అసెంబ్లీకి తుపాకీ తెచ్చిన ఎమ్మెల్యే

First Published Mar 6, 2018, 4:10 PM IST
Highlights
  • తుపాకీతో అసెంబ్లీలోకి వచ్చిన ఎమ్మెల్యే
  • మీడియా కెమేరా కన్నుకి చిక్కిన తుపాకీ

అసెంబ్లీ సమావేశాలకు ఓ ఎమ్మెల్యే ఏకంగా తుపాకీ తీసుకొని వచ్చాడు. మూడంచెల సెక్యురిటి కళ్లు కప్పి ఆయన అసెంబ్లీలోనికి గన్ తీసుకువచ్చిన  సంఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. సదూల్ పూర్ ఎమ్మెల్యే, బీఎస్పీ నేత మనోజ్ కుమార్ సోమవారం  అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఆయన కుర్తా జేబులో ఓ రివాల్వర్‌ తీసుకొచ్చారు. అసెంబ్లీలో మూడంచెల భద్రతా వ్యవస్థ ఉన్నప్పటికీ.. వాటిని దాటుకుంటూ సమావేశ మందిరానికి చేరుకోగలిగారు. సమావేశాల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడేందుకు వచ్చిన సమయంలో ఆయన వద్ద ఉన్న గన్ కెమేరా కంట పడింది. దీంతో వివాదాస్పదంగా మారడంతో.. వెంటనే ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి గన్ ని  ఇంట్లో పెట్టి మళ్లీ అసెంబ్లీకి వచ్చారు.

కాగా ఈ ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే ఘన్‌శ్యామ్‌  స్పందించారు.అసెంబ్లీలో ఓ ప్రజాప్రతినిధే భద్రతా ప్రమాణాలను ఉల్లంఘించడం బాధాకరమన్నారు. ఇదిలా ఉండగా.. మనోజ్ కుమార్ మాత్రం తాను చేసిన పనిని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ‘నాపై చాలా సార్లు దాడులు జరిగాయి. అందుకే లైసెన్స్‌డ్‌ రివాల్వర్‌ను ఎప్పుడూ నా వద్దే ఉంచుకుంటా. అయితే అసెంబ్లీ సమావేశాలకు వచ్చే ముందు ఆ విషయాన్ని గమనించలేదు. తుపాకీ నా వద్ద ఉందని తెలియగానే వెంటనే ఇంటికి వెళ్లి దాన్ని అక్కడ పెట్టి తిరిగి అసెంబ్లీకి వచ్చాను’ అని వివరించారు.

 

 

click me!