
భారత దేశానికి విశేషసేవలందించిన టియు 142ఎం లాంగ్ రేంజ్ మారిటైం పెట్రోల్ విమానం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ సొత్తు అయింది. సర్వీసునుంచి విరమణపొందిన ఈ రక్షణ గస్తీ విమానాన్ని వైస్ అడ్మిరల్ బిస్త్ విశాఖలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అందించారు. ఈ రోజు ఐఎన్ ఎస్ డేగా వద్ద ఈ అప్పగింత జరిగింది. బీచ్ రోడ్ లో కన్వెన్షన్ సెంటర్ పక్కన ఈ విమానం ఒక మ్యూజియం గా మారిపోతుంది. ఒక వైపు సబ్ మెరైన్,మరొక వైపు ఈ విమానం పర్యాటకులకు విజ్ఞానం,వినోదం కల్గిస్తాయని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.
1989 ఏప్రిల్ 16న టియు 142 భారత వైమానిక రంగంలో ప్రవేశించింది. మార్చి 29, తమిళనాడులోని అరక్కోణం ఎయిర్ స్టేషన్ లో ఇది సర్వీస్ నుంచి విరమణ పొందింది. మొత్తంగా 29 సంవత్సరాలతో 30 వేల గంటల పాటు దేశానికి సేవలందించింది. సముద్రగస్తీ, సబ్ మెరైన్ పర్యవేక్షణలో టియు 142 విశేష సేవలందించింది. ఈ విమానాన్నినాటి సోవియట్ రష్యాకు తయారు చేసింది.
ఈ ఉదయమే ఇది విశాఖకు చివరి యాత్రచేసింది. టియు 142 ఎం లాంగ్ రేంజ్ మారిటైం పెట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్ గా పిలువబడిన ఈ విమానం ఐఎన్ ఎస్ డేగా దగ్గిర భూమ్మీదకు దిగినపుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పౌర విమాన శాఖమంత్రి అశోకగజపతి రాజు, వైస్ అడ్మిరల్ హెచ్ సి ఎస్ బిస్త్ (ఫ్లాగ్ ఆఫీసర్ కమాండ ర్ ఇన్ చీఫ్) , పలువురు ఎంపిలు, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. విమానం దిగగానే ముఖ్యమంత్రి సిబ్బందితో కొద్దిపేపు ముచ్చటించారు.
గతంలో, డిఎండక్షన్ తర్వాత ఈ విమానాన్ని రాష్ట్రానికి అప్పగిస్తే దానిని మ్యూజియం మారుస్తామని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కేంద్రాన్నికోరింది. ఈ విజ్ఞప్తి మేరకు కేంద్రం నేడు ఈ విమానాన్ని రాష్ట్రానికి అప్పగించింది.
టియు 142 ఎం అనేక కీలకమయిన సైనికచర్యలలో పాల్గొంది. మాల్దీవులలో చేపట్టిన ఆపరేషన్ కాక్టస్, ఆపరేషన్ విజయ్ 1988, ఆపరేషన్ పరాక్రమ్ 2002 ఇందులో కొన్ని.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ విశాఖ ను నేవీ హబ్ గా తీర్చిదిద్ది ఇండియన్ నౌకాదళానికి రాజధానికి మార్చబోతున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగ ప్రమోషన్ లో టియు 142 ఎం ఒక మైలురాయి అవుతుందని ఆయన అన్నారు