
టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ విరుచుకుపడ్డారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కారణంగా యనమల, పరిటాల సునీత, పయ్యావుల కేశవ్ లబ్ధి పొందారంటూ ఇటీవల రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం లేపిన సంగతి తెలిసిందే. రేవంత్ చేసిన వ్యాఖ్యలపై చాలా రోజుల తర్వాత పయ్యావుల స్పందించారు.
ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రేవంత్ పై ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తనను బాధపెట్టాయని ఆయన అన్నారు. రేవంత్ వ్యాఖ్యలపై స్పందించకపోతే... ప్రజల్లో తనపై తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని.. అందుకే ఇప్పుడు మాట్లాడుతున్నానని పయ్యావుల చెప్పారు. 25ఏళ్లుగా పార్టీ ఎజెండానే.. తన ఎజెండాగా పనిచేశానన్నారు. పార్టీకి నష్టం కలిగించే పని తానెప్పుడూ చేయనని చెప్పారు. రేవంత్ మాత్రం.. ఎప్పుడూ వ్యక్తిగత ఎజెండా కోసమే పనిచేసే వ్యక్తి అని.. అలాంటి రేవంత్ తనకు, యనమలకు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అసరం లేదన్నారు.
రేవంత్ ఓటుకు-నోటు కేసులో అరెస్టు అయినప్పుడు మొదట స్పందించింది తానేనని చెప్పారు. ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఉంటాయని అందుకే రేవంత్ బెయిల్ కోసం తాను తిరిగానని గుర్తు చేశారు. తనకు, పరిటాల సునీతకు ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవని తేల్చిచెప్పారు. తాను తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి కాంట్రాక్టులు పొందలేదని స్పష్టం చేశారు. ఇదంతా కావాలని రాజకీయంగా తప్పుపట్టించేందుకు చేస్తున్న కుట్ర అని పయ్యావుల చెప్పారు. రేవంత్ కాంగ్రెస్ లో చేరిక ఊహాగానాలన్నీ తనకు తెలుసని.. కాకపోతే ఇప్పుడు వాటి గురించి మాట్లాడనని చెప్పారు. రేవంత్ ఢిల్లీ పర్యటన వివరాలన్నీ తన దగ్గర ఉన్నప్పటికీ.. తాను స్పందించలేదని చెప్పారు.
ఇదిలా ఉంటే.. అమెరికా పర్యటనలో ఉండటంతో ఈ విషయంపై యనమల స్పందించకపోగా.. ఇక్కడే ఉండి కూడా పరిటాల సునీత రేవంత్ వ్యాఖ్యలపై నోరు మెదపడం లేదు.