
తెలంగాణ తెలుగుదేశం రెబెల్ రేవంత్ రెడ్డి చాలా పెద్ద పథకంతోనే తెలుగుదేశం ఆంధ్ర మహానేతల మీద బాంబులు విసిరారనిపిస్తుంది. ఈ విషయం మీద రెబెల్ రేవంత్ తో సన్నిహితంగా ఉన్న తెలుగుదేశం నాయకులతో, ఆయన మీద ఆశతో గాంధీ భవన్ అన్ని తలుపులు తెరచి పెట్టిన కాంగ్రెస్ నాయకులతో మాట్లాడినపుడు ఒక ఆసక్తి కరమయిన విషయం వెల్లడయింది. అదేమిటంటే, తెలంగాణలో టిడిపికి వున్న వోట్ బ్యాంక్ (బిసిలు)ను తాకట్టు పెట్టి ఆంధ్రోళ్లు (మంత్రులు, ఎమ్మెల్సీలు) ఎలా వేల కోట్ల కాంట్రాక్టులను, బీర్ ఫ్యాకర్టీల లైనెన్సులు ఎలాకొల్లకొడుతున్నారో ప్రజల ముందు పెట్టడమే రెబెల్ రేవంత్ లక్ష్యమని తెలిసింది.
ఇలా పార్టీ లో జరుగుతున్న ఇన్ సైడర్ ట్రేడింగ్ ని బయటపెట్టి , చంద్రబాబు నాయుడిని, ఆయన వెనక ఉన్న ఆంధ్రా బిజినెస్ పొలిటీషియన్స్ ని ఇరుకున పెట్టడం వెనక రెబెల్ రేవంత్ కు స్పష్టమయిన రాజకీయ లక్ష్యం ఉందని ఆయనతో సన్నిహితంగా ఉండే కాంగ్రెస్ నేత ఒకరు ‘ఏషియానెట్’కు తెలిపారు. ‘‘తను పార్టీవీడటమే కాదు, తనతో పాటు ఒక డజన్ టిటిడిపి లీడర్లను తీసుకెళ్లడమే కాదు... రెబెల్ రేవంత్ ఉద్దేశం, తెలంగాణలో ఉన్న తెలుగుదేశం వోట్ బ్యాంక్ ను కూడా తీసుకెళ్లడం,’’ అని ఆయన చెప్పారు.
అధినేత విదేశాలలో ఉన్నపుడు రెబెల్ రేవంత్ ఆర్థిక మంత్రి యనమల మీద (కెసీఆర్ రూ.2 వేల కోట్లు కాంట్రాక్టు), మరొక మంత్రి పరిటాల సునీత మీద, పార్టీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ (బీర్ ఫ్యాక్టరీ లైసెన్స్) మీద తీవ్రవమయిన ఆరోపణలు చేశాడు. ఇవి మామాలు ఆరోపణలు కాదు, తెలుదేశం పార్టీ పునాదుల్లో పెట్టిన బాంబుల్లాంటివి. ఆంధ్రప్రదేశ్, అమరావతి అంటూ, తెలుగుదేశం నేతలు అక్కడ పదవులు అనుభవిస్తూ తెలంగాణ ప్రభుత్వం తో లాలూచి పడి వ్యాపారాలు చేసుకుంటున్నారన్న అరోపణ వచ్చేనెలలో అన్నొస్తున్నాడంటూ వైసిపి నేత జగన్మోహన్ రెడ్డికిఅందించిన మిసైల్ లాంటిది. ఇక ఆయన అయన దాని ప్రతివూరు నుంచి ప్రయోగిస్తాడు. దాని నుంచి పార్టీనికి రక్షించుకోవడం తెలుగుదేశానికి కష్టమవుతుంది.
తెలంగాణలో టిడిపిని ‘ఆంధ్రా పార్టీ’అని ఎంత బలహీనపర్చినా, ఇక్కడ కొంత బలమయిన వోట్ బ్యాంక్ పచ్చ పార్టీకి ఉంది. టిడిపి లో ఉన్న బిసి బలగం గురించి తెలంగాణ మీద కేంద్రం వేసిన శివరామకృష్ణన్ కమిటి కూడా చాలా స్పషంగా నాలుగయిదు పేజీల విశ్లేషణ చేసింది. ముఖ్యంగా బిసిలు టిడిపి వోట్ బ్యాంక్. ఈ బిసిలవోట్లను టిఆర్ ఎస్ కు తాకట్టు పెట్టి, ఆంధ్రా టిడిపి నేతలు హైదరాబాద్ లో ఉన్న తమ ఆస్తులను కాపాడుకోవాలని, వ్యాపారాలు వృద్ధి చేసుకోవాలని ఆశపడ్తున్నారు. ఎందుకంటే అమరావతి ఇప్పట్లో వాళ్ల బిజినెస్ సెంటర్ అయ్యేలా లేదు. ఈ బిసి వోటు బ్యాంకును తన వైపు తిప్పుకునేందుకే టిఆర్ ఎస్ కూడా ఆశపడతూ ఉంది.అందుకే తెలుగుదేశం పార్టీ వాళ్లకు అడిగినవన్నీముఖ్యమంత్రి కెసిఆర్ ఇస్తున్నారని చెబుతున్నారు.
ఆంధ్ర టిడిపి వోట్ల వ్యాపారాన్ని రేవంత్ పసిగట్టారు. రెబెల్ రేవంత్ తెలంగాణ బిసివోట్లను ఆంధ్రనాయకులు కాంట్రాక్టుల కోసం, బీర్ తయారీ లైసెన్స్ లకోసం, కాజేసిన భూముల క్రమబద్దీకరణకోసం తాకట్టు పెట్టకుండా ఉండేందుకు పథకం వేశారు. తెలంగాణ టిడిపి వోట్ బ్యాంక్ ను ఆయన తనతో తీసుకుపోవాలనుకుంటున్నారు రేవంత్. ఆంధ్రోళ్ల ‘ఇన్ సైడర్ ట్రేడింగ్’ ను బయటపెట్టడంలో భాగంగానే ఆయన ఇద్దరు మంత్రులను, ఒక ఎమ్మెల్సీని ఉతికి ఆరేశారని అంటున్నారు.
దీనివల్ల తనను సస్పెండ్ చేయాలని తెలుగుదేశంలో వత్తిడి పెరగవచ్చు. నిజానికి రేవంత్ కు కూడా అదే కావాలి. అపుడు ఆంధ్రా తెలుగుదేశం పార్టీని తెలంగాణ ప్రజల ముందు దోషిగా నిలబెట్టవచ్చు. తమ వోట్లను ఆంధ్రాటిడిపి వాళ్లు ఎలా తాకట్టు పెడుతున్నారో తెలంగాణ టిడిపి సానుభూతిపరులకు తెలియచెప్పి వాళ్లను తన వైపు తిప్పుకోవచ్చు. తను తెలుగుదేశం పార్టీని ఎందుకు వదిలేయాల్సి వచ్చిందో కూడా చెప్పవచ్చు. దీనితో మరొక పార్టీలోకి వెళ్లడం సుళువుతుంది.
కాంగ్రె స్ నాయకత్వం కూడా ఇదే ఆశిస్తున్నదని సీనియర్ నేత ఒకరు తెలిపారు. తెలంగాణ బిసిలు కాంగ్రెస్ తో లేరని పార్టీలో నమ్మకం ఉందట. అందువల్ల రేవంత్ వస్తే, ఒక బలమయిన రెడ్డి రావడమే కాదు, టిడిపి వోట్ బ్యంక్ ను కూడా తీసుకువస్తాడని వాళ్లు ఆశగా ఎదురుచూస్తున్నారు.
‘కెసిఆర్ ఏదో విధంగా టిడిపి అనేది లేకుండా చేస్తారు. అపుడు టిడిపి వోట్ బ్యాంక్ ఎటుపోతుంది? దానిన్ని కాజేయాలని ఇపుడు బర్రెలు, గొర్రెలు బిసిలకు ముఖ్యమంత్రి ఇస్తున్నారు. వాళ్లు కాంగ్రెస్ వైపో, బిజెపి వైపో వెళ్లరాదని కెసిఆర్ ధ్యేయం. రెబెల్ రేవంత్ తమ వైపు వస్తే, ఆ వోట్ బ్యాంకు తమకు వస్తుందని కాంగ్రెస్ లో నమ్మకం ఉంది,’ అని కాంగ్రెస్ నేత చెప్పారు.
అసలు, ఢిల్లీ నుంచి రేవంత్ వచ్చాక తెలుగుదేశం మీద విరుచుకు పడిన ఉద్దేశమే పార్టీని రెచ్చగట్టడం, ఆపైన క్రమశిక్షణ చర్యలు తీసుకునేలా చేయడమేనని కొందరంటున్నారు.
రేవంత్ తెలంగాణ రెడ్లకు ర్యాలియింగ్ పాయంట్ అవుతున్నందున, ఆయన ఇక తెలుగుదేశం పార్టీలో కొనసాగేపరిస్థితే లేదు. కాబట్టి ఒక పథకం ప్రకారం రెబెల్ రేవంత్ తెలుగుదేశం పార్టీని గిల్లుకుంటున్నారని, దీనితో టిడిపితో రాజీలేని పరిస్థితివస్తుందని వారు వాదన.
ఆంధ్ర తెలుగుదేశం నాయకులు తెలంగాణ ప్రభుత్వంతో లాలూచి పడి, పార్టీ ని ఎలా నాశనం చేస్తున్నారో చెప్పినందుకే తనను సస్పెండ్ చేశారని రేవంత్ పాదయాత్రలో ప్రచారం చేస్తారని ఆయన సన్నిహితుడొక తెలిపారు.
ఆంధ్రోళ్ల మోసాలు చూపి తెలంగాణలో ఉన్న తెలుగుదేశం వోట్ బ్యాంక్ ను తనతో తీసుకువెళ్లేందుకు రేవంత్ అద్భుతమయిన పథకం వేశాడని కాంగ్రెస్ నేత ఒకరు వ్యాఖ్యానించారు.