
మోడి మోనార్కులా ప్రవర్తిస్తున్నారు. భవిష్యత్ పరిణామాలు ఏమాత్రం ఆలోచించకుండా నోట్లను రద్దు చేశారు. రద్దైన నోట్ల విషయంలో కూడా రోజుకో నిబంధన పెడుతున్నారు. తాజాగా బంగారం లెక్కలు చూపాల్సిందేనని చట్టం చేయటం లాంటివి చూస్తుంటే తానేమి చేసినా చెల్లుబాటవుతుందని అనుకుంటున్నట్లు కనబడుతోంది. దేశ ప్రజలను భయభ్రాంతులను గురిచేస్తున్నారు. మోడి పద్దతి చూస్తుంటే ‘తాంబూలాలిచ్చేసాను తన్నుకు చావండ’న్నట్లుగా ఉంది. చెలామణిలో ఉన్న పెద్ద నోట్లను రద్దు చేసేసి ఆ తర్వాత పరిణామాలను ఎదుర్కొవటం తన పని కాదన్నట్లుగా మోడి వ్యవహరిస్తున్నారు. ఎప్పుడైతే నోట్ల రద్దు ప్రకటన వెలువడిందో అప్పటి నుండే దేశ ఆర్ధిక వ్యవస్ధ మొత్తం కుదేలైంది.
పెద్ద నోట్ల రద్దు, తదనంతర పరిణామాలతో యావత్ దేశం అట్టుడికిపోతుంటే ఏమి పట్టనట్లుగా మోడి మాత్రం జపాన్ చెక్కేసారు. దేశంలోని ప్రతీ రంగమూ దాదాపు దెబ్బతిన్నాయి. అయినా సరే మోడి మాత్రం తనకేమి పట్టనట్లుగా ఉన్నారు.
పైగా నోట్ల రద్దు తర్వాత ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాల్లో ఏరోజు ప్రధాని సమావేశాల్లో పాల్గొనలేదు. దాంతో మోడికి పార్లమెంట్ అంటే ఏపాటి గౌరవం ఉందో అర్ధమవుతోంది. ప్రతిపక్షాలంటే లెక్కలేదు, పార్లమెంట్ అన్నా గౌరవం లేని ప్రధాని బహుశా మోడియేనేమో. యూపిఏ హయాంలో ఎన్నో కుంభకోణాలు వెలుగు చూసినపుడు కూడా అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఏనాడు పార్లమెంట్ సమావేశాలకు డుమ్మా కొట్టలేదు.
నోట్ల రద్దుపై పార్లమెంట్ ఉభయ సభల్లోనూ గడచిన 15 రోజులుగా ప్రతీ రోజు రచ్చ జరుగుతూనే ఉన్నది. ప్రతిపక్షాలన్నీ ఏకమై మోడి పార్లమెంట్ కు వచ్చి ప్రకటన చేయాలని పట్టుపడుతున్నా ఖాతరు చేయటం లేదు. పైగా ప్రతిపక్షాలకు సమాధానం చెప్పే బాధ్యత అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడులకు అప్పగించినట్లు కనబడుతోంది. విపక్షాలకు సమాధానాలు చెప్పలేక వారు నానా అవస్తులు పడుతున్నారు.
అదే సమయంలో నోట్ల రద్దు తర్వాత దేశంలో ఏర్పడిన సమస్యలకు పరిష్కారాలు చూపేందుకు ఓ కమిటిని వేసారు. అంటే అటు పార్లమెంట్ లో సమాధానాలు చెప్పే బాధ్యత మంత్రులకు అప్పగించి, ఇటు సమస్యల పరిష్కారాల కోసం ఇంకో కమిటి వేసారన్న మాట. మరి మోడి ఏమి చేస్తారు? దేశ, విదేశాలు తిరుగుతూ ప్రతిపక్షాలను రెచ్చగొడుతుంటారు. సమస్య తలెత్తినపుడు దాన్ని ఎదుర్కొనకుండా పలాయన వాదాన్ని పఠిస్తున్న ప్రధానమంత్రిని దేశప్రజలు గతంలో ఎన్నడూ చూసి ఉండరేమో.