వాహనదారులకు శుభవార్త

First Published Jan 23, 2018, 5:32 PM IST
Highlights
  • రోజు రోజుకీ పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. వాహనదారులను కలవరపెడుతున్నాయి.

వాహనదారులకు త్వరలో కేంద్ర ప్రభుత్వం ఓ శుభవార్త వినిపించనుంది. ప్రస్తుతం రోజు రోజుకీ పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. వాహనదారులను కలవరపెడుతున్నాయి. అయితే.. వీటి ధరలను తగ్గించేందుకు సంబంధిత మంత్రుత్వ శాఖ చర్యలు చేపడుతోంది. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ ట్యాక్స్ ని తగ్గించాలని చమురు మంత్రుత్వశాఖ ఆర్థిక శాఖను కోరింది. 

వచ్చే నెలలో ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ని ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్ లో పెట్రోల్ , డీజిల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గించాల్సిందిగా చమురు మంత్రుత్వశాఖ అరుణ్ జైట్లీని కోరారు. ఈ మేరకు జైట్లీకి సంబంధిత ప్రతిపాదనలు కూడా జారీ చేశారు. ఆర్థిక శాఖ తమ ప్రతిపాదనను అమలుపరుస్తుందనే ఆశాభావాన్ని చమురు మంత్రుత్వశాఖ అధికారులు వ్యక్తం చేశారు.

ప్రస్తుతం పెట్రోల్‌పై రూ.19.48, డీజిల్‌పై 15.33 చొప్పున కేంద్రం ఎక్సైజ్‌ సుంకాన్ని విధిస్తోంది. దీనికి ఆయా రాష్ట్రాల వ్యాట్‌ అదనం. దీంతో వినియోగదారునిపై భారం పడుతోంది. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2014 నవంబర్‌ నుంచి 2016 జనవరి మధ్య తొమ్మిది సార్లు ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచింది. ఆ సమయంలో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తక్కువగా ఉన్నప్పటికీ సుంకం పెంపు కారణంగా వినియోగదారునికి ఆ ప్రయోజనం చేరలేదు. గతేడాది అక్టోబర్‌లో ఒక్కసారి మాత్రమే లీటరుకు రూ.2చొప్పున ఎక్సైజ్‌ సుంకాన్ని కేంద్రం తగ్గించింది. మరి చమురు మంత్రిత్వ శాఖ అభ్యర్థన ఫలిస్తోందో? లేదో తెలియాలంటే బడ్జెట్‌ వరకు ఆగాల్సిందే

click me!