
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె… సలహాదారు ఇవాంక ట్రంప్ కి ఫలక్ నుమా ప్యాలెస్ అతిథ్యం ఇవ్వనుంది. హైదరాబాద్ వేదికగా నవరంబర్ 28న గ్లోబల్ ఎంట్రపెన్యూర్ షిప్ సమ్మిట్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇవాంక హైదరాబాద్ రానున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు భారత ప్రభుత్వం నగరంలోని ఫలక్ నుమా తాజ్ ప్యాలెస్ లో బస ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో దాదాపు 150 దేశాల నుంచి 3వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. నీతి ఆయోగ్, విదేశీ వ్యవహారాల మంత్రుత్వ శాఖ ఈ మేరకు కేటీఆర్ తో చర్చలు జరుపుతున్నారు.
హైదరాబాద్ వేదికగా తొలిసారి ఇలాంటి సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐటీ, మున్సిపల్ శాఖ, ఇండస్ట్రీస్, జీహెచ్ ఎంసీ తదితర శాఖల ఉన్నతాధికారులు కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
ఇప్పటి వరకు 60 దేశాలకు చెందిన 12వేల మంది ప్రతినిధుల నుంచి కన్ఫర్ మేషన్ వచ్చిందని.. దాదాపు 3వేల మందికి పైగా కార్యక్రమానికి హాజరౌతారని తాము భావిస్తున్నట్లు కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఓ అధికారి తెలిపారు. మూడు రోజులపాటు సాగే ఈ సదస్సులో..12 వర్క్ షాప్స్ నిర్వహిస్తారని చెప్పారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అతిథుల కోసం నగరంలోని ఫైవ్ స్టార్స్ హోటల్స్ లో బస ఏర్పాటు చేశారు.
ప్రధాని నరేంద్రమోదీ, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, కామర్స్ మినిష్టర్ నిర్మలా సీతారామన్ లు ఈ సందర్భంగా మహిళా వ్యాపారుల పురోగతిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
2010లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ సదస్సును మొదట వాషింగ్టన్ లో ప్రారంభించారు. భారత్ ఈ సదస్సును నిర్వహించడం ఇదే తొలిసారి.ఈ సదస్సు నిర్వహణ కోసం ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాలు కూడా పోటీ పడ్డాయి. కానీ హైదరాబాద్‌కున్న అనుకూలతల కారణంగా సదస్సు నిర్వహించే అవకాశం చివరికి హైదరాబాద్ కే దక్కింది. కేంద్రం సూచనల ప్రకారం మేరకు గ్లోబల్ ఎంట్రపెన్యూర్‌షిప్ సమ్మిట్ నిర్వహణ కోసం నీతి ఆయోగ్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. ఈ కార్యక్రమంలో హెచ్1బీ వీసాల అంశాన్ని భారత్ అమెరికా దృష్టికి తీసుకురానుంది.
సదస్సులో వర్క్ షాప్‌లను విస్తృత స్థాయిలో నిర్వహించనున్నారు. 2010లో జరిగిన తొలి సదస్సుకు వాషింగ్టన్ ఆతిథ్యం ఇవ్వగా.. తర్వాతి ఏళ్లలో ఇస్తాంబుల్, దుబాయ్, కౌలాలంపూర్, మర్రాకేష్, నైరోబీ, సిలికాన్ వ్యాలీల్లో వరుసగా ఈ సదస్సును నిర్వహించారు. స్టారప్ట్ ఇండియాలో భాగస్వామ్యం ఉన్న భారతీయ వ్యాపారవేత్తలు ఈ సదస్సులో పాల్గొననున్నారు. ఈ ఏడాది ముఖ్యంగా మహిళా వ్యాపారవేత్తల పురోగతిపై దృష్టి సారించనున్నారు.