
అభిమాన హీరోలతో ఫోటో దిగాలని వారి అభిమానులందరికీ ఉంటుంది ఇది సహజం. అలాంటి అవకాశం రాగానే.. వారిని రిక్వెస్ట్ చేసి ఫోటోనో, సెల్ఫీనో తీసుకుంటూ ఉంటారు. కానీ.. ఒక అభిమానితో సెలబ్రెటీనే సెల్ఫీ తీసుకుంటే..? అందులోనూ అశేష అభిమానులుగల పవన్ కళ్యాణ్ లాంటి హీరో తీసుకుంటే.. ఆ వ్యక్తి నిజంగానే స్పెషల్ కదా. అదే జరిగింది.
ఇంతకీ విషయం ఏమిటంటే.. సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంగళవారం తన ట్విట్టర్ లో ఒక ఫోటో షేర్ చేశారు. ఒక అభిమానితో తానే స్వయంగా సెల్ఫీ దిగిన ఫోటో అది. అంతేకాకుండా..‘‘ సామాజిక, ఆర్థిక పరివర్తన కోసం నిరంతరం పనిచేసే అలుపెరగని కార్యకర్త మా ‘నిమ్మల వీరన్న’’ అనే క్యాఫ్షన్ తో ఆ ఫోటోలోని తన అభిమాని గురించి పరిచయం చేశారు పవన్. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ ట్వీట్ చేసిన ఈ ఫోటోని 17వేల మంది లైక్ చేయగా, 4.2వేల మంది రీట్వీట్ చేశారు.
పవన్ క్యాఫ్షన్ బట్టి.. అతను జనసేన పార్టీ కోసం పనిచేసే కార్యకర్త అన్న విషయం అర్థమౌతోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ పోటీ చేయాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే తాజాగా పార్టీ కార్యాలయాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ఇలాంటి కార్యకర్తల బలంతోనే పవన్ రాజకీయాల్లోకి దూసుకువెళ్తున్నాడని పలువురు భావిస్తున్నారు. పవన్ అభిమానులతో ఫోటో దిగడం ఇదేమీ తొలిసారి కాదు.. క్యాన్సర్ తో బాధపడుతున్న చాలా మంది అభిమానులను పవన్ స్వయంగా వారి ఇంటికి వెళ్లి కలిసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ.. ఇలా ప్రత్యేకంగా పొగడటం మాత్రం ఇదే తొలిసారి కావడం గమనార్హం.