కర్ణాటక డ్రామా: బిజెపికి చాన్స్?, ట్విస్ట్ ఇచ్చిన గవర్నర్

First Published May 15, 2018, 5:31 PM IST
Highlights

వందశాతం ప్రభుత్వాన్ని తామే ఏర్పాటు చేస్తామని బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి బిఎస్ యడ్యూరప్ప ధీమా వ్యక్తం చేశారు. 

బెంగళూరు: వందశాతం ప్రభుత్వాన్ని తామే ఏర్పాటు చేస్తామని బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి బిఎస్ యడ్యూరప్ప ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం గవర్నర్ ను కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. జెడిఎస్ లోని ఓ వర్గం మద్దతు తమకు ఉందని ఆయన అన్నారు.

యడ్యూరప్పతో పాటు కేంద్ర మంత్రి అనంతకుమార్ గవర్నర్ ను కలిశారు. అతి పెద్ద పార్టీగా అవతరించిన తమకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. కాంగ్రెసును ప్రజలు తిరస్కరించారని ఆయన అంతకు ముందు మీడియా సమావేశంలో అన్నారు. 

మెజారిటీ నిరూపణకు బిజెపికి గవర్నర్ వాజూభాయ్ ఏడు రోజుల గడువు ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇందుకు గాను శాసనసభ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు.. జెడిఎస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెసు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టేట్లు కనిపిస్తున్నాయి.

ఈ ఏడు రోజుల్లో మెజారిటీ కూడగట్టుకోవడానికి బిజెపికి అవకాశం చిక్కుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే జెడిఎస్ ను చీల్చేందుకు బిజెపి ప్రయత్నాలు ప్రారంభించింది. రేవణ్ణకు 12 మంది శాసనసభ్యులున్నారు. రేవణ్ణకు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవిని ఇవ్వడానికి బిజెపి ముందుకు వచ్చింది. 

కుమారస్వామి కూడా గవర్నర్ ను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వాలని కోరారు. బేషరతుగా తాము జెడిఎస్ కు మద్దతు ఇస్తున్నామని కాంగ్రెసు అధ్యక్షుడు పరమేశ్వర చెప్పారు. మద్దతు లేఖను తాము గవర్నర్ కు ఇచ్చినట్లు తెలిపారు. గవర్నర్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్లు కాంగ్రెసు నేతలు చెప్పారు. తాము దేవెగౌడకు కూడా మద్దతు లేఖ ఇచ్చినట్లు కాంగ్రెసు నేత సిద్ధరామయ్య చెప్పారు. 

సంఘ్ పరివార్ నుంచి వచ్చిన వాజుభాయ్ వాలాపై కాంగ్రెసు మొదటి నుంచీ అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉంది. ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి, బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షాకు అత్యంత సన్నిహితుడని తెలుస్తోంది.

click me!