
నోట్ల రద్దు వ్యవహారంపై సినీనటుడు, జనసేన అధిపతి పవన కల్యాణ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారా? విశ్వసనీయ సమాచారం ప్రకరం అవుననే సమాధానం వినిపిస్తోంది. నోట్ల రద్దైన 22 రోజుల తర్వాత కూడా ప్రజల సమస్యలు రోజురోజుకు పెరుగుతుండటం పట్ల పవన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది.
నోట్ల రద్దు వ్యవహారం కేంద్రం చెబుతున్నట్లుగా నిజంగా నల్లధనం వెలికి తీయటమైతే కాదన్న అనుమానం పవన్ లో కూడా ఉన్నట్లు సమాచారం. అందుకే ఎంపిలు, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లోని భాజపా ఎంపిలు బ్యాంకులు, క్యూలైన్లలో నిలబడాలని పిలుపినిచ్చారేమో.
కేంద్రం అనాలోచిత నిర్ణయం వల్లే దేశమంతా నోట్ల రద్దు సమస్యతో ఇబ్బందులు పడుతున్నట్లు పవన్ అభిప్రాయంతో ఉన్నట్లు తెలిసింది. ఈ సమస్య ముందుముందు మరింత పెరిగేదే కానీ తగ్గేది కాదన్న నిశ్చితాభిప్రాయంతో ఉన్నట్లు కూడా సమాచారం.
అదేవిధంగా ప్రజా సమస్యలపై భారీ ఎత్తున ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నారు. రాజధాని భూములు, బందరు పోర్టు కోసం సమీకరిస్తున్న భూములు, ప్రత్యేకహోదా సాధన, చట్టబద్దత లేని ప్రత్యేక ప్యాకేజి లాంటి అనేక అంశాలపై పవన్ తీవ్రంగా మధన పడుతున్నారు. సమస్యల పట్ల ప్రజల్లో చైతన్యం తేవటానికి వామపక్షాలతో కలిసి ఉద్యమాలు చేయాలన్న నిర్ణయానికి పవన్ వచ్చారు.