
పై ఫొటోలు చూసారా. అందులో ఒకటేమో బడాబాబుల ఇంట్లో అధికారులు దాడులు జరిపినపుడు బయటపడిన డబ్బు. రెండో ఫొటోలో దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న అవస్తలకు వాస్తవ రూపం. కోట్లాది మంది సామాన్య ప్రజలు డబ్బుల కోసం 23 రోజులుగా నానా అవస్తలు పడుతుంటే కొద్ది మంది వద్ద కోట్ల కొద్దీ డబ్బు బయటపడుతోంది.
ఇది ఎలా సాధ్యమని కేంద్రప్రభుత్వాన్ని నిలదీస్తున్న సామాన్య ప్రజలకు సమాధానాలు చెప్పే వారే లేరు. ఎందుకంటే పెద్ద నోట్ల రద్దుతో మొదటి నుండి ఇబ్బందులు పడుతున్నది సామాన్య ప్రజలే. సమాజంలో బడాబాబులుగా పేరు పొందిన వారు కానీ లేక రాజకీయ నేతలు, సెలబ్రిటీలు కానీ ఎవ్వరూ ఒక్క రోజు కూడా బ్యాంకుల వద్ద గానీ ఏటిఎంల వద్దగానీ క్యూలైన్లలో నిలబడలేదు. ఒకరిద్దరు నిలబడినా కేవలం ప్రచారం కోసమే నిలబడ్డారు.
డబ్బు అవసరాలు ప్రతీ ఒక్కరికీ ఒకటే అన్నపుడు సమస్యలు అందరూ ఎదుర్కోవాల్సిందే కదా. 127 కోట్ల మంది ప్రజల్లో ఇబ్బందులు పడుతున్నది మాత్రం సామాన్యు ప్రజలే. మరి పెద్ద వాళ్లు మాత్రం ఎందుకు ఇబ్బందులు పడటం లేదంటే అందుకు పై ఫొటోనే సాక్ష్యం. బెంగుళూరులోని ఓ కాంట్రాక్టర్, ఇంజనీర్ల ఇళ్ళపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అధికారులు జరిపిన దాడుల్లో విస్తుగొలిపే డబ్బు కట్టలు బయటపడ్డాయి.
ఓ ఇంట్లో సుమారు రూ. 5 కోట్ల నగదు, రూ. 2 కోట్ల విలువైన బంగారం బయటపడింది. నగదులో నాలుగు కోట్ల రూపాయలు కొత్త రూ. 2 వేల నోట్లే కావటం గమనార్హం. ఏ ఖాతాదారుకి కూడా వారానికి రూ. 24 వేల కన్నా ఇవ్వకూడదన్నది ఆర్బిఐ నిబంధన. కరెంట్ ఖాతాదారులకు వారానికి రూ. 50 వేలకు మించి ఇచ్చేందుకు లేదు. నిబంధనలు అంత కఠినంగా ఉంటే కొంతమంది వద్ద మాత్రం కోట్ల కొద్దీ నగదు ఎలా బయటపడుతోంది.
అంటే నిబంధనలు సామాన్యులకే మాత్రమే అన్నది స్పష్టమవుతోంది. డబ్బు సమీకరణలో బడాబాబులకు మాత్రం ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అందులో బ్యాంకుల పాత్ర కూడా అనుమానమే. ఎందుకంటే బ్యాంకుల్లో నుండే పెద్ద మొత్తాల్లో డబ్బు బడాబాబుల వద్దకు చేరుతోంది. పలువురు బడాబాబుల వద్ద పెద్ద మొత్తాల్లో డబ్బు బయటపడుతున్న ఘటనలు అక్కడక్కడా వెలుగు చూస్తునే ఉన్నాయి. అందులోనూ అధికార పార్టీ నేతల వద్దే బయటపడుతుండటం గమనార్హం.