
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర బుధవారం మూడో రోజుకి చేరుకుంది. ఆయన పాదయాత్రకు ఊహించిన దానికంటే.. ప్రజల నుంచి స్పందన ఎక్కువగానే వస్తోంది. యువత ఆయనకు పూర్తి మద్దతు ఇస్తున్నారు. ఈ పాదయాత్రలో ముఖ్యంగా రెండు కోణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి.. జగన్ కి తమ కష్టాలు చెప్పుకునేవాళ్లు, రెండోది.. ఆయనతో సెల్ఫీదిగడానికి ఉత్సాహం చూపేవాళ్లు.
మొదటి కోణంలో.. పాదయాత్రలో భాగంగా ఆయన నిర్వహిస్తున్న బహిరంగ సభలకు జనాలు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. అక్కడికి వచ్చిన వారంతా తమ కష్టాలను జగన్ కి చెప్పుకుంటున్నారు. తనదైన రీతిలో.. వారి కష్టాలను తీర్చేందుకు సహాయం చేస్తానని జగన్ హామీలు ఇస్తున్నారు.అంతేకాకుండా.. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను, పనితీరును జగన్ ఎండగడుతున్నారు.
ఇక రెండో కోణం విషయానికి వస్తే జగన్ పాదయాత్రలో.. సెల్ఫీల సందడి బాగా కనపడుతోంది. ఆయనతో సెల్ఫీ దిగేందుకు ప్రజలు పోటీ పడుతున్నారు. ఇప్పటికే వేల మంది ఆయనతో సెల్ఫీ దిగారు. ఇంకొందరు జగన్ చేతికి వాళ్ల ఫోన్ ఇచ్చి మరీ .. ఆయనతో సెల్ఫీ దిగుతున్నారు.
వారిని మరింత ఉత్సాహపరిచేందుకు జగన్ కూడా.. అభిమానుల వద్ద నుంచి ఫోన్ తీసుకొని మరీ సెల్ఫీలు తీసుకుంటున్నారు. అభిమాన నేత వారితో సెల్ఫీలు దిగడంతో వారంతా ఉబ్బితబ్బిబ్బు అయిపోతున్నారు.