
తరాలు మారినా..మహిళలపై దాడులు మాత్రం ఆగడం లేదు. ఇంటి గడప దాటి బయటకు అడుగుపెట్టాలంటే ఆడపిల్లలు బయపడాల్సి వస్తుంది. కళాశాలలు, కార్యాలయాలు, బస్ స్టాప్ లలో లైంగిక దాడులను ఎదుర్కొంటున్నారు. నేటికీ చాలా మంది మహిళలు వర్న కట్న సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఎన్ని చట్టాలు అమలులోకి వచ్చినా..లాభం లేకుండా పోతుంది. చాలా మంది తమ సమస్యలను పంటి బిగుటున దాచుకుంటున్నారే తప్ప.. పోలీసు స్టేషన్ గడప తొక్కి పరిష్కారాన్ని కోరడం లేదు. అలాంటి మహిళల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓ ఆయుధాన్ని అందిస్తోంది. అదే ‘ 181’. ఈ హెల్ప్ లైన్ నెంబర్ తో మహిళలు తమ సమస్యను ప్రభుత్వానికి, పోలీసులకు తెలియజేయవచ్చు.
వివరాల్లోకి వెళితే.. మహిళల పై దాడులు, వరకట్న వేధింపుల వంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘ మహిళా హెల్ప్ లైన్’ ఏర్పాటు చేసింది.మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ హెల్ప్ లైన్ ను ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరారావు ఈరోజు సచివాలయంలో లాంఛనంగా ప్రారంభించారు. మహిళలకు సంబంధించిన ఎలాంటి ఫిర్యాదునైనా ల్యాండ్ లైన్ లేదా.. మొబైల్ ఫోన్ నుంచి 181 నంబర్ కి కాల్ చేసి చెప్పవచ్చని ఈ సందర్భంగా తెలిపారు.
ఈ హెల్ప్ లైన్ ను సమర్థవంతంగా నిర్వహించేందుకు కొంపల్లిలోని జీవీకేలో కార్యాలయం ఏర్పాటు చేశారు.
హెల్ప్ లైన్ విధులు..:
ఈ హెల్ప్ లైన్ 24/7 పనిచేస్తుందని మంత్రి తెలిపారు. మహిళల సమస్యలను పరిష్కరించడంతోపాటు రహస్య కౌన్సిలింగ్ కూడా ఇస్తారు. ఎవరైనా ఫోన్ చేసి సమస్యను వివరిస్తే.. వారి సమస్యను అక్కడి అధికారులు రికార్డు చేసుకుంటారు. పబ్లిక్ స్థలాల్లో లైగింక వేదింపులపై పోలీసులు షీ టీమ్ తో అనుసంధానం చేస్తారు. డిప్రెషన్, ఆత్మహత్యలకు పాల్పడదలిచిన మహిళలకు సైక్రియాట్రిస్ట్ లతో కౌన్సిలింగ్ ఇప్పిస్తారు. వసతి కోరుకునే మహిళలకు షార్ట్ స్టేహోమ్స్, స్వాధార్ హోమ్స్ కు అనుసంధానం చేస్తారు. ఫిర్యాదులను గోప్యంగా ఉంచడంతోపాటు ఎప్పటి కప్పుడు పర్యవేక్షణ జరిపి తక్షణ చర్యలు తీసుకుంటారు. అనుకోని సంఘటనలు జరిగితే మహిళలకు అత్యవసర విడిది ఏర్పాటు చేస్తారు.