
‘కడుపునిండా తిండి కూడా తినలేక పేదరికాన్ని అనుభవించే వాడి బాధను అంధుడు కూడా చూడలేడు’ అని అన్నాడు ఓ మహానుభావుడు. నిజమే.. మనిషి..ఎలాంటి బాధను అయినా తట్టుకోగలడేమో గానీ.. ఆకలి బాధను తట్టుకోలేడు. మహా అయితే..ఒక రోజు.. రెండు రోజులు తినకుండా ఉండగలడేమో.. రోజూ తినకుండా ఉండటం అంటే సాధ్యమయ్యే పని కాదు. కోటి విద్యలు కూటి కొరకు అన్నారు పెద్దలు..నిజమే.. ఉదయం లేచిన దగ్గర నుంచి.. మళ్లీ పడుకునే వరకు.. మనిషి చేసే ప్రతి పనీ.. తన, తనవారి కడుపు నింపడం కోసమే. ఇంత కష్టపడుతున్నా.. కొందరికి.. మూడు పూటలా తిండి తినే పరిస్థితిల్లో లేరు. మరికొందరు శ్రమించే శక్తి లేక.. నా అని ఆదరించే వారు లేక .. కడుపు మాడ్చుకొని బ్రతికేవారు కూడా ఉన్నారు. అలాంటి వారి ఆకలి తీర్చేందుకు పుట్టుకు వచ్చిందే.. ‘షేర్ ఏ మీల్’. ఇద్దరు హైదరాబాద్ యువకులు చేపట్టిన ఈ మంచి కార్యం గురించి మనమూ తెలుసుకుందామా...
మేఘరాజ్ ఆనంద్, ధీరజ్ కొల్ల.. అనే ఇద్దరు మిత్రులు.. మరికొందరు తమ మిత్రులతో కలిసి ‘ షేర్ ఏ మీల్’ కి పునాది వేశారు. పేదల ఆకలి తీర్చేందుకు.. ఓ స్వచ్ఛంద సంస్థ.. ప్రభుత్వ నిధులే అవసరం లే దు.. సహాయం చేయాలనే మనసుంటే చాలని నిరూపించారు.. ఈ హైదరాబాద్ కుర్రాళ్లు.
వృత్తి పరంగా వీరిరువురు ఆర్టిస్టులు. ఇద్దరి కీ కామన్ ఫ్రెండ్ అయిన అజహర్ గత మూడేళ్లుగా తనకు తోచినంతలో పేదలకు భోజనాన్ని అందిస్తున్నాడు..అతనని చూసి ఇంప్రెస్ అయిన ధీరజ్, మేఘరాజ్..‘ షేర్ ఏ మీల్ ’ప్రాజెక్టును ప్రారంభించారు.
ఎవరి సహాయం తీసుకోకుండా ఈ ప్రాజెక్టును అమలు చేయాలని వారు భావించారు. దీంతో తామే స్వయంగా వంట చేసి దానిని ఆకలితో అలమటిస్తున్న వారికి రోజుకొకరికి అందిస్తున్నారు. గత 150 రోజులుగా వీరు ఈ ప్రాజెక్టును నిర్విరామంగా నిర్వహిస్తున్నారు.
ఆకలితో బాధపడేవారికి ఒక పూట అయినా.. వారు సంతోషంగా భోజనం చేస్తే చాలనే ఉద్దేశంతో దీనిని మొదలుపెట్టామని వారు చెబుతున్నారు. తాము ఇప్పటి వరకు పేదల ఆకలి తీర్చే స్వచ్ఛంద సంస్థలను చాలా చూశామని..అయినా.. చాలా మంది ఆకలి బాధలు పడుతూనే ఉన్నారని వారు చెప్పారు. పేదల కోసం నిర్విరామంగా కృషి చేసే వాళ్లకు మా ‘ షేర్ ఏ మీల్’ ని అంకింతమిస్తున్నామని వారు ఈ సందర్భంగా తెలిపారు.
వీళ్లని ఆదర్శంగా తీసుకుంటే.. మనం కూడా కొందరి ఆకలి తీర్చవచ్చు.. రోజుకి ఒకరి ఆకలి తీర్చడం మనలో చాలా మందికి పెద్ద కష్టతరమేమీ కాదు.. కనుక మీరు కాస్త ఆలోచించండి.