
వారాంతపు సెలవులకు తోడు పండుగ సెలవులు కలసి రావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. రెండవ శనివారం, ఆదివారంతో పాటు గోకులాష్టమి, పంద్రాగస్టు సెలవులు కలసి రావడంతో శ్రీవారి దర్శనార్థం తిరుమలకు అసంఖ్యాకంగా భక్తులు తరలివచ్చారు. వైకుంఠం కంపార్ట్‌మెంట్లు, తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, లడ్డూ కౌంటర్లు, నారాయణగిరి ఉద్యానవనాలలో క్యూలైన్లు దాటి భక్తుల రద్దీ అనూహ్యంగా కనబడింది. తిరుమల భక్తులతో కిటకిట లాడుతూ ఉంది.
రద్దీని దృష్టిలోపెట్టుకుని అధికారులు గత రెండు రోజులుగా తిరుమలలో ఉంటూ భక్తులకు అందుతున్న సేవలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగా అన్నప్రసాదం డిప్యూటి.ఇ.ఓ వేణుగోపాల్, క్యాటరింగ్ అధికారి, జి.ఎల్.ఎన్ శాస్త్రి పర్యవేక్షణలో వైకుంఠం కంపార్ట్‌మెంట్లు, పుడ్‌కోర్టులు, గోకులం అతిధి భవనం వద్ద, భక్తజనసందోహం వున్న పలు ప్రాంతాలను పరిశీలించారు. వివిధ క్యూలైన్లలో వేచివున్న భక్తులకు క్రమం తప్పకుండా అన్నప్రసాదాలను, త్రాగునీటి సదుపాన్ని నిరంతరాయంగా అందేలా చూస్తున్నారు. ఈ సేవలలో తి.తి.దే సిబ్బందితో పాటు సుమారు 1600 మంది శ్రీవారి సేవకులు కూడా రాత్రింబగళ్ళు నిరంతరాయంగా సేవలందిస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆరోగ్యశాఖాధికారిణి శ్రీమతి షర్మిష్ట తిరుమల పారిశుద్ధ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
మరో ప్రక్క తి.తి.దే ముఖ్యనిఘా మరియు భత్రాధికారి ఆకే. రామకృష్ట నేతృత్వంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ప్రాంతాలలో వి.జి.ఓ రవీద్రారెడ్డి, ఆలయం చెంత వి.జి.ఓ శ్రీమతి సదాలక్ష్మి పర్యవేక్షణలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురవకుండా క్యూలైన్లలో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.