
వెంకయ్యనాయుడు పబ్లిక్ పాలిటిక్స్ నుంచి వైదొలగాడో లేదో కేంద్ర బిజెపి తెలుగు రాష్ట్రాల వ్యూహం మార్చింది. కేంద్ర పార్టీ నుంచి తెలుగు రాష్ట్రాలోని బిజెపి నాయకులకు, అంతా అనుకున్నట్లుగానే, స్పష్టమయిన పిలుపు వచ్చింది. సందర్భాన్నిబట్టి ఇతర పార్టీలతో కొన్ని విషయాలలో సహకారం తీసుకున్నంత మాత్రాన ‘పోనీలే మిత్ర పక్షం’ అనే సర్దుబాటు ధోరణి పనికి రాదనేది ఈ పిలుపు. రాష్ట్రాలలో బిజెపి అధికారం లోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర కమిటీలు పనిచేయాలంటూ బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ఈ పిలుపునిచ్చారు. అంటే, ఆంధ్రలో తెలుగుదేశం పార్టీ మిత్ర పక్షమని, తెలంగాణలో తెలంగాణా రాష్ట్రసమితి రాష్ట్ర పతి ఎన్నికల్లో సహకరించిందని ఉపేక్షించనవసరం లేదని ఆయన చెప్పారు. ఆదివారం వరంగల్ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశాల ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాంమాధవ్ తెలంగాణా బిజెపి ఎలా ముందుకు సాగాలో చెప్పారు.
తెలుగు రాష్ట్రాలలో ఎలా వ్యవహరించాలనేదాని మీద వెంకయ్యానాయుడికి ధోరణికి, రామ్ మాధవ్ ధోరిణికి పోసగేది కాదు. వీరిద్దరి సైద్ధాంతిక పోరాటం కొనసాగుతూ వచ్చింది. వెంకయ్య మాటే నెగ్గుతూ వచ్చింది. ఇపుడు ఉపరాష్ట్రపతి పదవి పేరుతో ఆయన ఢిల్లీ వెళ్లగానే రామ్ మాధవ్ పార్టీ లైౌన్ అమలుచేయడం మొదలుపెడుతున్నారు.
ఇలాంటి పిలుపుకోసమే ఆంధ్రాబిజెపి నాయకులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. పురందేశ్వరి, కన్నా లక్ష్మినారాయణ, సోమూ వీర్రాజు, కావూరిసాంబశివరావు ,రాయలసీమకు చెందిన పలువురు నాయకులు అధికారం లో ఉన్న తెలుగుదేశం పార్టీ తీరును విమర్శించేందుకు, దానికి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించేందుకు పూనుకున్నపుడు వెంకయ్యనాయుడు ఉన్న రోజులలో మిత్రపక్షం పేరుతో వాళ్లకి ముకుతాడు వేశారు. ఇపుడు ఎలాంటి జంకుగొంకు అవసరంలేదని రామ్ మాధవ్ చెప్పడం విశేషం. రామ్ మాధవ్ ఇంకా ఎమన్నాడో చూడండి:
*వచ్చే ఎన్నికల్లోతెలంగాణా తో పాటు ఇతర రాష్ట్రాలలో కచ్చతంగా అధికారంలోకి రావాలనేది బిజెపి జాతీయ నాయకత్వ లక్ష్యం. దీనికోసం రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌పై రాజకీయంగా యుద్ధానికి సిద్ధం కావాలి.
*అవినీతిరహిత నవభారత నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పూనుకుంది. మోదీకి దేశంలోని 60శాతం రాష్ట్రాలు మద్దతుగా నిలిచాయి.
*దేశంలోని ఏ రాష్రాన్నీ వదలిపెట్టం. కాస్త ముందు, వెనక అన్ని రాష్ట్రాల్లో బిజెపి అధికారంలోకి వస్తుంది.
*రాజకీయాల్లో సెంటిమెంట్లు ఉండకూడదు. కొన్ని సార్లు కొన్ని పార్టీల సహాయసహకారాలు తీసుకున్నంత మాత్రాన పోనీలే.. అనే సర్దుబాటు ధోరణి ఉండకూడదు.
*తెలంగాణలో అప్పట్లో జనసంఘ్‌కు, ఇప్పుడు బిజెపికి మంచిపట్టు ఉంది. అంకితభావంతో పనిచేసే నాయకులు, కార్యకర్తులు ఉన్నారు.
*70ఏళ్ల తరువాత ఒక నాయకుడు మతపరంగా రిజర్వేషన్లు ఇస్తామంటున్నారని ముఖ్యమంత్రి కెసిఆర్‌ను పరోక్షంగా విమర్శించారు.
*1984లో దేశంలో ఎక్కడా కూడా బిజెపికి అనుకూల పరిస్థితులు లేనపుడుతెలంగాణలో పార్టీ విజయం సాధించిన విషయం గుర్తుంచుకోవాలి.