ఎమ్మెల్యే చచ్చిపోతే అభివృద్ధి గ్యారంటీయా?

First Published Jul 12, 2017, 1:06 PM IST
Highlights
  • ఎమ్మెల్యే చచ్చిపోయి, ఉప ఎన్నిక అవసరమయితే తప్ప నియోజకవర్గం అభివృద్ధి జరగదా?
  • ఇపుడు నంద్యాల మీద కురుస్తున్న వరాల జల్లు దీనికి సాక్ష్యం
  • ఈ అనుమానం ఎవరికోకాదు, టిడిపి ఎమ్మెల్యేకే వచ్చింది

ఉన్నట్లుండి  నంద్యాలకు నియోజకవర్గానికి విఐపి హోదా వచ్చింది.

 

అమరావతి తర్వాత గత కొద్ది రోజులుగా వార్తల్లో ఉంటున్న మరొక వూరు నంద్యాలే. ముఖ్యమంత్రి నంద్యాలను సందర్శించారు. ఆయన కుమారుడు లోకేశ్ నంద్యాల కొస్తున్నారు. నలుగరైదుగురు మంత్రులు నంద్యాల మీద  ప్రత్యేక  శ్రద్ధ చూపుతున్నారు. మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ నంద్యాలలో రోడ్లన్నీ రిపేర్ చేయించడంలో, అవసరమయిన చోట కొత్త రోడ్డు వేయించడంలో పడిపోయారు. రోడ్ల మీద రు.300 కోట్ల ఖర్చు చేయబోతున్నట్లు చెప్పారు. 

 

ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు  ఏకంగా నంద్యాల స్మార్ట్ సిటి చేస్తానని వూరించారు. మూలన పడిన ఇద్దరు నంద్యాల నేతలకు (ఎన్ ఎండి ఫరూక్, నౌమాన్)లకు పదవులిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇఫ్తార్ పార్టీ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి నంద్యాలను ఎంచుకున్నారు.

 

 ఉప ఎన్నిక అవసరం రావడంతోటే ఈ నియోజకవర్గానికి ఇంతటి మహర్దశ పట్టింది. గతంలో భూమా నాగిరెడ్డి బతికున్నపుడుగాని, వైసిపి ఎమ్మెల్యే గా ఉన్నపుడు గాని,  తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించినపుడు గాని నంద్యాల వార్తల్లో లేదు. నంద్యాలకు ఒక్క వరమూ ఇవ్వలేదు. ఒక రోడ్డు శాంక్షన్ కాలేదు. రాష్ట్రం నుంచి స్మార్ట్ సిటీల జాబితా తయారు చేస్తున్నపుడు నంద్యాల ఎవ్వరికీ గుర్తు రాలేదు. అంతేకాదు, అనేక కేంద్ర విద్యాసంస్థలను నెలకొల్పుతున్నపుడు నంద్యాల ప్రస్తావనకు కూడా రాలేదు.

 

ఇపుడు ఉప ఎన్నిక అవసరం పడి తెలుగుదేశం పార్టీకి గట్టి సవాల్ ఎదురుకావడంతో  నంద్యాల చంద్రబాబు నాయుడు ముద్దుల పట్టి అయింది.అంటే, ఏదైనా ఒక నియోజక వర్గానికి మహర్దశపట్టాలంటే ఇలా ఉప ఎన్నిక రావల్సిందేనా... అంటే ఉప ఎన్నిక అవసరం రావాలంటే ఉన్న ఎమ్మెల్యే చావాల్సిందే కదా....

 

ఈ అనుమానం ఎవరికో కాదు, ఇపుడు నంద్యాల నియోజకవర్గం  ఉప ఎన్నికకు కారణమయిన భూమానాగిరెడ్డి బావమరది  ఎస్వీ మోహన్ రెడ్డికి వచ్చింది. ఆయన కర్నూలు ఎమ్మెల్యే.

 

నంద్యాల మీద కురుస్తున్న వరాల జల్లు చూసి ఆయనకే దిమ్మతిరిగిపోయింది. నంద్యాల మీద ప్రభుత్వం చూపిస్తున్న వల్లమాలిన ప్రేమ మీద కామెంట్ చేయకుండా ఉండ లేకపోయారు. ఇటీవల నంద్యాల జరిగిన తెలుగుదేశం కార్యక్రమంలో ఈ మేరకు నోరు జారారు.ఉప ఎన్నికలు అవసరమయ్యాక నంద్యాలకు పదవుల పంట పండింది.  ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున  అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. ‘దీన్నిచూస్తే  పక్క నియోజకవర్గాల ప్రజలుకూడా అసూయపడేలా ఉంది. తమ ఎమ్మెల్యే కూడా పోతే (చచ్చి) బాగుంటుందేమో, ఇలా అభివృద్ధి పరిగెత్తు కుంటూ వస్తుంది,’ అన్నారు. అపుడక్కడ వేదిక మంత్రి, భూమానాగిరెడ్డి కూతురు అఖిలప్రియ కూడా ఉన్నారు. మోహన్ రెడ్డి అఖిల ప్రియ మేనమామ.

click me!