చేతి గోర్లతో కన్న కూతురి గొంతు కోసి చంపిన తల్లి

First Published 23, Apr 2018, 4:10 PM IST
Highlights

ఆడశిశువు పుట్టినందుకే దారుణం

కటిక పేదరికం ఆ తల్లి చేత కన్న కూతురిని అత్యంత దారుణంగా చంపించిన ఘటన మహారాష్ట్ర లోని థానే లో చోటుచేసుకుంది. ముక్కుపచ్చలారని ఆడ శిశువున్న కన్న తల్లే గొంతు కోసి చంపింది. అప్పుడే పుట్టిన నవజాత శిశువును తన పదునైన చేతి గోర్లతో కోసి మరీ దారణానికి ఒడిగట్టింది. దీంతో తీవ్ర రక్తస్రావమై పసిపాప చనిపోయింది. అయితే కూతురిది సాధారణ మరణమే అని కట్టుకథ అల్లి అందరినీ నమ్మించే ప్రయత్నం చేసి, చివరకు పోలీసులకు చిక్కింది.

ఈ విషాద సంఘటనకు సంబంధించి పోలీసులు, డాక్టర్లు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. థానే సమీపంలోని ఓ గ్రామానికి చెందిన వైశాలీ ప్రధాన్(27) అనే మహిళకు ఇద్దరు ఆడపిల్లలున్నారు. అయితే ఈమెకు మూడో సంతానంగా కూడా ఇటీవలే ఓ ఆడపిల్ల జన్మించింది. అయితే పేదరికం కారణంగా ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లల్ని పోషించడానికి కష్ట పడుతున్న ఈమె ఈ పాపను పెంచుకోడానికి ఇష్టపడలేదు. కొన్ని రోజుల వయసున్న ఆ చిన్నారిని కన్నతల్లే తన పదునైన చేతి గోర్లతో గొంతుకోసి చంపింది.  

అనంతరం ఈ చిన్నారిది సాధారణ మరణమే అని అందరిని నమ్మించడానికి ఆస్పత్రికి తీసుకెళ్లింది. అయితే పసిపాప మెడపై పదునైన చేతి గోర్ల గాట్లు ఉండటంతో డాక్టర్లు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు తల్లి వైశాలిని విచారించగా అసలు విషయాన్ని చెప్పింది. భర్త తాగుడుకు బానిసవడం, ఆడపిల్లల్ని పోషించడం, వారిని రక్షించడం భారంగా భావించే ఈ పని చేసినట్లు ఆమె ఒప్పుకుంది. దీంతో పోలీసులు వైశాలిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Last Updated 23, Apr 2018, 4:10 PM IST