మమతా బెనర్జీ వ్యాఖ్య ఇదీ: కొంప మీదికి తెచ్చుకున్న సిద్ధూ

First Published May 15, 2018, 5:17 PM IST
Highlights

ఎన్నికలకు ముందు కాంగ్రెసు జెడి(ఎస్) పొత్తు పెట్టుకుని ఉంటే కర్ణాటక శాసనసభ ఫలితాలు పూర్తి భిన్నంగా ఉండేవని తృణమూల్ కాంగ్రెసు అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు.

బెంగళూరు: ఎన్నికలకు ముందు కాంగ్రెసు జెడి(ఎస్) పొత్తు పెట్టుకుని ఉంటే కర్ణాటక శాసనసభ ఫలితాలు పూర్తి భిన్నంగా ఉండేవని తృణమూల్ కాంగ్రెసు అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. అంటే, ఎన్నికలకు ముందు ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుని ఉంటే బిజెపికి అన్ని సీట్లు వచ్చి ఉండేవి కాదనేది ఆమె వ్యాఖ్యల్లోని ఆంతర్యం.

ఫలితాల సరళి చూస్తే మమతా బెనర్జీ మాటల్లో వాస్తవం ఉన్నట్లే అనిపిస్తోంది. అయితే, ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకోవడానికి కాంగ్రెసు అధిష్టానం ముందుకు వచ్చింది. పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు.

ఒకానొక సందర్భంలో జెడిఎస్ అధినేత దేవెగౌడ కూడా కాంగ్రెసుతో పొత్తు పెట్టుకోవడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. ఆయన కుమారుడు కుమారస్వామి బిజెపి వైపు మొగ్గు చూపుతున్నప్పటికీ దేవెగౌడ మాత్రం కాంగ్రెసు వైపే మొగ్గు చూపారు. 

కానీ, ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకోవడానికి కాంగ్రెసు ముందుకు రాలేదు. అందుకు ప్రధాన కారణం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సిద్ధరామయ్య. ముఖ్యమంత్రి పదవి తనకు చేజారి పోతుందనే ఉద్దేశంతో ఆయన జెడిఎస్ తో పొత్తుకు నిరాకరించారు. జెడిఎస్ తో జత కడితే ఆ పార్టీ ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తుందని, తనకు ఆ పదవి దక్కదని ఆయన భావించారు.

పొత్తు పెట్టుకోకపోవడం వల్ల కాంగ్రెసు ఓటమి పాలు కావడమే కాకుండా జెడిఎస్ కే ముఖ్యమంత్రి పదవిని ఇవ్వాల్సిన పరిస్థితిలో పడింది. సిద్ధరామయ్య స్వయంగా అందుకు సిద్ధపడాల్సి వచ్చింది. పైగా, ఆయన చాముండేశ్వరి స్థానంలో జెడిఎస్ అభ్యర్థి చేతిలోనే ఓటమి పాలయ్యారు. ఎవరు చేసుకున్న కర్మకు ఎవరు బాధ్యులని సిద్ధరామయ్యను చూస్తే అనుకోక తప్పదు.

click me!