వాట్సాప్ బిజినెస్ యాప్ వచ్చేసింది

First Published Jan 21, 2018, 9:20 AM IST
Highlights
  • వాట్సాప్ బిజినెస్ యాప్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది.
  • వ్యాపారులు తమ కస్టమర్లకు సులభంగా దగ్గరయ్యేందుకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

వాట్సాప్ లో ఇక బిజినెస్ చేయడం చాలా సులువు. ప్రత్యేకంగా చిన్నవ్యాపారుల కోసం వాట్సాప్.. ఈ బిజినెస్ యాప్ ని ప్రవేశపెట్టింది.గతేడాది ఈ యాప్ విడుదల గురించి వాట్సాప్ ప్రకటన చేసిన విషయం విదితమే. ఈ క్రమంలోనే ప్రస్తుతం వాట్సాప్ బిజినెస్ యాప్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. వ్యాపారులు తమ కస్టమర్లకు సులభంగా దగ్గరయ్యేందుకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. తమ ఉత్పత్తుల అమ్మకం దగ్గర నుంచి తాము అందిస్తున్న సేవలు, కస్టమర్ కేర్ సర్వీసులను ఈ యాప్ ద్వారా వ్యాపారులు తమ కస్టమర్లకు సులభంగా వివరించేందుకు, వారికి మరింత దగ్గరయ్యేందుకు వీలు కలుగుతుంది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న యాప్‌కు దీనికీ ఎలాంటి సంబంధం లేదు. రెండూ ఒకే రీతిలో కనిపిస్తాయి. రెండింటినీ వేర్వేరు నెంబర్లతో యాక్సెస్‌ చేయొచ్చు.

సాధారణ వాట్సాప్‌ ఖాతా తెరిచినట్టే ఇందులో ఖాతా తెరవాలి. ఆ తర్వాత అందులో మీ వ్యాపారానికి సంబంధించిన వివరాలు, చిరునామా, అందుబాటులో ఉండే వస్తువులు, సమయం... లాంటి సమాచారం ఇవ్వాలి. ఎవరైనా మీ వాట్సాప్‌ ఖాతాకు సందేశం పంపి అవసరమైన సమాచారం తెలుసుకోవచ్చు. ఓ వినియోగదారుడు ఫలానా వస్తువు కావాలి అని అడిగితే దానికి సంబంధించిన సమాచారం అందులో పంపొచ్చు. మీ దుకాణం మూసి ఉన్న సమయంలో వినియోగదారుడు మిమ్మల్ని వాట్సాప్‌లో సంప్రదించాలని చూస్తే అవతలి వ్యక్తికి మీ వ్యాపార సమయాన్ని తెలియజేస్తూ సందేశం వెళ్తుంది. ఇందులో ‘/’ గుర్తు ద్వారా క్విక్‌ రిప్లై సౌకర్యం కూడా అందించారు. అంటే ‘/’ గుర్తు టైప్‌ చేయగానే.. ఆటోమేటిక్‌గా ఆఫర్ల వివరాలు, డెలివరీ సమయం వివరాలు లాంటి సమాచారం కనిపిస్తుంది. దాన్ని వినియోగదారుడికి పంపొచ్చు.

ప్రస్తుతం ఈ వాట్సాప్ బిజినెస్ యాప్ ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంపై గూగుల్ ప్లే స్టోర్‌లో లభిస్తున్నది. త్వరలోనే ఐఓఎస్ ప్లాట్‌ఫాంపై దీన్ని లాంచ్ చేయనున్నారు. ఇండోనేషియా, ఇటలీ, మెక్సికో, యూకే, యూఎస్ దేశాల్లో ఈ యాప్ లభిస్తుండగా, త్వరలో భారత్‌లోనూ వాట్సాప్ బిజినెస్ యాప్ వ్యాపారులకు అందుబాటులోకి రానుంది. కాగా ఇప్పటికే ఈ యాప్‌ను కొన్ని లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకోవడం విశేషం.

click me!