
అమరావతి నిర్మాణంనిలిపివేయాలని, రాజధాని నగరం నిర్మాణం ఎలాంటి పర్యావరణ అనుమతులు లేకుండా చేపడుతున్నారని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో సత్యనారాయణ పిటిషన్ వేశారు. ఇదేవిషయంలో రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఇఎఎస్ శర్మ కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పోరాడుతున్నారు.
దీని మీద విచారణ పూర్తయింది. తొందర్లోనే తమకు అనుకూలంగా ట్రిబ్యునల్ తీర్పు వస్తుందని ఆయన ఆశిస్తున్నారు.
శనివారంనాడు విశాఖ పట్టణంలో విలేకరులతో మాట్లాడుతూ పర్యావరణ నిబంధనలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి పూనుకుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం అమరావతి నిర్మిస్తున్న ప్రాంతం భవన నిర్మాణాలకు అనుకూలంగా లేదన్న విషయాన్ని సాక్ష్యాధారాలతో కోర్టు ముందుంచామని ఆయన చెప్పారు.
త్వరలో తమకు అనుకూలంగా కోర్టు తీర్పు రావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.
వరద ముప్పు పొంచివుందనే కారణంతో ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురు రవిశంకర్ కు 25 ఎకరాలలో ఒక తాత్కాలిక కార్యక్రమం ఏర్పాటుచేసేందుకే గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి ఇవ్వలేదని, అలాంటపుడు 10 వేల ఎకరాలకు పైగా వరద ముప్పులో ఉన్నపుడు రాజధాని ప్రాంతం నిర్మించేందుకు అనుమతి మంజూరు చేయదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇపుడురాజధాని నిర్మాణం తలపెట్టిన ప్రాంతంలో 2009లోవరదలొచ్చి ఎంత భీభత్సం సృష్టించాయో అందరికి తెలుసని ఆయన అన్నారు.
ఇసుక తిన్నెలు, వరద ప్రాంతాలలో ఎలాంటి అనుమతులు లేకుండా రాజధినిర్మాణం సాగిస్తే, అంతిమంగా నష్టపోయేది ప్రజలేనని చెబుతూ, దీనికి వ్యతిరేకంగా ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేతో కలసి తాము ఉద్యమం చేస్తామని కూడ ఆయన వెల్లడించారు.