ఈమె త్యాగం ఎన్నటికీ మరువలేనిది

First Published May 28, 2018, 1:16 PM IST
Highlights

రమాబాయి జీవితం

ఆమె పొరాటం సామాన్య మైనది కాదు. అసామాన్యమైన త్యాగఫలం. "త్యాగం"  అనే మాట కూడా ఆ కరుణామయరాలికి జోడించగానే దాని విలువ పెరుగుతుందనడంలో సందేహం లేదు. డా అంబేడ్కర్ ఈ దేశానికి, స్త్రీలకు, అట్టడుగు వర్గాలకు, బి సి లకు చేసిన త్యాగం ఎన్నటికీ, ఎప్పటికీ మరువలేనిదే. కానీ చరిత్ర గుర్తించని, మరుగున పడిన మహనీయ చరిత  తల్లి రమాబాయిది.

"అంబేడ్కర్ మనకు చదువు,బలం, గూడు,నీడ, స్వేచ్ఛగా బతికే జీవితం ఇచ్చాడు" అని మనలో విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరం చెప్పుకుంటున్నాం. ఇవన్నీ  ఆయన మనకు  ఇచ్చి తన కుటుంబానికి మాత్రం ఏమిచ్ఛాడు అని ప్రశ్నించుకుంటే ఆయన భార్య, మహా ఇల్లాలి పోరాటం కనిపిస్తుంది. కానీ వీటి అన్నిటి వెనుక ఉన్న త్యాగశీలిని మరచిపోవుచున్నాము. 

భర్త భవిష్యత్తు కోసం, జాతి భవితవ్యం కోసం వేగంగా పరుగులెడుతుంటే ఆ మార్గంలో కుటుంబ సమస్యలు అనే ముల్లు ఆమనకు గుచ్చు కోకుండా ఉండటానికి ఆ ముల్లు పై ఆమె చేతులు పెట్టి రక్తపు గాయాలతో ఆయనను మరింత ముందుకు సాగనంపింది.

ఏమిటి ఆమె చేసిన త్యాగం? అంబేడ్కర్ తన పెద్ద కుమారుడు రాజారత్నం మరణించినప్పుడు ఆయన ఒక జాతిని చైతన్యం చేసే సభలో మాట్లాడుతున్నాడు. ఆ సమయములో కుమారుడు రాజారత్నం మరణించాడని కబురు వచ్చింది. మరణించిన కుమారుడు దగ్గర రోదిస్తున్న భార్య తో ఏమని ఓదార్చాడు అంటే, రమా నీవు కుమారుని గురించి రోధిస్తున్నావు. నీ దుఃఖం తీర్చలేనిది, అయినా ఈ దేశంలో నీకు ఏడు కోట్ల మంది బిడ్డలు ఉన్నారు. వారు మన వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు,  వారు గురించి ఆలోచించవా? అని ఓదార్చాడు.  తన కడుపున పుట్టిన బిడ్డలు తన కళ్ళెదుటనే చనిపోతున్నా, ఐదుగురు బిడ్డల్లో నలుగురు పిల్లలు ఒకరి తర్వాత ఒకరిగా ఆకలితోనూ, సరైన వైద్యం అంద‌‌‌క మరణిస్తున్నా కడుపు కోతను భరిస్తూ భర్తను ఉద్యమంలో మరింత ముందుకు నడిపిస్తూ, పేడతట్ట నెత్తి మీద పెట్టుకొని, పిడకలు అమ్మి, పిల్లలు ఆకలి తీరుస్తూ, ఏడు కోట్ల మంది అంటరాని బతుకులలో వెలుగులు చిమ్మటానికి భర్త  అందరికి దీపంలా వెలగటానికి , ముందుకు సాగటానికి ఆమె తన రక్తాన్నే చమురుగా మార్చింది. చివరకు రక్తహీనతతో 35 ఏళ్ళకే  మరణించింది.

ఆమె చేసిన త్యాగం, పోరాటం ఎప్పటికీ మరువలేనిది. ఈ దేశం బంగారు భవిత కోసం సగానికిపైగా ఉన్న మహిళలు తమ దిశను తల్లి రమాబాయి వైపు నుంచి చూసుకుంటే ఆ కుటుంబం సమాజానికి చిరుదివ్వెలుగా వెలుగుతుంది.

జాతి కోసం, బడుగుల కోసం, భర్త కోసం త్యాగం చేసిన మహా తల్లి రమాబాయి మరణించిన రోజు 27 మే నెల.

అమ్మా నీ త్యాగం ఎన్నటికీ మరువం. నీకు జోహార్లు...

 

(*రచయిత దుర్గం గోపాల్, తెలంగాణ జన సమితి నేత, బెల్లంపల్లి.)

click me!