యనమల బడ్జెట్ ప్రసంగం తెలుగా? ఇంగ్లీషా?

First Published Mar 14, 2017, 10:37 AM IST
Highlights

తెలంగాణా అసెంబ్లీ అధికార భాషా తెలుగు, ఈటెల రాజేందర్ ఎపుడూ తెలుగులోనే బడ్జెట్  ప్రవేశపెడతారు. ఆంధ్రలో యనమల ఎపుడూ తెలుగులో ప్రసంగించరు. చాన్సొస్తే చాలు ఇంగ్లీష్ ఎత్తుకుంటారు

ఆంధ్ర ప్రదేశ్ వెలగపూడి అసెంబ్లీలో రేపు ఉదయం 11:25కి ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు తొలి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు.

 

ఇది ఇంగ్లీష్ బడ్జెటా? తెలుగు బడ్జెటా?

 

సభలో అయనెపుడూ ఇంగ్లీష్  లోనే మాట్లాడతారు. స్పీకర్ గా ఉన్నపుడు కూడా ఇంగ్లీష్ లోనే మాట్లాడేవారు. సభ్యులను మందలించడం, చివరకు సభను వాయిదావేయడం  కూడా ఇంగ్లీష్ లోనే  చేసేవారు. ఆర్థిక మంత్రిగా ఆయన  బడ్జెట్ ప్రసంగం కూడా విధిగా ఇంగ్లీష్ లోనే ఉండేది.  ఇలా ఎందుకు ఆయన ఇంగ్లీష్ లోనే మాట్లాడతారో అర్థం కాదు.

 

పక్కరాష్ట్రం తెలంగాణా అసెంబ్లీలో అధికార భాష పూర్తిగా తెలుగే. ముఖ్యమంత్రి మొదలుకుని  స్పీకర్ దాకా అంతా తెలుగులో నే మాట్లడతారు. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ బడ్జెట్ ప్రసంగం ఎపుడూ తెలుగులోనే ఉంటుంది.

 

 దీనికి భిన్నంగా  ఆంధ్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం ఎపుడూ ఇంగ్లీష్ లోనే ఉంటుంది.  గత ఏడాది తెలుగు అభిమానులంతా  ఈ పోలిక తీసుకువచ్చి ఈ విషయంలో యనమల మీద పూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణా అర్థిక మంత్రి చక్కగా తెలుగులో మాట్లాడితే, ఆంధ్ర ఆర్థిక మంత్రికి ఏమోచ్చింది, ఇంగ్లీషొదలడని విమర్శ వచ్చింది.

 

ఈసారి తెలుగు రాజధాని అమరావతిలో  ప్రవేశపెడుతున్న తొలిబడ్జెట్ ఇంగ్లీష్ లో  ఉంటుందా తెలుగులో ఉంటుందా అనేది చర్చనీయాంశమయింది.

 

ఈ లోపు, ప్రముఖ హిందీ, తెలుగు  పండితుడు,మాజీ రాజ్యసభ సభ్యుడు పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ స్పీకర్ కోడెల శివప్రసాద రావుకు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడికి ఒక లేఖ రాస్తూ, బడ్జెట్ ను తెలుగులో ప్రవేశపెట్టమని కోరారు.

 

పలుమార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఈ  అమరావతి తొలిబడ్జెట్ తెలుగు ప్రవేశపెడతారా లేక తన వరవడిలో కొట్టుకు పోతారా చూడాలి.

 

 

 

 

click me!