ఆర్బిఐ, ప్రైవేటు బ్యాంకులపైనే అనుమానాలు

First Published Dec 13, 2016, 9:52 AM IST
Highlights

గడచిన 15 రోజులుగా పలువురు ప్రైవేటు, ఆర్బిఐ అధికారులే పట్టుబడుతుండటం గమనార్హం.

కరెన్సీ మార్పిడిలో ప్రైవేటు, రిజర్వ్ బ్యాంకు అధికారులే పట్టుబడుతుండటం ఆశ్చర్యంగా ఉంది. బడాబాబుల వద్ద కోట్ల కొద్దీ కొత్త కరెన్సీ బయటపడటంతో ఆర్బిఐ అధికారుల పాత్రపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది.

 

సామాన్యులకు రోజుకు రూ. 2 వేలు దొరకటమే గగనమవుతున్న నేపధ్యంలో కొంత మంది వద్ద కోట్ల కొద్దీ కొత్త కరెన్సీ దొరుకుతుండటం పట్ల పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా బెంగుళూరులోని ఆర్బిఐ శాఖలో పనిచేస్తున్న సీనియర్ స్పెషల్ అసిస్టెంట్ మిచెల్ పట్టుబడటంతో అనుమానాలు బలపడుతున్నాయి.

 

బ్యాంకు అధికారులు చెబుతున్న దాని ప్రకారం జాతీయ బ్యాంకుల వద్ద నుండి కుబేరులకు కొత్త కరెన్సీ లభించటం కష్టమే. ఎందుకంటే, ఆర్బిఐ నుండి వివిధ జాతీయ బ్యాంకులకు అందుతున్న నగదే చాలా కొద్ది మొత్తం. మళ్ళీ అక్కడి నుండి ఆయా బ్యాంకుల శాఖలకు అందుతున్న డబ్బు ఇంకా తక్కువే.

 

అయితే, అదే సమయంలో ప్రైవేటు బ్యాంకులకు మాత్రం ఆర్బిఐ పెద్ద ఎత్తున డబ్బును అందిస్తున్నది. కాబట్టి కుబేరులకు కోట్ల కొద్దీ కొత్త నోట్లు అందే అవకాశాలు రెండే. మొదటిది ప్రైవేటు బ్యాంకుల ద్వారా అందటం. లేదంటే నేరుగా ఆర్బిఐ నుండే అందటం.

 

పై రెండు మార్గాల్లోనూ కోట్ల కొద్దీ కొత్త నోట్లు అందుకుంటున్నారని వస్తున్న ఆరోపణలపై ఇపుడు కేంద్రప్రభుత్వం దృష్టి పెట్టటం గమనార్హం. ఈ నేపధ్యంలో గడచిన 15 రోజులుగా పలువురు ప్రైవేటు, ఆర్బిఐ అధికారులే పట్టుబడుతుండటం గమనార్హం.

 

అదేవిధంగా దాంతో నగదు మార్పిడిలో ఆర్బిఐ, ప్రైవేటు బ్యాంకుల పాత్రపై సామాన్యులు మండిపడుతున్నారు.

 

 

click me!