
హైదరాబాద్ కొత్త కలెక్టర్ గా యోగితా రాణా గురువారం బాధ్యతలు చేపట్టారు. కలెక్టర్ పదవీ చెపట్టగానే ప్రతీ కలెక్టర్ చేసే పనే ఆమె కూడా చేశారు. హడావిడిగా అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. విధులు సక్రమంగా నిర్వర్తించకపోతే కఠినంగా వ్యవహరిస్తా నంటూ హెచ్చరికలు కూడా జారీ చేశారు. కబ్జాలకు గురైన భూములు ఎక్కడున్నాయంటూ వాటిపై ఆరా కూడా తీశారు. మొదటి రోజు కదా ఆ మాత్రం హడావిడీ ఉంటుంది.
20ఏళ్ల క్రితం కొండపి .జానకీ అనే మహిళ హైదరాబాద్ కి కలెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆమె తర్వాత ఈ నగరానికి కలెక్టర్ గాయోగిత బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ తొలి మహిళా కలెక్టర్ అంటే మాత్రం యోగితానే.
నిజామాబాద్ లో యోగితా రాణాకు చాలామంచి పేరు ఉంది. విధులను నిర్వర్తించడంలో ఆమెకు సాటి లేరు అనే వారు కూడా ఉన్నారు. కానీ జిల్లాల్లో కలెకర్లుగా పనిచేడం వేరు.. హైదరాబాద్ నగరంలో పని చేయడం వేరు. భూ కబ్జాలు, దందాలు లాంటి ఘటనలు దాదాపుగా జిల్లాల్లో పని చేసే కలెక్టర్లకు ఎదురయ్యే అవకాశాలు చాలా తక్కువ. కానీ హైదరాబాద్ అలా కాదు. భూ కబ్జాలు, భూ దందాలకు హైదరాబాద్ పెట్టింది పేరు. నగరంలో జరిగిన ఏ భూ కబ్జా వెనుకైనా రాజకీయ నాయకులు ఉన్నారనేది జగమెరిగిన సత్యం. అందుకే ఇక్కడ కలెక్టర్ పదవి అంటే కత్తి మీద సామే. కబ్జాకి గురైన భూములను తిరిగి ప్రభుత్వ ఆస్తుల కింద చేర్చడం కలెక్టర్ విధి. కానీ.. విధిగా విధులు నిర్వరిస్తే.. రాజకీయనాయకులు ఎందుకు ఊరుకుంటారు. వారికి ఆగ్రహం వస్తే.. కలెక్టర్ పదవి ఎంత.
నిజానికి హైదరాబాద్ కలెక్టర్ కు ఉండే పని కేవలం ప్రభుత్వ భూములను కాపాడటమే. ఇదేబలమూ బలహీనత కూడా. పౌరులకు సంబంధించిన విషయాలన్ని జిహెచ్ ఎంసి కింద ఉంటాయి. ఎంక్రోచ్ అయిన భూములను వెనక్కి తీసుకురావాలి. ఉన్న భూములు ఎంక్రోచ్ కాకుండా చూడాలి.నిజాం ఆస్తుల మీద కన్నేసి ఉంచాలి. ఇవే పనులు.
హైదరాబాద్ రాజధాని పొలిటికల్ సిటి. ఇలాంటి ప్రాంతానికి కలెక్టర్ గా దాదాపు పవర్ లో ఉన్నవారికి అనుకూలంగా ఉన్నవారినే నియమిస్తారు. వారే కలెక్టర్లుగా కొనసాగుతారు. ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తే.. వారి భవిష్యత్తు బంగారు మయం అవుతుంది. కాదని ఎదురు తిరిగితే.. మరో జిల్లాకు బదిలీ కావాల్సిందే.
గతంలో గుల్జార్ ఈ నగరానికి కలెక్టర్ గా చేశారు. ఆయనకు ముందు ఉన్న ఒక కలెక్టర్ కాలంలో జరిగిన కలిసి భూదందాలను బయటపెట్టారు. అదో పెద్ద సంచలనం అయ్యింది అప్పుడు. కానీ ఆ తర్వాత రాజకీయ వత్తిడులు వచ్చాయి. లొంగలేదు. శెలవు మీదనయినా వెళ్లిపోతాను గాని, లొంగనని సెలవు పెట్టి...ఉన్నత విద్య కోసం హార్వర్డ్ వెళ్లారు. ఇప్పడు యోగితా ముందు కూడా ఉన్నవి రెండు దారులు. ఒకటి గుల్జార్ లాగా ఎవరిని లెక్క చేయకుండా కబ్జాలను బయటపెట్టి,ప్రభుత్వానికి భూములు జమచేయడం, లేదా చూసీ చూడనట్లు పోవడం... యోగితా ఏ బాటలో నడుస్తారో చూడాలి.