
ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ ని భారత్ కైవసం చేసుకుంది. నాలుగోసారి భారత్ ఈ టైటిల్ సొంతం చేసుకోవడం విశేషం. శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో 8 వికెట్ల తేడాతో భారత జట్టు విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 50 ఓవర్లకు 216 పరుగులు చేయగా.. టీం ఇండియా కేవలం 38.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది.
టోర్నీ మొత్తం అజేయంగా నిలిచిన పృథ్వి షా సేన.. ఫైనల్లోనూ అదే జోరు కొనసాగించింది. తిరుగులేని ఆధిపత్యం చెలాయించింది. బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్.. ఇలా అన్ని రంగాల్లో రాణించి మూడుసార్లు విశ్వ విజేత అయిన ఆస్ట్రేలియాను ఓ పసికూనగా మార్చేసింది. ఓపెనర్ మంజోత్ కల్రా (101 నాటౌట్) సెంచరీతో చెలరేగాడు. టోర్నీ తొలి మ్యాచ్‌లోనే ఇదే ఆస్ట్రేలియాపై వంద పరుగులతో గెలిచిన టీమిండియా.. ఫైనల్లోనూ ఆసీస్‌ను మట్టి కరిపించింది.