
తమిళులకు భక్తిగానీ, అభిమానంగానీ ఏదైనా అతిగానే ఉంటుందన్నది తెలిసిందే. భక్తులు నాలికలో సూదులు గుచ్చుకోవటం, నిప్పులపై నడవటం వంటివి అక్కడ సర్వసాధారణం. ఆ రాష్ట్రంలో వీధికి ఒక గుడి ఉందంటే అతిశయోక్తికాదు. అసలు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ చిహ్నంలోనే హిందూ దేవాలయం ఉంటుందన్న సంగతి విదితమే. ఇక సినిమా అభిమానులైతే తమ అభిమాన హీరో, హీరోయిన్‌లకు గుడులు కట్టటం కూడా చూశాం. ఎంజీఆర్‌కు, రజనీకాంత్‌కు, కుష్బూకు… ఆఖరికి నమితకు కూడా గుడికట్టారని వార్తలు వచ్చాయి. ఇవన్నీ ఇలా ఉంటే, చెన్నై నగర శివార్లలోని పడప్పై అనే ప్రాంతంలోని ఒక అమ్మవారి గుడిలో యాజమాన్యం భక్తిమార్గాన్ని హైటెక్ రూట్‌లోకి తీసుకెళ్ళి కొత్తపుంతలు తొక్కిస్తోంది.
చెన్నై నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పడప్పై పట్టణంలో అశ్వమిత్ర స్వామీజీ అనే ఓ చిన్నపాటి గురూజీ ఉన్నారు. ఆయనగారి ఆధ్వర్యంలో జయదుర్గ పీఠం అనే పేరుతో ఓ ఆశ్రమం నడుస్తోంది. ఆ ఆశ్రమంలో దుర్గామాత తదితర 22 మంది దేవతలకు ఆలయాలు ఉన్నాయి. అశ్వమిత్ర స్వామీజీ(దుర్గై సిద్ధర్ అని కూడా అంటారు) పుత్రుడు శ్రీధర్ ఈ ఆలయాన్ని నిర్వహిస్తున్నారు. ఈయన హెర్బల్ ఆంకాలజిస్ట్ అని చెబుతున్నారు. ఈ శ్రీధరే ఆలయంలోని ఈ హైటెక్ విధానాలకు రూపకర్త.
ఈ పీఠంలోకి ప్రవేశించగానే ఒక కౌంటర్‌లో భక్తుల పేరు, కాంటాక్ట్ నంబర్, నక్షత్రం వివరాలు తీసుకుంటారు. వెంటనే మీ మొబైల్‌కు ‘వెల్‌కమ్ టు జయదుర్గ పీఠం’ అనే మెసేజ్ వస్తుంది. తర్వాత మీకు 500మిల్లీ లీటర్ల ఒక మినరల్ వాటర్ బాటిల్ ఇస్తారు. దేవుళ్ళ దర్శనం చేసుకున్న తర్వాత మీకు ఒక టోకెన్ ఇస్తారు(ఉచితంగానే). దానిని తీసుకుని ఒక మూల ఉన్న వెండింగ్ మిషన్‌వద్దకు వెళ్ళి దానిలో వేస్తే మీకు చక్కగా ప్యాక్ చేసి ఉన్న ప్రసాదం లభిస్తుంది. ప్రసాదంలో ఒక్కోరోజు ఒక్కోరకమైన ఆహార పదార్థాలను అందిస్తారు. అన్నీ ప్యాక్‌డ్ ఫుడ్స్ కావటమే ఇక్కడ ప్రత్యేకత. ఈ ప్రసాదాలలో మామూలు రోజులలో సాంబార్ రైస్, కర్డ్ రైస్, రోటీ-పప్పు వంటివాటిని, శని-ఆదివారాలలో బర్గర్, శాండ్ విచ్, పేస్ట్రీ, బ్రౌనీ(ఎగ్ లెస్), వెజిటబుల్ కట్లెట్, సలాడ్ వంటి ఆధునిక పదార్థాలను అందిస్తున్నారు. ఈ ప్రసాదాలు అన్నింటిపైన తయారీ తేదీ, ఎక్స్‌పైరీ తేదీ ఉండటం విశేషం. పైగా ఆహార ఉత్పత్తులను సర్టిఫై చేసే కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టేండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’(fssai) వారి సర్టిఫికెట్ కూడా ఆ ప్రసాదాలపై ఉంటుంది. డయాబెటిస్ వ్యాధి ఉన్నవారికి ప్రత్యేకంగా చక్కెరలేని ప్రసాదం అందిస్తున్నారు. ప్రసాదాలన్నింటినీ మినరల్ వాటర్‌తోనే తయారు చేస్తామని నిర్వాహకులు చెబుతున్నారు.
ఎన్నో ఆలయాలలో చేతులతో ప్రసాదాన్ని పెడుతుండటం తాను గమనించానని, అది అనారోగ్యాలకు దారితీసే విధానం కావటంతో భక్తులకు పరిశుభ్రమైన, స్వచ్ఛమైన ప్రసాదాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో తాను ఈ పద్ధతిని ప్రారంభించాననని డాక్టర్ శ్రీధర్ చెప్పారు. మొదట్లో సాంబార్ రైస్, కర్డ్ రైస్ వంటి పదార్థాలను ప్యాక్ చేసి ఇచ్చామని, తర్వాత తర్వాత పిల్లలను, విద్యార్థులను గుడికి రప్పించటంకోసం ఈ బర్గర్, పేస్ట్రీ వంటి వాటిని ప్రవేశపెట్టామని తెలిపారు. ఈ విధానంపై అనేక దేవాలయాలు, మతపెద్దలు మొదట అభ్యంతరం తెలిపారని, ఇది సంప్రదాయ విధానాలకు వ్యతిరేకమని ఆక్షేపించారని చెప్పారు. వారిని తాను పట్టించుకోలేదని, విమర్శలు క్రమక్రమంగా చల్లారిపోయాయని తెలిపారు.
ఈ దేవాలయంలో ఎక్కడా హుండీ లేకపోవటం మరో విశేషం. పూజారులు కూడా అర్చనలు చేయటానికి డబ్బు తీసుకోరు. దేవుడి దయవలన తమకు నిధుల కొరత లేదని, దాతలు ఈ కార్యక్రమాలన్నిటికీ నిధులు సమకూరుస్తున్నారని శ్రీధర్ చెప్పారు. ఆలయంలోపల కర్పూరాన్ని, ప్లాస్టిక్‌ను వాడరు. హారతికి కూడా ఆవునెయ్యినే వాడతారు. అంగప్రదక్షిణం చేసే భక్తులు, దానికి ముందు తలస్నానం చేయగానే తలలు ఆరబెట్టుకోవటానికి హెయిర్ డ్రయ్యర్‌లను కూడా దేవాలయం యాజమాన్యం అందిస్తోంది. అన్నట్లు అంగప్రదక్షిణం చేసే భక్తులకు బీపీ చెక్ చేయటానికి ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఉంటారు. బీపీ నార్మల్‌గా ఉంటేనే అంగప్రదక్షిణకు అనుమతి ఇస్తారు. అంగప్రదక్షిణ పూర్తి చేసిన భక్తులకు కాంటినెంటల్ బ్రేక్ ఫాస్ట్ వడ్డిస్తారు.
జయదుర్గపీఠంకు మొబైల్ యాప్ కూడా ఉంది. త్వరలో భక్తులకు బయోమెట్రిక్ ప్రసాదం వెండింగ్ మిషన్‌లను ప్రవేశపెట్టాలని నిర్వాహకులు యోచిస్తున్నారు. మొత్తంమీద సనాతనధర్మంలో ఈ అధునాతన పద్ధతులను మేళవిస్తున్న విధానం అచ్చెరువు కలిగిస్తుందనటంలో సందేహంలేదు. అన్నట్లు ఈ విషయం చంద్రబాబుగారికి తెలిసిందంటే ఏపీలోని గుడులన్నిటిలో ఈ పద్ధతులే పెట్టాలంటారేమో!