
పెద్ద నోట్ల రద్దుతో దేశ వ్యాపితంగా ప్రజా జీవితాన్ని ఛిన్నభిన్నం చేయడంతో పాటు బ్యాంకుల దగ్గిర, ఎటిఎం ల దగ్గిరా క్యూల్లో 70 మంది చనిపోయేందుకు కారణమయిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కేసు నమోదు చేయాలని చిత్తూరు జిల్లాలో పీలేరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
వైఎస్ ఆర్ సి విద్యార్థి విభాగం కార్యదర్శి సుంకర చక్రధర్, వెంకటేశ్,శివకుమార్, మోహన్, తరుణ్, అశోక్, చరణ్ తదిర నాయకులు ఈ ఫిర్యాదు చేశారు.
అయిదొందలు, వేయి నోట్ల రద్దు తర్వాత సామాన్య, మధ్య తరగతి ప్రజలు డబ్బుకోసం రోజూ గంటల తరబడి బ్యాంకులు,పోస్టాఫీసులు, ఎటిఎంల దగ్గిర క్యూలో నిలబడి, నిరీక్షిస్తూన్నారని వారు ఫిర్యాదు లో పేర్కొన్నారు.
ఇళ్లొదలి గృహిణులు, ఖాయిలాతో ఉన్నా వృద్ధులు కూడా ఈ క్యూలలో కనిపిస్తారని చెబుతూ క్యూలలో అలసిపోయి చాలా మంది అస్వస్థతకు లోనయితే,కొంతమంది మృత్యువాత పడ్డారని వారు పిర్యాదు లో పేర్కొన్నారు.
ప్రత్యమ్నాయ మార్గాలు చూపకుండా ఇలాంటి చర్యలు తీసుకుని ప్రజల ఇబ్బందులకు, పలువురి మృతికి ప్రధాని నరేంద్రమోడీ కారకుడయ్యాడని, అందువల్ల ఆయన మీద కేసు నమోదు చేయాలని వారు ఫిర్యాదులో కోరారు.