
ఇప్పుడు తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు భారతరత్న ప్రదానం చేయాలని అక్కడ అధికారంలో ఉన్న ఏఐఏడిఎంకె ప్రభుత్వం కేంద్రం పై వత్తిడి తెస్తోంది.
పార్లమెంటులో జయలలిత కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని,ఆమెకు భారత రత్న ప్రదానం చేయాలనే ప్రధాన డిమాండ్లతో తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రధాని నరేంద్ర మోదీని కలిసి విజ్ఞాపన పత్రం సమర్పించడంతో చంద్రబాబునాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ లో ప్రకంపనలు మొదలయ్యాయి.
విశ్వవిఖ్యాత నటుడు, తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు (ఎన్టీఆర్ ) కు భారత రత్న ఇవ్వాలని కోరుతూ గత 18 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ నుంచి విజ్ఞప్తులు పంపుతునే ఉన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి ఉలుకుపలుకు లేదు. యుపిఏ అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్‌కు భారతరత్న వస్తుందనే ఆశ తెదేపాకు లేదు. ఇప్పుడు టిడిపి భాగస్వామిగా ఉన్న ఎన్డీఏ ప్రభుత్వ హయంలో (బిజెపి సారధ్యంలోని) ఎందుకు జరగడం లేదనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న !
గతంలో అటు యనైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో తానే చక్రం తిప్పానని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు - ఎన్టీఆర్‌కు భారత రత్న ఇప్పించడంలో విఫలమయ్యారు.
ఇప్పుడు తమిళనాడు సిఎం పన్నీర్ సెల్వం మంత్రివర్గ తీర్మానం చేసి మరీ పురచ్చి తలైవి జయలలితకు మరణానంతరం భారత రత్న ప్రదానం చేయాలనే డిమాండుతో ముందుకు వెళుతుంటే తెదేపాకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. అమ్మకన్నా ముందుగా అన్నకు భారత రత్న ఇవ్వాలని తెదేపా వర్గాలు కోరుకుంటున్నాయి. కానీ ఇది ఎలా సాధ్యం ? ఇద్దరు కేంద్ర కేబినెట్
మంత్రులతో పాటు 16 మంది ఎంపీల బలం ఉన్న టిడిపీకి ఇది సాధ్యమయ్యే పని కాదా?
1997 నుంచి చంద్రబాబు ఎన్టీఆర్‌కు భారతరత్న అంశాన్ని ప్రస్తావించడం మొదలుపెట్టారు.ఇందుకు తగ్గట్టుగా ప్రతి ఏటాఎన్టీఆర్ జయంతి రోజునో....వర్ధంతి రోజున కేంద్రానికి లేఖలు రాయడం ఆనవాయితీగా మారిపోయింది. 2004 నుంచి దాదాపు పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న తెలుగుదేశం పార్టీ - ఎన్టీఆర్‌కు భారత రత్న బిరుదు ప్రదానం పూర్తిగా మరుగునపడేలా చేసింది.
ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ప్రభావం చాలా మటుకు తగ్గిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్నప్పటికీ కొత్త రాజధాని నిర్మాణం, జగన్‌ను రాజకీయంగా ఎలా ఎదుర్కొనాలి ? అనే అంశాలపైనే దృష్టి కేంద్రీకరించడమే ఇతర విషయాలకు ప్రాధాన్యత తగ్గిపోయింది.
బిజెపి సారధ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి తమిళనాడు లోని అధికార ఏఐఏడిఎంకె పార్టీ మద్దతు ఉంది.ఐఏఏడిఎంకె పార్టీకి 37 మంది ఎంపీల బలం ఉంది. కేంద్ర ప్రభుత్వంలో కేవలం ఒకే ఒక మంత్రి, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవులు మాత్రమే ఉన్నాయి.తంబిదురై ప్రోద్బలంతోనే ఇప్పుడు జయలలితకు భారత రత్న ఇవ్వాలనే డిమాండు తెరపైకి వచ్చిందని సమాచారం ! తమిళనాట అధికారపార్టీ నేతలు తాము అనుకున్నదికచ్చితంగా సాధించగలరు !
రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలోను, రాష్ట్ర అభివృద్ధి విషయంలోను, ప్రాజెక్టులు మంజూరు చేయించుకోవడంలోను వారిని మించినవారెవరూ లేరు. దానికి తోడు ’ అమ్మ ‘ తర్వాత తమిళనాడు కోసం బిజెపి ఏమయినా చేసే లా ఉంది. ఎందుకంటే , తమిళనాడు కాలుమోపేందుకు ఇంతకు మించిన మంచి తరుణం రాదెప్పుడూ.
2013 వ సంవత్సరం మే 7వ తేదీన పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. అప్పటి కేంద్రమంత్రి, ఎన్టీఆర్ పెద్ద కుమార్తె పురందేశ్వరి ఆధ్వర్యంలో - తొమ్మిది అడుగుల ఎత్తుగల ఎన్టీఆర్ విగ్రహం తయారు చేయించి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌తో ఆవిష్కరింపచేశారు. ఈ విషయంలో కూడా బాబు వెనకబడ్డారనే అనాలి.
జిఎంసి బాలయోగి లోక్‌సభ స్పీకర్‌గా ఉన్న2000 వ సంవత్సరంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు ఒక పార్లమెంటరీ కమిటీ వేపారు కూడా ! కానీ అది కార్యరూపం దాల్చడానికి 13 ఏళ్లు పట్టింది. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు విషయంలో జరిగిన కృషి అంతా ` మాదంటే మాది ` అని ఇరువర్గాలు కొన్ని రోజుల పాటు వాదులాడుకున్నాయి.
ఆ తర్వాత అంతా మరచిపోయారు. ఎన్టీఆర్‌కు భారతరత్న కూడా అంతే ! ప్రతి ఏటా తెలుగుదేశం పార్టీ మహానాడు సమయంలో కానీ ఆయన జయంతి, వర్ధంతి రోజున కానీ తెలుగుదేశం ఎజెండాలో ఇదొక భాగం ! రెండు మూడు రోజుల పాటు నేతల ప్రకటనలు వస్తాయి. ఆ. తర్వాత షరా మామూలే !
ఇప్పుడు తమిళనాడు దివగంత ముఖ్యమంత్రి జయలలిత విగ్రహం ఏర్పాటుపై వివాదం లేదు కానీ...భారత రత్నపురస్కారం డిమాండు పై మాత్రం రాజకీయ ప్రత్యర్ధుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. తమిళనాట అమ్మగా పిలుచుకునే ప్రజల ఆరాధ్య దైవంగా జయలలిత గొప్ప రాజకీయ నాయకురాలనేది ఎవరూ కాదనలేని సత్యం !
అయితే ఎన్టీఆర్ మాదిరిగా జాతీయ స్థాయి నాయకురాలు కాదు. దక్షిణాదికి చెందిన గొప్ప నేతగా ఎన్టీరామారావుకు ఉత్తర భారత ప్రాంతంలో పేరు వచ్చింది కానీ... జయలలిత పేరు ఆ స్థాయిలో ప్రచారంలోకి రాలేదు. అప్పట్లో ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ నాయకుడిగా ఉత్తరాదిన కూడా ప్రజలను ఆకట్టుకోగలిగారు. అంతే కాకుండా సుదీర్ఘకాలం రాజకీయ జీవితంలో అవినీతి మచ్చపడని మనిషిగా నిలిచారు..
కానీ జయలలిత అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు.టాన్సీ భూముల కుంభకోణం సహా ఆమెకు వ్యతిరేకంగా సలు కేసులు నమోదయ్యాయి. న్యాయస్థానాలలో విచారణ కూడా జరిగింది.నెల రోజుల పాటు జైలు శిక్ష కూడా అనుభవించి విముక్తురాలైనా.. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చినా అవినీతి ఆరోపణలు మాత్రం ఆమెను చివరి వరకు వెంటాడాయి.
తమిళనాడు నుంచి 1988లో దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్ కు మరణానంతరం భారత రత్న ప్రదానం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు కామరాజ్ నాడార్‌కు భారతరత్న పురస్కారం లభించింది.
స్వరాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కకపోయినా పరవాలేదు...ప్రత్యేక ప్యాకేజితో సరిపెట్టుకుందాం..! అనే రాజీ ధోరణితో అన్నింటికీ అంగీకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎన్టీఆర్‌కు భారతరత్న గురించి కేంద్రంతో వివాదానికి దిగగలరా ? అనే విమర్శలు ప్రధాన ప్రతిపక్షం నుంచి వెల్లువెత్తుతున్నాయి.
బంతి ఇప్పుడు కేంద్రం పరిధిలో ఉంది. భారతరత్న పురస్కారాన్ని ముందుగా ఎన్టీఆర్‌కు ప్రకటిస్తారా? లేక పురచ్చితలైవి జయలలితకా ? అనేది వేచి చూడాల్పి ఉంది.