
రేపటి నుండి ఏమిటి ?దేశంలో ఎక్కడ చూసినా ఇపుడు ఇదే చర్చ. పెద్ద నోట్ల రద్దు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడి మాట్లాడుతూ, 50 రోజులు ఓపికపడితే తర్వాత ‘నవభారతం ఆవిష్కారమవుతుంద’ని ప్రకటించారు నవంబర్లో. కష్టమో నష్టమో నోట్ల రద్దు నిర్ణయం జరిగిపోయింది కాబట్టి ప్రజలంతా మోడిపై నమ్మకంతోనే ఇన్ని రోజులూ కష్టాలను సహించారు.
అయితే, మోడి చెప్పినట్లు 50 రోజులైపోయింది. ఎటువంటి అద్భుతం జరగలేదు. పైగా నవంబర్ 8న నోట్ల రద్దైనపుడు ఎలాంటి కష్టాలున్నయో ఆ తర్వాత రోజుల్లో మరింత పెరిగాయి. దేశంలోని ప్రజలంతా ఓ వైపు డబ్బుల కోసం క్యూలైన్లలో నిలబడి అల్లాడిపోతున్నారు.
వాస్తవం ఇలాగుంటే మోడి, అరుణ్ జైట్లీలేమో ప్రజలు పెద్ద నోట్ల రద్దును స్వాగతిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.
అదేంటంటే, దేశంలో ఎక్కడ కూడా అలజడి రేగలేదట. ఘర్షణలు జరగలేదంటున్నారు. తన నిర్ణయానికి ప్రజలందరూ మద్దతుత పలికినట్లు మోడి చెప్పుకుంటున్నారు. తన నిర్ణయానికి ప్రజల మద్దతుందని చెప్పుకుంటున్న మోడి అదే విషయాన్ని పార్లమెంట్ లో చెప్పటానికి మాత్రం సాహసించలేదు.
కరెన్సీ సంక్షోభానికి ప్రజలు అలవాటు పడిపోయి నేటితో 50 రోజులు పూర్తయింది. మరి రేపు (31వ తేదీ) ఏమి జరగబోతుందో అంటూ అందరూ ఆశక్తిగా చర్చించుకుంటున్నారు.
ఎందుకంటే, మోడి చెప్పిన గడువు డిసెంబర్ 30తో అయిపోయింది. అలాగే ఇంగ్లీషు సంవత్సరానికి ఆఖరి రోజూ వచ్చేసింది. కాబట్టి మోడి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారని ప్రచారం జరుగుతోంది. ప్రధాని ప్రసంగంతో ప్రజల కష్టాలు మరింత పెరుగుతాయో లేక ఉపశమనం లభిస్తుందో చూడాలి.