
టిటిడి పరిధిలోని కడప జిల్లా ఒంటిమిట్టలో గల శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఆగస్టు 21 నుండి 24వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఆగస్టు 21న విష్వక్సేనారాధన, అంకురార్పణంతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి.ఆలయంలో సంవత్సరం పొడవునా జరిగిన పలు క్రతువుల్లో తెలిసీ తెలియక జరిగిన దోషాల నివారణకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాల వల్ల ఒక సంవత్సరంపాటు యజ్ఞం చేసినంత ఫలితం కలుగుతుందని అర్చకులు చెబుతున్నారు.ఆగస్టు 22న ఉదయం చతుష్టానార్చాన, పవిత్రప్రతిష్ఠ, సాయంత్రం పవిత్ర హోమం నిర్వహిస్తారు. ఆగస్టు 23న ఉదయం పవిత్ర సమర్పణ, సాయంత్రం పవిత్రహోమాలు చేపడతారు. ఆగస్టు 24న మహాపూర్ణాహుతి, పవిత్ర వితరణ కార్యక్రమాలు జరుగనున్నాయి.
ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భక్తి సంగీతం, హరికథ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.