వైఫల్యాన్ని అంగీకరించిన వెంకయ్య

Published : Nov 21, 2016, 04:16 AM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
వైఫల్యాన్ని అంగీకరించిన వెంకయ్య

సారాంశం

86 శాతం చెలామణిలో ఉన్న నగదును రద్దు చేస్తే సమస్యలు తలెత్తుతాయని ఊహించలేదని వెంకయ్య చెప్పటం ప్రభుత్వ వైఫల్యమని అంగీకరించినట్లే.

నోట్ల రద్దుతో ఎదురయ్యే సమస్యలను ఊహించలేదని చెప్పటం ద్వారా వెంకయ్య కేంద్రం వైఫల్యాన్ని అంగీకరించారు. అయితే,  నోట్ల రద్దు నిర్ణయాన్ని కేంద్రమంత్రి ముప్పవరపు వెంకయ్యనాయడు బాగానే సమర్ధించుకుంటున్నారు. నల్లధనం అరికట్టేందుకు, నకిలీ నోట్ల నియంత్రణకే ప్రధాని సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని అభివర్ణించారు. బాగానే ఉంది. ఈ సందర్భంగా అనేక అంశాలను ప్రస్తావించారు. అయితే, తాను చెప్పిన అంశాలపై వెంకయ్యే కొన్ని ప్రశ్నలకు సూటిగా సమాధానాలిస్తే బాగుంటుంది.

 

దీర్ఘకాలిక  ప్రయోజనాలను అర్ధం చేసుకుని దేశప్రజలందరూ పెద్ద నోట్ల రద్దును స్వాగతిస్తున్నట్లు చెప్పారు. నల్లధనాన్ని వెలికితీయవద్దని ఎవరైనా మోడికి చెప్పారా? లేదే. ఆ పేరుతో తీసుకున్న ఒకసారి నోట్ల రద్దైపోయిన తర్వాత ఎవరైనా చేయగలిగేది ఏముంటుంది. మోడి చర్యపై వ్యతిరేకత వ్యక్తం చేయటానికి కూడా ప్రజలకు అవకాశం దొరక లేదు. ప్రధాని ప్రకటనపై నిరసన వ్యక్తం చేయటంకన్నా ముందుగా ఇంటి ఖర్చులకు ప్రత్యామ్నాయాలను వెతుక్కోవటానికే ప్రజలకు సమయం సరిపోవటం లేదు. ఈ నేపధ్యంలో ఇక నిరసనలకు ఎవరు దిగుతారు? అయినా సూరత్, ముంబాయి, ఢిల్లీలో బ్యాంకులు, ఏటిఎంల వద్ద జరుగుతున్న గొడవల మాటేమిటి?

 

ఇక, మోడి చిత్తశుద్దిపై దేశప్రజలకు పూర్తి నమ్మకముందుని వెంకయ్య అంటున్నారు. అయితే పెద్ద నోట్ల రద్దు విషయం కొందరు పెద్దలకు ముందే తెలుసని విస్తృతంగా ప్రచారంలో ఉంది. అందుకనే ఇప్పటి వరకూ నల్లధనం ఉందన్న వారిపై ఎటువంటి దాడులు జరగలేదు. ఈ విషయం సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నమాట వాస్తవం కాదా?

 

దేశహితం కోసం ప్రధాని తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు పరిష్కారాలు చూపకుండా అనవసర రాద్దాంతం చేస్తున్నాయని మండిపడుతున్నారు. అంటే నిర్ణయం తీసుకునేది అధికారపక్షం, సమస్య తలెత్తితే పరిష్కారాలు చూపాల్సింది ప్రతిపక్షాలా? ప్రధాని తీసుకున్న నిర్ణయంలోని లోపాలను ఎత్తిచూపటం జాతి వ్యతిరేక చర్యా? 86 శాతం చెలామణిలో ఉన్న నగదును రద్దు చేస్తే సమస్యలు తలెత్తుతాయని ఊహించలేదని వెంకయ్య చెప్పటం ప్రభుత్వ వైఫల్యమని అంగీకరించినట్లే.

 

ఇక, గడచిన 13 రోజుల్లో దేశవ్యాప్తంగా ఏ మేరకు నల్లధనం బయటకు వచ్చిందో ప్రభుత్వం ఇంత వరకూ  ప్రకటన ఎందుకు చేయలేదు? అన్నీ బ్యాంకుల్లో కలిపి సుమారు  రూ. 5 లక్ష్లల కోట్లు జమైందంటున్నారు. అదంతా సామాన్యుల డబ్బే కానీ నల్లధనం కాదుకదా? తమ వద్ద ఉన్న చెల్లని నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్నారు. దానికి అప్పటికే బ్యాంకుల్లోని వివిధ ఖాతాల్లో నిల్వ ఉన్న సొమ్మును కూడా కలిపి కేంద్రం లెక్కలు చెబుతోంది. అదంతా నల్లధనం ఎలా అవుతుంది?

 

నిజంగా నల్లధనం ఉన్న వారు ఎవరూ ఆందోళన పడుతున్న దాఖల్లేవు. ఎవరో కొందరు తమ వద్దున్న డబ్బును కాల్చేయటం, నీళ్ళలో పడేయటం, రోడ్లలో పరేస్తున్నారు. అటువంటి సంఘటనలు చాలా తక్కువ. నిజంగా నల్లధనం ఉన్నదనుకున్న వారిపై ఐటి శాఖ దాడులు జరిపి పెద్ద ఎత్తున పట్టుకున్నట్లు కనబడలేదు. అంటే, నిజంగా నల్లధనం ఉన్న వారిలో అత్యధికులు  సేఫ్.

 

పెద్ద నోట్ల రద్దుతో అటు ప్రభుత్వం బాగానే ఉంది. ఇటు నల్లధన కుబేరులకు ఎన్నో మార్గాలున్నాయి. మధ్యలో అవస్తలు పడుతున్నది మాత్రం సామాన్యులే. మరో ఆరుమాసాలైతే కానీ సమస్యలు పూర్తిగా పరిష్కారం కావని స్వయంగా రిజర్వ్ బ్యాంకు, కేంద్రమంత్రి అరుణ్ జైట్లీనే చెబుతుంటే, మరో 15 రోజుల్లో పరిష్కారమైపోతుందని వెంకయ్య చెప్పటం హాస్యాస్పదమే.

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !