రైలు ప్రమాదం: చెవుల్లో ఇయర్ ఫోన్స్, డ్రైవర్ తప్పిదమే...

First Published Apr 26, 2018, 12:41 PM IST
Highlights

కుషీనగర్ రైలు ప్రమాదానికి స్కూల్ వ్యాన్ డ్రైవర్ తప్పు కారణమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అన్నారు.

లక్నో: కుషీనగర్ రైలు ప్రమాదానికి స్కూల్ వ్యాన్ డ్రైవర్ తప్పు కారణమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అన్నారు. గురువారం ఉదయం వేగంగా వచ్చిన రైలు స్కూల్ వ్యాన్ ను ఢీకొట్టిన విషయం తెలిసిందే.

ఈ ప్రమాదంలో 13 మంది చిన్నపిల్లలు మరణించగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. గురువారం ఉదయం 7 గంటల ప్రాంతంలో డివైన్ స్కూల్ కు చెందిన వ్యాన్ ను రైలు ఢీకొట్టింది. ఆ సమయంలో వ్యాన్ లో 25 మంది విద్యార్థులు ఉన్నారు. వారంతా పదేళ్ల లోపు వయస్సు గల పిల్లలే.  

రైల్వే క్రాసింగ్ ను దాటుతుండగా వ్యాన్ ను రైలు ఢీకొట్టింది. అక్కడ కాపలదారు లేడు. గోరక్ పూర్ నుంచి రైలు శివాన్ వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. 

రైళ్ల రాకపోకల గురించి ప్రయాణికులను హెచ్చరించే గేట్ మిత్ర అప్రమత్తం చేసినట్లు, అయితే, అప్పటికే వ్యాన్ పట్టాల మీదికి వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. 

గేట్ మిత్ర హెచ్చరికను డ్రైవర్ వినిపించుకోలేదని, చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాడని, వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం సంభవించిందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు.

ఆయన సంఘటనా స్థలానికి హుటాహుటిన బయలుదేరి వెళ్లారు. పసుపు వచ్చ స్కూల్ వ్యాన్ చుట్టూ పెద్ద యెత్తున జనం గుమికూడింది. వ్యాన్ చాలా వరకు ధ్వంసమైంది. గోరక్ పూర్ వెళ్లి సంఘటనపై విచారణ జరపాలని యోగీ ఆదిత్యానాథ్ అధికారులను ఆదేశించారు. 

మృతుల కుటుంబాలకు ఆయన రూ.2 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. ప్రమాదంపై విచారం వ్యక్తం చేస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్స్ చేశారు. 

click me!