మంత్రి అఖిలపై మరోసారి ఘాటు విమర్శలు చేసిన ఏవీ

First Published Apr 13, 2018, 1:07 PM IST
Highlights
చంద్రబాబు నచ్చచెప్పినా మారని ఏవీ తీరు


కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ టీడీపీలో మరోసారి విభేదాలు బయట పడ్డాయి. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియపై ఏఐఆర్‌సీ మాజీ చైర్మన్‌, టీడీపీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. అఖిలప్రియతో మనస్పర్ధలు వాస్తవమేనని ఆయన స్పష్టం చేశారు. ఏవీ సుబ్బారెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇగో ప్రాబ్లమ్స్‌ వల్లే అఖిలప్రియ తనపై విమర్శలు చేస్తున్నారని  వ్యాఖ్యానించారు. ‘నన్ను గుంట నక్కతో పోల్చడం బాధాకరం.. మంత్రి విమర్శలకు కాలమే సమాధానం చెబుతుంది. సీనియర్లను మంత్రి ఎందుకు దూరం పెడుతున్నారో అర్థం కావడం లేదు. నేను ఆళ్లగడ్డ నుంచి పోటీ చేయాలా? నంద్యాల నుంచి పోటీ చేయాలా? అన్న విషయం పార్టీ నిర్ణయిస్తుంది.

‘నన్ను ఆళ్లగడ్డకు వెళ్లొద్దని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పినట్టు వస్తున్న వార్తలు అవాస్తవం. అందరూ కలిసి పనిచేయాలని సీఎం సూచించారు. చంద్రబాబు నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. భూమా నాగిరెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా నాతో చర్చించేవారు.. కానీ అఖిలప్రియ నాతో చర్చించాల్సిన అవసరం లేదనుకుంటున్నారు. చంద్రబాబు సింగపూర్ నుంచి వచ్చాక మరోసారి ఆయనతో భేటీ అవుతాను’ అని ఆయన అన్నారు. కాగా.. దీనికి ముందే చంద్రబాబు.. అఖిల, ఏవీ సుబ్బారెడ్డిలతో భేటీ అయ్యారు. ఇరువురు ఒకరితో మరొకరు గొడవ పడవద్దని నచ్చచెప్పారు. ఇద్దరూ కలిసి పనిచేస్తేనే బాగుంటుందని సూచించారు.


అయితే.. చంద్రబాబు నచ్చచెప్పిన తర్వాత కూడా ఏవీలో మార్పు ఏమీ కనపడకపోవడం గమనార్హం. గొడవ పడవద్దని చంద్రబాబు చెప్పిన తర్వాత కూడా అఖిల ప్రియకు ఇగో అంటూ ఏవీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.  ఇదిలా ఉండగా.. వీరిద్దరి కన్ను ఆళ్లగడ్డ మీద ఉందని.. ఆ నియోజకవర్గం మీదే వీరిద్దరి రాజకీయ జీవితం ఆధారపడి ఉందని.. ఈ నేపథ్యంలో వారి మధ్య గొడవలు సద్ధుమణిగే అవకాశమే లేదని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు.

click me!