
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్ట్ ను మాయ ప్రాజెక్ట్ లా తయారు చేశారని వైసీపీ నేత పార్థసారధి ఆరోపించారు. మంగళవారం వైసీపీ కార్యలయంలో మీడియాతో మాట్లాడిన పార్థసారధి రూ.వేల కోట్ల భారం రాష్ట్ర ఖజానాపై పడుతున్నప్పటికీ కొత్త కాంట్రాక్టర్‌ను తీసుకు రావాలని ముఖ్యమంత్రి యత్నిస్తున్నారని మండిపడ్డారు.
ఈ విషయంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అభ్యంతరం చెప్పినప్పటికీ చంద్రబాబు వినడం లేదని ఆరోపించారు. పోలవరాన్ని చంద్రబాబు ఒక ఆదాయ వనరుగా చంద్రబాబు మార్చుకున్నారన్నారు. విభజన చట్టం ప్రకారం పోలవరం పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని.. అయితే.. కేంద్రం నుంచి పోలవరాన్ని చంద్రబాబు లాక్కున్నారని గుర్తు చేశారు. ఏమి ఆశించి ఈ ప్రాజెక్టును తీసుకున్నారో చంద్రబాబు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రూ.16వేలకోట్ల ప్రాజెక్ట్ ని రూ.58వేల కోట్లకు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముడుపులు ముట్టజెప్పే కాంట్రాక్టర్లను పోలవరంలో తీసుకు రావాలని చంద్రబాబు ప్రయత్నిస్తే.. తమ పార్టీ నేతలు ఊరుకోరని హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టును ఎప్పటిలోపు పూర్తి చేస్తారో.. చంద్రబాబు ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.