
ఉత్తరప్రదేశ్ బిజెపి ఎమ్మెల్యే సంగీత్ సోమ్ చరిత్రకు కొత్త అర్థం చెబుతున్నారు.అసలు తాజ్ మహల్ అనేది చరిత్రలో భాగమే కాదంటున్నారు. ప్రపంచ ఏడు వింతల్లో ఒకటైన తాజ్ మహల్.. దేశానికి మాయని మచ్చ అంటూ సోమ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తాజ్ మహల్ ని, దానిని కట్టినోడిన్ని చరిత్రలో నుంచి తీసేయాలని అన్నారు.
తాజ్ మహల్ కట్టించిన వ్యక్తి సొంత తండ్రినే జైలులో పెట్టించిన ఘనుడని సోమ్ కొత్త విషయం చెప్పారు. మీరట్ సమీపంలోని సిసోలి గ్రామంలో 8 శతాబ్దం నాటి రాజు అనంగ్ పాల్ తోమార్ విగ్రహావిష్కరణతర్వాత ప్రసంగిస్తూ ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అసలేం జరిగిందంటే.. యూపీలో భాజపా ఆరు నెలల పాలన ముగిసిన సందర్భంగా ఇటీవల ఉత్తర ప్రదేశ్ పర్యాటక శాఖ ఓ బుక్‌లెట్ విడుదల చేసింది. అయితే ఈ బుక్ లెట్ లో అచ్చేసిన రాష్ట్ర పర్యాటక ప్రదేశాల జాబితాలో తాజ్‌మహల్ పేరు ఎత్తేశారు. దీనితో చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సంగీత్ సోమ్ ఈ విధంగా స్పందించారు. ‘తాజ్ మహల్ ని జాబితాలో చేర్చలేదని చాలా మంది విమర్శిస్తున్నారు.. అసలు తాజ్ మహల్ ది ఒక చరిత్రేనా? హిందువులను యూపీ నుంచి తరిమికొట్టాలనుకున్న వ్యక్తి, సొంత తండ్రినే జైలులోకి తోసేసిన వ్యక్తి కట్టించిన తాజ్ మహల్ ఒక చరిత్రేనా?’ అంటూ ప్రశ్నించారు, విచిత్రంగా.
నిజానికి, మనకు తెలిసిన చరిత్ర ప్రకారం, కొడుకు ఔరంగజేబే ఆయనను జైలులో పెట్టించాడు.
ఇంకా రెండడుగులు ముందుకేసి, సోమ్ ఏంటున్నాడో తెలుసా...బాబార్ అక్బర్,ఔరంగజేబులు దేశ ద్రోహులుఅన్నాడు. చరిత్ర నుంచి వాళ్ల పేర్లను తీసేస్తామని కూడా చెప్పారు.
గొప్ప గొప్ప హిందూ రాజులు చాలా మంది ఉన్నారని.. వారి జీవిత కథలను తమ బీజేపీ ప్రభుత్వం పుస్తకాల్లో చేరుస్తుందని చెబుతూ మహారాణా ప్రతాప్, శివాజీ వంటి రాజుల గురించి పాఠ్యాంశాల్లో చేర్చాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ఎమ్మెల్యే సోము.. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలో దాద్రి ఘటనమీద, ముజఫర్ నగర్ అల్లర్ల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కారు.