టీసీఎస్ ఉద్యోగులకు తాత్కాలిక ఊరట

First Published Aug 12, 2017, 4:27 PM IST
Highlights
  • లక్నో టీసీఎస్‌లో 2200 మందికి పైగా ఉద్యోగులున్నారు.
  • నోయిడా లేదా దేశంలోని ఇతర సెంటర్లకు తరలించనున్నట్టు   టీసీఎస్‌ ప్రకటించింది

 

 

లక్నోలోని టీసీఎస్  ఉద్యోగులకు ఆ కంపెనీ.. తాత్కాలికంగా ఊరట కలిగించింది. ప్రస్తుతం లక్నో టీసీఎస్‌లో 2200 మందికి పైగా ఉద్యోగులున్నారు. కాగ, తమ లక్నో ఆఫీసును మూసివేస్తున్నామని, ఉద్యోగులను నోయిడా లేదా దేశంలోని ఇతర సెంటర్లకు తరలించనున్నట్టు  ఇటీవల టీసీఎస్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయంపై ఉద్యోగులు పెద్ద ఎత్తున్న ఆందోళనలు చేశారు. నిర్ణయాన్ని వెనుకకు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఉద్యోగులు చేసిన ఆందోళనతో యాజమాన్యం కూడా  ఈ విషయంపై పునరాలోచన చేసింది. ఇందులో భాగంగానే కంపెనీ సీఈవో రాజేష్‌ గోపినాథన్ నేతృత్వంలోని టీసీఎస్‌ టీమ్‌ ఈరోజు  ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌తో  సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమ ప్రతిపాదనను వారు ముఖ్యమంత్రికి తెలియజేశారు. కాగా.. సీఎం సూచనల మేరకు లక్నోలోనే కార్యాలయాన్ని ఉంచాలనే నిర్ణయం తీసుకున్నట్లు సీఈవో తెలిపారు.  నోయిడాలోని నూతన కార్యాలయాన్ని విస్తరించి.. అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసిన తర్వాతే అక్కడి తరలిస్తామని ఆయన చెప్పారు.

ఇందుకు కనీసం రెండు సంవత్సరాలు పడుతుందని ఆయన తెలిపారు. అంటే ఉద్యోగులు రెండు సంవత్సరాల పాటు లక్నోలో ఉండవచ్చు. ఎన్నో సంవత్సరాలుగా లక్నోలో స్థిరపడిన ఉద్యోగులకు కంపెనీ ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కాస్త ఊరట  కలిగిస్తోంది.లక్నోలో టీసీఎస్‌ తన కార్యకలాపాలు కొనసాగించడానికి ఎయిర్‌పోర్టుకు సమీపంలో స్థలాన్ని యూపీ రాష్ట్రప్రభుత్వం  కంపెనీకి కేటాయించింది. అయినప్పటికీ కంపెనీ నోయిడాకు బదిలీ చేయాలనే అనుకుంటోంది.

click me!