
సోషల్ మీడియా మీద రెండు తెలుగు ప్రభుత్వాలు యుద్ధం ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ మధ్య ప్రధాన ప్రతికలలో ప్రభుత్వం మీద విమర్శనాత్మక వార్తలు తగ్గిపోవడం, అధికార పార్టీల నేతలు స్వయంగా మీడియా రంగంలో దూకడమో లేక మీడియాలో మిత్రులను సమకూర్చుకోవడం చేయడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలలో సోషల్ మీడియా ‘క్రిటికల్ జర్నలిస్టు’ పాత్ర పోషిస్తూ ఉంది.
దీనితో బెంబేలు పడిపోయిన ప్రభుత్వాలు సోషల్ మీడియా మీద విరుచుకుపడేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.
ఇక తెలంగాణలోనయితే, తెలంగాణా జెఎసి నేత ప్రొఫెసర్ కోదండ రామ్ ఈ మధ్య సోషల్ మీడియాలో దూసుకుపోతూ ఉండటం కూడా పింక్ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారిందని చెబుతున్నారు.
నేపథ్యంలో తెలంగాణా తెలుగుదేశం పార్టీ ఒక ప్రకటన విడుదల చేస్తూ తెలంగాణా రాష్ట్ర సమితి ప్రభుత్వం తీసుకోబోతున్న చర్యల పట్ల నిరసన తెలిసింది.
పార్టీ అధికార ప్రతినిధి నన్నూరి నర్శిరెడ్డి ఈ రోజు ఒకప్రకటన విడుదల చేస్తూ ‘ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలను మార్ఫింగ్ చేశారని, ఒకమార్ఫింగ్ వీడియోను చూపిస్తూ సైబర్ నేరాల సెక్షన్ల కింద సోషల్ మీడియా మీద కేసులు పెడతామని టిఆర్ ఎస్ నేతలు చెబుతున్న మాటల వెనక కెసిఆర్ సర్కార్ కుట్ర దాగి ఉంది,’ అని విమర్శించారు.
అధికారం అడ్డంపెట్టుకుని పత్రిలకను ప్రసార సాధనాలను నియంత్రిస్తున్న కెసిఆర్ ప్రభుత్వం సోషల్ మీడియాలో ప్రభుత్వం పై వస్తున్న వ్యతిరేకతను చేసి భరించలేక ఇలాంటి చర్యల గురించియోచిస్తున్నారని అన్నారు. ఈ ఆలోచన దుర్మార్గం, సిగ్గు చేటు అని ఆయన వర్ణించారు.
‘ మీ టివిలో, పత్రికలలో అనేక వాస్తవాలను ప్రచురిస్తున్నారు. వాటి మీద ఏ రకమయిన కేసులు పెట్టాలి,’అని నర్శిరెడ్డి అన్నారు. దీనికి వ్యతిరేకంగా పోరాటాలు జరపాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
ఇక అటువైపు ఆంధ్రలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కి సోషల్ మీడియా నుంచి రక్షణ కోసం పార్టీ నేతలు కృషి మొదలుపెట్టారు. ఏపీ హౌసింగ్‌బోర్డు ఛైర్మన్ వర్ల రామయ్య ఈ రోజు చంద్రబాబునాయుడి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వస్తున్న పోస్టింగ్ లగురించి విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
‘ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటోలను మార్పింగ్ చేస్తూ అసభ్యంగా ప్రచారం చేస్తున్నారు. ఇటీవల నా ఫేస్‌బుక్ ఖాతాలోకి చంద్రబాబు ఫొటోను మార్పింగ్ చేసి ఆయనకు వ్యతిరేకంగా పెట్టిన ఒక పోస్టింగ్ పబ్లిష అయింది. ఇలాంటి వాటితో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం కూడా ఉంది.’ అని ఆయన విజయవాడలో విలేకరుల సమావేశంలో అన్నారు.
ఈ మధ్య చంద్రబాబు నాయుడి దావోస్ యాత్ర, అక్కడ పెట్టుబడుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రచారం తీరు సోషల్ మీడియాలో బాగా విమర్శలకు గురయింది. అసలు చంద్రబాబు నాయుడిని కీలకోపన్యాసానికి ప్రపంచ ఆర్థిక సదస్సు ఆహ్వానించలేదని, ఉపన్యాసకుల జాబితాలో ఆయన పేరే లేదని సోషల్ మీడియా వెల్లడించింది. దీని మీద ఇరుకున పడ్డ ముఖ్కమంత్రి కార్యాలయం సోషల్ మీడియా కు వివరణ ఇస్తూ ప్రకటన కూడా జారీ చేసింది. అప్పటినుంచే సోషల్ మీడియా మీద నియంత్రణ ఉండాలని అక్కడక్కడ ముఖ్యమంత్రి నాయుడు కూడా అంటూవచ్చారు.
ముఖ్యమంత్రికి,ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా పోస్టులు చేస్తోన్న వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారని వర్ల రామయ్య వెల్లడించారు.
తెలంగాణా ప్రభుత్వం మీద పత్రికల్లో విమర్శనాత్మక వార్తలు రావడం బాగా తగ్గిపోయింది. దీనితో సోషల్ మీడియా విమర్శనాత్మక పాత్ర పోషించడం మొదలుపెట్టింది. ముఖ్యమంత్రి ఉద్యోగాల మీద చేసిన విభిన్న ప్రకటనలుగాని, టిఆర్ఎస్ నాయకుడొకరు ఉద్యోగాలిప్పిస్తానని డబ్బు లుసేకరించి, డబ్బు వాపసు అడిగినందుకు చావగొట్టిన వీడియోలు బయటకు వచ్చి అధికారపార్టీకి ఇరుకున పెట్టాయి. ఈ నేపథ్యం నుంచే సోషల్ మీడియా ఆంక్షలనే హెచ్చరికలు వస్తున్నాయి.
సైబర్ నేరాల కేసులకు సోషల్ మీడియా భయపడి పారిపోతుందా... లేక ప్రభుత్వాలను ముప్ప తిప్పలు పెడుతుందా.. వేచి చూడాలి