
ఏటీఎం క్యూలు, బ్యాంకు క్యూలలో ఇప్పటి వరకు మరణాలు సంభవించిన వార్తలే వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడొక ఆడబిడ్డకు క్యూలో ఉండగానే పురిటినొప్పలొచ్చాయి. గత్యంతరం లేని పరిస్థితుల్లో బ్యాంకులోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ దేహత్ జిల్లాలోని జింజాక్ లో చోటు చేసుకుంది.
సర్వేషా (30) అనే గర్భిణీ డబ్బు విత్ డ్రా చేసేందుకు గురువారం తన అత్తతో కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వచ్చింది. రోజంతా వేచి చూసినా బ్యాంకు అధికారులు కరుణించలేదు. పైసా చేతికందలేదు.
దీంతో మరుసటి రోజు (శుక్రవారం) కూడా ఉదయాన్నే బ్యాంకుకు వచ్చి అత్తతో కలసి క్యూలో నిలబడింది. సాయంత్రం అవుతున్నా తన వంతు రాలేదు.ఇంతలోనే ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. దీంతో బ్యాంకులో ఉన్న ఆమె అత్త అక్కడే ఉన్న మహిళలు ఆమెను బ్యాంకులోని ఒక గదిలో తీసుకెళ్లి కాన్పు చేయించారు.
సర్వేషా బ్యాంకులోనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సర్వేషా భర్త అష్వేంద్ర గతంలో రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. దానికి సంబంధించి పరిహారం తీసుకొనేందుకే అత్త తో కలసి సర్వేషా బ్యాంకుకు వచ్చారు.