధికారులు వాటిని రిజిస్ట్రేషన్ చేయడం కుదరదని తేల్చి చెప్తున్నారు. దీంతో వారికి ఏం చేయాలో పాలుపోవడం లేదు.రిజిస్ట్రేషన్ అధికారులు కూడా ఈ విషయంలో తామేమీ చేయలేమంటూ చేతులెత్తేశారు. ప్రభుత్వం నుంచి ల్యాండ్ కన్వర్షన్ లెటర్ వస్తేకానీ తాము రిజిస్ట్రేషన్‌లు చేయడం కుదరదని తేల్చి చెబుతున్నారు.దేవాదాయ, ఫారెస్ట్, ఇనాం, అసైన్డ్ భూముల్లో ప్లాట్లను కేటాయించడంతో రైతులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సీఆర్‌డీఏ అధికారులను నిలదీయడానికి వెళితే అక్కడ ఒక్క అధికారి కూడా ఉండడం లేదు. దీంతో రైతులు ఎంతో ఆందోళన పడ్డారు, పడుతున్నారు కూడా. భూములు ఇచ్చే సమయంలో పగలు-రాత్రి తేడాలేకుండా ప్రభుత్వం తమ చుట్టూ తిరిగిందని.. ఇప్పుడేమో ఒక్కరూ కూడా కనిపించకుండా పోయారని ఎన్నో సార్లు రైతులు ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇప్పటికి కాళ్ళు అరిగేలా ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నారు.
ఇదంతా తెలిసి కూడా చంద్రబాబు మహానాడులో రైతులు స్వచ్చందంగా భూములు ఇచ్చారని ప్రగల్భాలు పలకటం బాబు గారి దుర్నీతికి నిదర్శనమే అని చెప్పాలి. రైతుల పడుతున్న ఆవేదన, చేస్తున్న ఆక్రందనలు ప్రభుత్వాలకు, పాలకులకు ఏ మాత్రం మంచిది కాదు. కానీ ఇవేం పట్టించుకోకుండా రైతులే రాజధాని నిర్మాణానికి భూములు ఇస్తున్నారని చెప్పి వారికి ప్రభుత్వం మొండి చేయి చూపిస్తే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లే. ఇప్పటికే చంద్రబాబు తీరు పట్ల ప్రజాసంఘాలు, రైతులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు తనకు తాను ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సందర్భం ఇది. సరిగ్గా ఇవే సంఘటనలు ఆయనకు ఇదివరకే అనుభవం అయ్యాయి. రైతుల కొట్టిన దెబ్బతోనే చంద్రబాబు 9 ఏళ్ళు అధికారానికి దూరమయ్యారని విషయం అంత తేలిగ్గా బాబు మర్చిపోవటానికి వీల్లేదు. ఇప్పుడు మళ్ళి అదే సంఘటన మరోమారు పునరావృతం కానుందా అనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళి రైతుల ఆగ్రవేశాలను బాబు ఎదుర్కుంటున్నారు. చంద్రబాబు నిన్న అమరావతి భూముల విషయంలో చేసిన ట్వీట్ వాళ్ళకి ఇంకా పుండు మీద కారం చల్లిన మాదిరి తయారయ్యింది.
- హరికాంత్..
(రచయిత ఈ వ్యాసంలో వ్యక్తం చేసిన అభిప్రాయాలతో ఏసియా నెట్ న్యూస్ కు ఏ విధమైన సంబంధం లేదు. అభిప్రాయాలు పూర్తిగా రచయితవే)