
కర్ణాటక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘ ఇందిరా క్యాంటీన్స్’ పథకాన్ని ప్రారంభించింది. దీనిని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంథీ ఈరోజు ప్రారంభించారు. కాగా.. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం తప్పుల తడకగా సాగింది. పలు మార్లు ఆయన పొరపాటు పడటంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే..
ఇందిరా క్యాంటీన్ల పథకాన్ని ప్రారంభించిన అనంతరం .. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రసంగంలో ‘ ఇందిర క్యాంటీన్ల’కు బదులు.. ‘ అమ్మ క్యాంటీన్లు’ అంటూ పలికారు. అంతే కాకుండా రెండు మూడు సార్లు క్యాంటీన్ కి బదులు ‘కాంపైన్’( ప్రచారం) అనే పదాన్ని ఉపయోగించారు. ‘మరి కొద్దినెలల్లో కర్ణాటకలోని అన్ని ప్రాంతాలకు చెందిన పేదలు అమ్మ.. కాదు కాదు ఇందిర క్యాంటీన్ లలో కడుపునిండా భోజనం చేయగలుగుతారు’ అన్నారు. ఇలా తడబడుతూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు. దీంతో ఆయన ప్రసంగాన్ని విన్న కాంగ్రెస్ శ్రేణులు సైతం పెదవి విరుస్తున్నారు.
దేశవ్యాప్తంగా ‘ అమ్మ క్యాంటీన్లు’ అనగానే దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గుర్తుకు వస్తారు. ఆమె తమిళనాడు ప్రజల కోసం ఈ విధానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిందే. ‘ అమ్మ క్యాంటీన్లు’ బాగా పాపులారీటినీ సంపాదించుకున్నాయి. ఈ నేపథ్యంలోనే రాహుల్ కి ఇందిర క్యాంటీన్లకు బదులు అమ్మ క్యాంటీన్లు అని నోటికి వచ్చింది.
ఈ ఇందిర క్యాంటీన్లలో ఈరోజు నుంచి అల్పాహారం రూ.5, భోజనం రూ.10లకే అందిస్తున్నారు. 2015 ఏడాది బడ్జెట్‌లోనే ఇందిరా క్యాంటీన్లనిర్వహణకు ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. కార్యక్రమం అనంతరం రాహుల్ గాంధీ.. పార్టీ శ్రేణులతో కలిసి క్యాంటీన్ భోజనం రుచి చూశారు.