ప్రజా తెలంగాణ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్

First Published Nov 23, 2017, 4:26 PM IST
Highlights
  1. తెలంగాణ ఉద్యమంలో అమరులైన 1250 మంది వీరులలో కుటుంబాలలో కొందరిని మాత్రమే ప్రభుత్వం ఆదుకున్నది, మిగితా కుటుంబాలను కుడా తక్షణం ఆదుకోవాలి.
  2. ఉద్యమకారులకు, కళాకారులకు ప్రభుత్వం జీవితకాల గౌరవ వేతనం ఇవ్వాలి.
  3. ఉద్యమ అమర వీరుల త్యాగాల గుర్తుగా హైదరాబాద్ గడ్డమీద స్మృతివనం తక్షణమే నిర్మించాలి. 

తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం ప్రజలు చేసిన త్యాగాలు ఎంతో గొప్పవి. చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలు దాదాపు ఏడు దశాబ్దాలుగా పోరాటాలు చేస్తూనే ఉన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, బానిసత్వం నుండి విముక్తి కోసం జరిగిన సాయుధ, ప్రజాస్వామ్య పోరాటాల చరిత్ర తెలంగాణది. అటువంటి  స్వభావాన్ని తమ ముందుతరాల నుండి అలవరుచుకొని, గొప్ప విద్యార్థి ఉద్యమాలను నిర్మించిన చరిత్ర నాలుగు దశాబ్దాల తెలంగాణ విద్యార్థి, ఉద్యమకారులది.

నీళ్ళు-నిధులు-నియామకాలు అనే ప్రాతిపదికన, “మా ఉద్యోగాలు మాగ్గావాలె” అనే నినాదంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు విద్యార్థిలోకం అసామాన్య పోరాటాలు, త్యాగాలు చేసి స్వరాష్ట్రం సాధించుకున్నా, నేడు ఇంతకుమునుపు లేనంతగా దగాకు గురవుతున్నారు. ఇవాళ స్వరాష్ట్రంలో ఉద్యమకారులకు, నిరుద్యోగులకు జరుగుతున్న నిర్లక్ష్యం, అవమానాలు కేవలం రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ పోకడ, తెలంగాణ అమరుల ఆశయాల పట్ల ముఖ్యమంత్రి చిన్నచూపు వల్లనే అనేది తెలుస్తున్నది. పూటకు ఒక మాట చెప్తూ, విద్యార్థులను నిరాశానిస్పృహలలో ముంచారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా ఎన్నో ప్రయత్నాలు చేసిన ద్రోహుల్ని మంత్రులను చేసిన ఈ ప్రభుత్వం తెలంగాణ కోసం కొట్లాడిన ముద్దు బిడ్డలను మాత్రం గాలికి ఒదిలేసింది.

గత 30 నెలలుగా ప్రజా తెలంగాణ దాదాపు లక్ష మందికి పైగా ఉద్యమకారులను, కళాకారులను, విద్యార్థులను, నిరుద్యోగులను ప్రత్యక్షంగా కలిసి, వారి వివరాలు సేకరించింది. రాష్ట్ర సాధన ఉద్యమంలో వాళ్ళు చేసిన త్యాగాలను ఆధారాలతో సహా సేకరించి, వారి త్యాగాలకు గుర్తుగా తెలంగాణ రాష్ట్ర సాధన సమరయోధులు పేరుతో గుర్తింపు పత్రాన్ని అందచేసినాము.  ఉద్యమ ఆకాంక్షలను, అమరుల ఆశయాలను సాధించే దిశగా మరో ఉద్యమానికి సిద్దం చేసే ప్రయత్నంలో భాగంగా ఉద్యమ, సామాజిక , ప్రజాస్వామ్య శక్తులతో కలుస్తూ, నేర్చుకుంటూ, వారి డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి, మంత్రుల దృష్టికి తీసుకువెళ్ళి, శాసనసభ, మండలిలో కూడా వాళ్ళ గొంతును వినిపించింది ప్రజా తెలంగాణ. ఎన్ని చేసినా, ఎంత చేసినా ముఖ్యమంత్రికి ఉద్యమకారుల పట్ల ఎంతటి నిర్లక్ష్య వైఖరి ఉన్నదో పదేపదే స్పష్టమయింది. ఇగ ప్రభుత్వం ఉద్యమకారులను, నిరుద్యోగులను విస్మరించడమే కాకుండా తప్పుడు ప్రకటనలు, తప్పుడు లెక్కలు చెప్తూ, ఉద్యమాన్ని అవమానించిన వాళ్ళతోనే నేడు ఉద్యమకారులను తిట్టిపిస్తున్నారు, బద్నాం చేయ ప్రయత్నం చేస్తున్నరు.

రౌండ్ టేబుల్ : శనివారం 25 నవంబర్ 
సోమాజిగూడ ప్రెస్ క్లబ్
మధ్యాహ్నం 3 గంటల నుండి


అయితే... యావత్తు తెలంగాణ ప్రజానీకం, తెలంగాణ ఉద్యమకారులు, నిరుద్యోగులు ఇంకా ఓపిక తోని ఉన్నారు. ఆవేదనను అపుడపుడూ తెలియజేస్తూ ఉన్నారు. అధికార పార్టీలో ఉన్న ఉద్యమకారులే ఎన్నోసార్లు మీడియా ముందు తమ గోసను చెప్పుకున్నారు. రాష్ట్రం కోసం బలిదానాలు గావించిన సుమారు 1250 (జూన్ 15, 2014 అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటన ప్రకారమే) మంది ఉద్యమకారుల త్యాగాన్ని, నేడు వారి కుటుంబాలకూ, వారు ఎంతో ప్రేమించిన తెలంగాణ సమాజానికి జరుగుతున్న నష్టం గురించి మనం స్పందించవలసి ఉన్నది.

ఇది కేవలం ఏ ఒక్కరి సమస్యగానో, ఒక పార్టీ సమస్యగానో లేక రాజకీయ సమస్య గా ప్రజా తెలంగాణ చూడడం లేదుఎందుకంటే... ఈ మోసపూరిత నిర్లక్ష్యపు విధానంతో, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను తక్కువ చేసి చూపిస్తున్నరు, అమరులను ఆశయాలను అవమాన పరుస్తున్నరు. వాటిని గౌరవించాల్సిన బాధ్యత, నెరవేర్చాల్సిన కర్తవ్యం తెలంగాణ ప్రజలందరి మీద ఉన్నది... అటువంటి గొప్ప లక్ష్య సాధనలో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటి పోరాటం చేస్తున్నది. దాంట్లో భాగంగా నిర్వహించ తలపెట్టిన “కొలువులకై కొట్లాట” సభకు అత్యంత గొప్ప లక్ష్యం ఉన్నది, అది కేవలం నిరుద్యోగ సమస్య, ప్రభుత్వ రంగ ఖాళీలు, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కోసం మాత్రమే కాకుండా, తెలంగాణ రాష్ట్ర సామాజిక చైతన్యాన్ని ఒక కొత్త రాజకీయ ఒరవడికి నాంది పలికేదిగా ఉండాలని ఆకాంక్షిస్తూ. . . కేవలం విద్యార్థి, ఉద్యమకారులు, నిరుద్యోగులే కాకుండా, తెలంగాణలో రాజకీయాలను ప్రజస్వామీకరించాలని కోరుకునే అన్ని వర్గాల ప్రజలు దీనిని జయప్రదం చేయాలని కోరుతున్నాము. ఈ ఉద్యమానికి ప్రజా తెలంగాణ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నది. అలాగే గత రెండున్నరేళ్లుగా ఉద్యమకారుల, కళాకారుల పక్షాన పోరాడుతున్న క్రమంలో మా దృష్టికి వచ్చిన, ప్రభుత్వం విస్మరిస్తున్న ఈ కింది డిమాండ్లను ఖచ్చితంగా సాధిస్తామని, దానికి మీ అందరి మద్దతును కోరుతున్నాము.

తెలంగాణ రాష్ట్రసాధన త్యాగధనులు, ఉద్యమకారులు, కళాకారుల కోసం ప్రజా తెలంగాణ డిమాండ్స్:

  1. ముఖ్యమంత్రి జూన్ 15, 2014 నాడు శాసనసభలో ప్రకటించినట్లుగా అఖిలపక్షం ఏర్పాటు చేసి అన్ని దశల తెలంగాణ ఉద్యమకారులకు సంపూర్ణ, సత్వర న్యాయం చేయాలి.
  2. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలకు న్యాయం చేయాలి.
  3. నుండి 2014 వరకు తెలంగాణ కోసం కోట్లాడి అనన్య త్యాగాలు చేసినటువంటి ఉద్యమకారులపై ఉన్న అన్ని రకాల కేసులను తక్షణం ఎత్తి వేయాలి, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న కేసులను ఎత్తివేయడానికి అసెంబ్లీ తీర్మానం చేయాలి.
  4. తెలంగాణ ఉద్యమంలో అమరులైన 1250 మంది వీరులలో కుటుంబాలలో కొందరిని మాత్రమే ప్రభుత్వం ఆదుకున్నది, మిగితా కుటుంబాలను కుడా తక్షణం ఆదుకోవాలి.
  5. ఉద్యమకారులకు, కళాకారులకు ప్రభుత్వం జీవితకాల గౌరవ వేతనం ఇవ్వాలి.
  6. ఉద్యమ అమర వీరుల త్యాగాల గుర్తుగా హైదరాబాద్ గడ్డమీద స్మృతివనం తక్షణమే నిర్మించాలి. 

 

 

(Srisail Reddy Panjugula, Co-Convener, Praja Telangana, Tel: 9030997371)

click me!