డ్రంక్ అండ్ డ్రైవ్ లో చిక్కిన డీజీపీ కూతురు

First Published Apr 3, 2018, 9:57 AM IST
Highlights
కానిస్టేబుల్ ని ఉద్యోగంలో నుంచి పీకేస్తానని బెదిరించిన యువతి

మోతాదుకి మించి మద్యం సేవించి.. పోలీసుల ముందు ఓ యువతి వీరంగం సృష్టించింది. ఆ యువతి అడిషనల్ డీజీపీ కూతురు కావడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తమిళనాడు అదనపు డీజీపీ తమిళ్‌సెల్వన్‌ కూతురు సోమవారం అర్ధరాత్రి చెన్నైలో హల్‌చల్‌ చేసింది. మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన ఆమె.. తన వాహనాన్ని ఆపిన కానిస్టేబుల్‌పై వీరంగం వేసింది. ‘నన్నే అడ్డుకుంటావా? నేనొక ఐపీఎస్‌ అధికారి కూతుర్ని. నిన్ను ఉద్యోగంలోంచి తీసేస్తాను’ అని విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ను హెచ్చరించింది. అంతేకాకుండా వెంటనే తండ్రికి ఫోన్‌ చేసి.. తనను ఆపిన కానిస్టేబుల్‌ను విధుల నుంచి తొలగించాలని చెప్పింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వీడియోను ఆ కానిస్టేబుల్‌ చిత్రీకరించారు.

చెన్నైలోని పాలవక్కం బీచ్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఆమె తన స్నేహితులతో కలిసి వాహనంలో వెళుతున్న సమయంలో పోలీసు కానిస్టేబుల్‌ అడ్డుకొని.. తనిఖీలకు సహకరించాలని కోరాడు. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న ఆమె విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై దుర్భాషలాడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. పోలీసు ఉన్నతాధికారి కూతుర్ని అనే గర్వంతో విధుల్లో ఉన్న పోలీసులనే హెచ్చరించిన ఆమెపై ఎలాంటి చర్య తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఆమె తన వాహనాన్ని ఆపిన కానిస్టేబుల్‌పైనా కౌంటర్‌ ఫిర్యాదు దాఖలు చేశారు. పోలీసు కానిస్టేబుల్‌ అతిగా ప్రవర్తించాడని, వద్దని వారిస్తున్నా వీడియో తీసి, తమకు ఇబ్బంది కల్పించాడని, అతనిపై చర్య తీసుకోవాలని ఆమె ఫిర్యాదు చేశారు.

click me!