ఎన్డీయే ఉపరాష్ట్రపతి ఎన్నిక: వెంకయ్యనాయుడు స్పందన

First Published Jul 16, 2017, 8:55 PM IST
Highlights
  • ఉప రాష్ట్రపతి అభ్యర్థి పదవి దక్షిణాదికి
  • వెంకయ్య నాయుడి అభ్యర్థిత్వం మీద ఏకాభిప్రాయం
  • నేడో రోపో ప్రకటన
  • వూహాగానాలు వద్దని వెంకయ్యనాయుడి సలహా

ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా కేంద్రమంత్రి, బిజెపి నేత వెంకయ్య నాయుడు పేరు ఖరారు చేయబోతున్నట్లు సమాచారం.

ఈ పదవికి దక్షిణాది రాష్ట్రాలకు కేటాయించాలని ఎన్డీయే లో ఏకాభిప్రాయం వచ్చింది. అందువల్ల దక్షిణాది నుంచి పార్టీలో సీనియర్ నాయకుడే కాకుండా అన్ని ఉన్నత పదవులు అధిష్టించి అనుభవం సంపాదించినందున వెంకయ్య నాయుడే సరయిన అభ్యర్థి అనే అభిప్రాయం బిజెపితో పాటు ఇతర మిత్ర పక్షాలలో కూడా వచ్చినట్లు తెలిసింది.

అనధికారిక సమాచారం ప్రకారం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన వెంకయ్యనాయుడి పేరు మీద ఎవరికి వ్యతిరేకత లేదని, అందువల్ల ఆయననే  ఎన్డీయే అభ్యర్థి కావచ్చని చెబుతున్నారు.

ఎపుడయిన ప్రకటన వెలువడవచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి.

అయితే, ఈ వూహాగానాల మీద వెంకయ్య నాయుడు స్పందించారు. ‘ఉపరాష్ట్రపతి వంటి అత్యున్నత పదవిపై ఊహాగానాలు సరికాదు . రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ముగిశాక భాజపా పార్లమెంటరీ భేటీ ఉంటుంది . భాజపా పార్లమెంటరీ పార్టీ భేటీలో ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై చర్చిస్తాం. భాజపా కోర్‌కమిటీ సమావేశంలోనూ ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై చర్చ ఉంటుంది . అప్పటి వరకు అభ్యర్థి ఎంపికపై ఊహాగానాలు చేయటం సరికాదు,’ అని  ఆయన చెప్పారు.

click me!