
భారతీయ జనతాపార్టీ, తెలుగుదేశం పార్టీలు విశాఖ కేంద్రంగా రాజకీయాలు నడపాలని చూస్తున్నాయి. రెండు పార్టీలు విశాఖ రేవు పట్టణాన్ని ముఖ్యమయిన తూర్పు స్థావరం చేసుకోవాలనుకుంటున్నాయి.
2014లో ఎంపి స్థానాన్ని, ఈ మధ్య ఎమ్మెల్సీ స్థానాన్ని గెల్చుకున్న బిజెపి, ఆంధ్రలో పార్టీని పటిష్టం చేసుకునేందుకు విశాఖ ను కేంద్రం చేసుకోవాలనుకుంటున్నది. అందుకే ఏకంగా జాతీయ కార్యవర్గం సమావేశ వేదికగా విశాఖను ఎంపిక చేసింది. జూలై 15, 16 తేదీలలో బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశం బీచ్ ఒడ్డున నిర్వహించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఈ సమావేశానికి ప్రధాని,పార్టీ అధ్యక్షుడు అమిత్ షాతో పాటుకేంద్రమంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరయి హంగామా చేయబోతున్నారు. ఈ సమావేశం పార్టీ చాలా ప్రాధాన్యం ఇస్తూ ఉంది. ఇక్కడినుంచే పార్టీ ముందస్తు ఎన్నికల పిలుపు నిస్తుందని అంటున్నారు.
అయితే, బిజెపి తేదీలు ప్రకటించిందో లేదో, ఇపుడు తెలుగుదేశం పార్టీ కూడామూడు రోజుల మహానాడు విశాఖ లో జరపాలని నిర్ణయించింది.అందునా బిజెపి కంటే ముందే జరపాలని ప్లాన్ వేసింది. ఎక్కడ ఎంత మొనగాడుగా ఉన్న ఆంధ్రలో ప్రధాని నరేంద్ర మోదీ గాలి వీచడం టిడిపిలో ఎవరికీ ఇష్టం లేదు.
విశాఖలో మే 27, 28, 29 తేదీల్లో టీడీపీ మహానాడు నిర్వహించనున్నట్లు పార్టీ కార్యదర్శిటిడి జనార్థన్ ప్రకటించారు. త్వరలో స్థానిక నేతలతో చర్చించి వేదిక ఖరారు చేస్తామని ఆయన సోమవారం నాడు వెల్లడించారు.
2014 నాటి రాష్ట్ర విభజన నేపథ్యంలో, విజయం అనుమానాస్పదంగా ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ విశాఖ లోక సభ స్థానాన్ని బిజెపికి కేటాయించింది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కంభం పాటి హరిబాబు సునాయాసంగా గెల్చారు. అయితే, ఇది నరేంద్ర మోడీ పలుకుబడి వల్లే గెల్చామని బిజెపి, కాద, టిడిపి వల్లే బిజెపి అభ్యర్థి గెల్చాడని టిడిపిలో భిన్నాభిప్రాయలున్నాయి.ఇంతవరకు ఇవి భయటపడలేదు. పడే సమయం ఆసన్నమయింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖను రాష్ట్ర పైనాన్సియల్ క్యాపిటల్ చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే అక్కడ యేటా సిఐఐతోకలసి పెట్టుబడుల సదస్సులు నిర్వహిస్తున్నారు. సగం మంది ఇన్వెస్టర్లను అటువైపు మళ్లిస్తున్నారు. విశాఖ ఆర్థిక ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికలలో ఎంపి స్థానం తనే ఉంచుకుని, టిడిపిలో తనకు అత్యంత సన్నిహితుడయిన వ్యక్తినో లేదో ఒక కుటుంబ సభ్యుడినో అక్కడి నుంచి అక్కడి నుంచి లోక్ సభకు పంపాలనే ఆయన యోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. చంద్ర బాబు‘మన్ కి బాత్’ బయటపడితే, బిజెపికి, టిడిపికి పొరపచ్చాలు రావచ్చు. అవి వీలయితే, ఎన్ డిఎ బంధాన్ని కూడా తెంచేయవచ్చు కూడా . ఇప్పటికే, వచ్చే ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీచేయాలన్న ఆలోచన బిజెపిలో వేళ్లూనుతూ ఉంది. ఆ మధ్య అనంతపురం లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ప్రధానంగా చర్చించిన విషయమదే. ఇపుడు పార్టీ సీనియర్ నాయకురాలు పురందేశ్వరి రోజూ ఇదే మాటే చెబుతున్నారు.
విశాఖలో వచ్చే జాతీయ సమావేశం నిర్వహించాలనుకోవడం వెనక ఈ దూరాలోచన ఉన్నట్లనిపిస్తుంది. ఏమయినా సరే, ముందు ముందు విశాఖ రాజకీయాలు జోరందుకునే అవకాశం మెండుగా ఉంది.