
ప్రపంచ రికార్డు సృష్టించేందుకు శ్రీహరికోట సిద్ధమవుతూ ఉంది.
ఇంతవరకు ప్రపంచంలో ఎపుడూ ఏ దేశమూ చేయని ప్రయోగం ఫిబ్రవరి 8 న ఇక్కడి సతీశ్ ధావన్ స్పేస్ (షార్) సెంటర్లో జరగుతూ ఉంది.
ఒక్క ఉదుటున పిఎస్ ఎల్ వి- సి 37 వివిధ దేశాలకు చెందిన 103 ఉపగ్ర హాలను ప్రయోగించనుంది.
నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌కు బుధవారం తెల్లవారుజామున విదేశాలకు చెందిన 100 ఉపగ్రహాలు వచ్చాయి. అమెరికా, ఇజ్రాయెల్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్, కజకిస్థాన్‌లకు చెందిన వంద ఉపగ్రహాలు చెన్నై విమానాశ్రయానికి నాలుగు రోజుల కిందట చేరాయి. ఒక్కో పెట్టెలో 4 చొప్పున 25 పెట్టెల్లో ఉన్న వీటిని కట్టుదిట్టమయిన భద్రత నడుమ ప్రత్యేక వాహనంలో శ్రీహరికోటకు తీసుకొచ్చారు.
వివిధ పరీక్షల అనంతరం పీఎస్‌ఎల్‌వీ-సి37 ప్రయోగనౌకలో అమర్చుతారు. ఈ రాకెట్ ప్రయోగం ఫిబ్రవరి 8వ తేదీ ఉదయం 8.39 గంటలకు చేసేలా ఇస్రో శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. పీఎస్‌ఎల్‌వీ-సి37 మొత్తం 103 ఉపగ్రహాలను వాటి వాటి కక్షలలో ప్రవేశపెడుతుంది. మిగతా మూడు భారత్ కు చెందినవి.
నిజానికి మొదట అనుకున్నది 80 విదేశీ ఉపగ్రహాలను, మూడు భారత్ ఉపగ్రహాలను జనవరి చివరి వారంలో ప్రయోగించాలనినిర్ణయించారు. అయితే, మరొక 20 ఉపగ్రహాలకు కాంట్రాక్టు రావడంతో వీటి సంఖ్య వందకు పెరిగింది. ఫలితంతా లాంచింగ్ ను ఫిబ్రవరి కి వాయిదావేయాల్సి వచ్చింది.
ఇవన్నీ కూడా మైక్రో(చిన్నచిన్న) ఉపగ్రహాలు. వాటి పేలోడ్ 1350 కేజీలే. ఇందులో ఉపగ్రహాల బరువు 500 నుంచి 600 కేజీలుంటుంది.
ఒకే ప్రయోగంలో ఇన్ని ఉపగ్రహాలను ప్రపంచంలో ఎపుడూ ప్రయోగించక పోవడం వల్ల అంతరిక్ష చరిత్రలో ఇదొక రికార్డు కాబోతున్నది.
గత ఏడాది ఇస్రో ఒకే దఫా 20 ఉపగ్రహాలను ప్రయోగించింది. అయితే, ఇంతవరకు రికార్డు రష్యాదే. 2014లో రష్యా ఒకే మిషన్ లో 37 ఉపగ్రహాలు ప్రయోగించింది. 29 ఉపగ్రహాలతో అమెరికా నాసా రెండో రికార్డు నెలకల్పింది. ఇండియా ఇపుడు వాటిని అధిగమించి 100 ఉపగ్రహాలతో కొత్త రికార్డు సృష్టిస్తున్నది.